తమిళనాడు నుంచి ఏపీకి మరో భారీ ప్రాజెక్టు? కాకినాడలో హెచ్‌డీ హ్యుందాయ్ షిప్‌యార్డ్!

తమిళనాడుతో పోలిస్తే ఆకర్షణీయమైన ఇన్సెంటివ్స్ అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఆఫర్ చేయడంతోనే హెడ్ హ్యుందాయ్ యాజమాన్యం ఏపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Update: 2026-09-03 10:40 GMT

రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో దూకుడుగా అడుగులు వేస్తోంది. పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు కల్పిస్తూ, వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో నిర్మించాల్సిన ఒక ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టు ఇప్పుడు ఏపీ వైపు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని తూత్తుకూడిలో నిర్మించాలని తొలుత ప్రతిపాదించిన 'హెచ్‌డీ హ్యుందాయ్ షిప్‌యార్డ్' ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని ఆ సంస్థ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్టు కోసం కాకినాడలో స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

తమిళనాడుతో పోలిస్తే ఆకర్షణీయమైన ఇన్సెంటివ్స్ అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఆఫర్ చేయడంతోనే హెడ్ హ్యుందాయ్ యాజమాన్యం ఏపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ ప్రాజెక్టును కాకినాడ రప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిందని, కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపుతోందని చెబుతున్నారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అంటున్నారు.

ఇందులో భాగంగానే షిప్‌యార్డ్ - సముద్ర ఆధారిత పరిశ్రమల దిగ్గజాలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతానికి యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు రావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నిదర్శనంగా నిలిచింది. దానిని కొనసాగిస్తూ, ఇప్పుడు హెచ్‌డీ హ్యుందాయ్ షిప్‌యార్డ్ లాంటి అంతర్జాతీయ ప్రాజెక్టును కూడా ఏపీకి తీసుకురావడానికి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోందని అంటున్నారు.

ఈ ప్రయత్నాలు గనుక సఫలమైతే, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మేటి పారిశ్రామిక, తయారీ రంగ హబ్‌గా రూపాంతరం చెందడంలో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. షిప్‌యార్డ్ నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. మొత్తంగా, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న చొరవ, పారిశ్రామిక అనుకూల విధానాల వల్ల ఏపీ భవిష్యత్తులో దేశంలోని ప్రముఖ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలవనుంది.

Tags:    

Similar News