రియాలటీలోకి నాగబాబు.. పవన్ ఇచ్చిన టాస్క్ పై ఫోకస్
విద్యార్థులతో కలిసి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో సినీ నటుడు నాగబాబు కార్యక్షేత్రంలోకి దిగారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంపు, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రీన్ కార్పొరేషన్ లో పనులను ప్రారంభించారు. ఇటీవలే చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన నాగబాబు తొలిసారిగా క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో తాటిచెట్ల పెంపునకు విత్తనాలు జల్లారు. విద్యార్థులతో కలిసి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
చురుగ్గా నాగబాబు
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ హోదాలో నాగబాబు పూర్తి సంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని దాదాపు ఏడాదిన్నర కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో ఒక ఖాళీ ఉన్నప్పటికీ సీఎం ఇచ్చిన హామీ అమలు కాలేదు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టే సమయంలో నాగబాబును మంత్రిని చేస్తారని భావించారు. కానీ ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో నాగబాబుకి ఇచ్చిన హామీ అటకెక్కినట్లేనా? అన్న అనుమానాలను వ్యక్తం అయ్యాయి. కానీ, ప్రభుత్వం అనూహ్యంగా ఆయనకు మంత్రి హోదాకు ఏ మాత్రం తగ్గని విధంగా ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్ కు నాగబాబును తొలి చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.
పర్యావరణ ప్రేమికుడు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యావరణ ప్రేమికుడుగా చెబుతున్నారు. తన చుట్టూ పచ్చని వాతావరణం ఉండాలనే సంకల్పంతో పవన్ ఏరికోరి అటవీ, పర్యావరణ శాఖలను తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పచ్చదనం పెంచేలా ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ ద్వారా మొక్కలు పెంచేకార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. పలు రకాల మొక్కలు పెంచేందుకు విత్తనాలను ఉండలుగా చుట్టి అటవీ ప్రాంతంలో జల్లారు. అయితే ఈ కార్యక్రమం మొక్కుబడి తంతుగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను తీసుకువచ్చారు. దీనికి తనలాగే పర్యావరణాన్ని ఇష్టపడే సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబును చైర్మనుగా నియమించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ ఆలోచనలకు తగినట్లుగానే నాగబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే రంగంలోకి దిగారని అభినందనలు అందుకుంటున్నారు.
సముద్ర తీరాన తాటిచెట్లు
వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంతో పాటు జీవవైవిధ్యం, జీవరాశుల మనుగడను కాపాడుకోవడానికి పచ్చదనం పెరగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు అభిప్రాయపడుతున్నారు. మొక్కలు నాటడం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, భావి తరాల భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఈ ఉద్దేశంతోనే బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో తాటిచెట్ల పెంపకానికి చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. సముద్రపు కోతను అరికట్టడానికి తీరంలో తాటి చెట్లు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. “గ్రేట్ గ్రీన్ వాల్’’ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కనీసం 20 ఏళ్ల ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.