కొండా అక్క...చివరాఖరున మంచి పని చేశారు !

నిజానికి కొండా సురేఖకు జనంలో ఆదరణ ఉంది. అందుకే ఆమె గత మూడు దశాబ్దాల కెరీర్ లో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Update: 2026-09-03 17:53 GMT

కొండా సురేఖ రాజకీయ జీవితంలో అవకాశాలు చాలా వచ్చాయి. అయితే వాటిని చాలా సులువుగా కాలదన్నుకోవడం ఆమెకు మాత్రమే తెలిసిన విద్య అంటే ఎవరైనా ఇట్టే ఏకీభవిస్తారేమో. కొండా సురేఖ వైఎస్సార్ మంత్రివర్గంలో అది కూడా ఆయన రెండో విడత 2009లో గెలిచినపుడు చేరారు. వైఎస్సార్ ఆమెను గుర్తించి మంచి అవకాశం ఇచ్చారు. అయితే వైఎస్సార్ కేవలం మూడు నెలలకే మరణించారు. దాంతో ఆయన మీద అమితమైన భక్తితో కొండా సురేఖ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేసి వదులుకున్నారు. అంటే ఆనాడు మంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటే అన్న మాట. తిరిగి 14 ఏళ్ళ తరువాత ఆమెకు లక్కీ చాన్స్ వచ్చింది. రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ఆమెకు చోటు దక్కింది. అలా 2023 డిసెంబర్ 7న ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంకా డిసెంబర్ నెల రాలేదు మూడు నెలల ముందుగానే ఆమె పదవి పోయింది. తొలినాడు మూడు నెలల మంత్రి పదవితో కలుపుకుంటే అచ్చంగా ఆమె తన రాజకీయ జీవితంలో మూడేళ్ల పాటు మంత్రిగా చేశారు అనుకోవాలి.

జనంలో ఆదరణ ఉన్నా :

నిజానికి కొండా సురేఖకు జనంలో ఆదరణ ఉంది. అందుకే ఆమె గత మూడు దశాబ్దాల కెరీర్ లో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు అయితే బీఆర్ఎస్ నుంచి ఒకసారి అన్న మాట. దాని కంటే ముందు 1995లో ఆమె రాజకీయ జీవితం మండల పరిషత్ చైర్మన్ గా ప్రారంభం అయింది. ఆ వెంటనే కాంగ్రెస్ లో పీసీసీ మెంబర్ అయ్యారు. ఇక పీసీసీ చీఫ్ గా వైఎస్సార్ ఆమెకు ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసే చాన్స్ కల్పించారు. అలా 1999లో తొలిసారి ఆమె ఎమ్మెల్యేగా శాయంపేట నుంచి గెలిచారు. 2004లో కూడా శాయంపేట నుంచి గెలిచారు. 2009లో పరకాల నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. వైఎస్సార్ ఆమెకు శిశు సంక్షేమం, వికలాంగులు, బాలల సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. వైఎస్సార్ మరణానంతరం ఆమె తప్పుకున్నారు. ఆమె తప్ప ఆనాటి కేబినెట్ లో మిగిలిన వారు అంతా రోశయ్య మంత్రివర్గంలో చేరారు, ఆ తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు.

ఏటికి ఎదురీదడమే :

జనాదరణ బాగా ఉంది, అదే సమయంలో కాంగ్రెస్ ఆమెను ఎంతో ఆదరించింది. అయినా సరే బీఆర్ఎస్ వైసీపీ వంటి పార్టీలలో చేరి కొండా సురేఖ తన రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ లోనే ఆమె నాలుగు సార్లు గెలిచి రెండు సార్లు మంత్రి అయిన విషయం మరచారు అని అంటున్నారు. తాను ఎక్కిన కొమ్మనే నరుక్కోవడం రాజకీయం కాదని దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నా ఆమె నేర్చుకోలేదని అంటున్నారు. లేకపోతే మంత్రి పదవి ఇలా పుటుక్కున పోయేదా అని అంటున్నారు.

తెలిసి వచ్చిందా :

తనను బర్తరఫ్ చేసిన విషయం మీద ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అవి ఎందుకో సాయంత్రం అయ్యేసరికి ఆగిపోయాయి. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతాను అని ఎమ్మెల్యేగా ఉంటాను అని సురేఖ చెప్పడం ద్వారా ఈ సస్పెన్స్ కి తెర దించారు. నిజానికి ఆమె తన ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తే కనుక కచ్చితంగా అక్కడ కాంగ్రెస్ గెలిచేది. ఆమె ఏ పార్టీ నుంచి చేసినా ఓటమి ఎదురయ్యేది అని అంటున్నారు. దీనికి నిలువెత్తు ఉదాహరణగా 2012లో జరిగిన పరకాల ఉప ఎన్నికలను చూపిస్తున్నారు. ఆమె కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరఫున పోటీ చేస్తే ఓటమి ఎదురైంది. మొత్తం మీద కొండా సురేఖ ఎమ్మెల్యేగా అయినా ఇపుడు ఉంటారు కాబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మళ్ళీ రాజకీయంగా బాగా ఉంటుందేమో. ఏది ఏమైనా సురేఖ అక్క ఎమ్మెల్యేగా కొనసాగి మంచి పని చేశారు అని అంటున్నారు.

Tags:    

Similar News