రక్తం కారుతున్నా మ్యూజిక్ ఆపలేదు...జాతీయ అవార్డు కొట్టారు !

మెలోడీ సంగీతానికి ఆయన పెట్టింది పేరు. ఆయనే పసుపులేటి రమేష్ నాయుడు.

Update: 2026-09-03 07:22 GMT

మెలోడీ సంగీతానికి ఆయన పెట్టింది పేరు. ఆయనే పసుపులేటి రమేష్ నాయుడు. కేవలం పదిహేడేళ్ళకే మ్యూజిక్ డైరెక్టర్ కావడం అంటే మామూలు విషయం కాదు, సంగీత ప్రజ్ఞ ఉంది కాబటే రమేష్ నాయుడికి మాత్రమే అది సాధ్యమైంది. ఇక సంగీత దర్శకుడు రమేష్ నాయుడు జీవితం అంటేనే ఒక అద్భుతం అని చెప్పాలి. ఆయన 1933 నవంబర్ 27న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కొండపల్లిలో జన్మించారు. బాల్యం అంతా జిల్లా కొండపల్లిలో సాగింది. సంగీతం మీద మక్కువతో 14 ఏళ్ల వయసులో బిఆర్ చోప్రా మార్గదర్శకత్వంలో హెచ్ఎంవి సంస్థలో సంగీత వాయిద్యాలపై శిక్షణ పొందారు. 17 ఏళ్ళ ప్రాయంలోనే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. తొలిసారిగా మరాఠీ చిత్రం బాండ్వాల్ పహిజా కు సంగీత దర్శకత్వం వహించారు. ఇక తెలుగులో కృష్ణవేణి నిర్మించిన దాంపత్యం సినిమాతో పరిచయమయ్యారు.

ఇతర భాషలలో సక్సెస్ :

ఇదిలా ఉంటే తొలి రోజులలో రమేష్ నాయుడు ఇతర భాషలలో ఎక్కువగా పనిచేశారు. ముంబై, కలకత్తాలలో గడిపి బెంగాలీ, నేపాలీ, ఒరియా చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. అలా మళ్ళీ 1972లో అమ్మ మాట సినిమాతో మళ్లీ తెలుగు చిత్రసీమకు వచ్చారు. అక్కడ నుంచి మరణించేవరకూ దశాబ్దన్నర కాలం తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలకు బాణీలు కట్టి తన పేరుని శాశ్వతం చేసుకున్నారు. అందులో మేటి ఏమిటి అంటే 1982లో వచ్చిన అద్భుతమైన చిత్రం మేఘసందేశం. ఈ చిత్రానికి సంగీతం అందించినందుకు గానూ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడు అవార్డు అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మూడు నంది అవార్డులను కైవసం చేసుకున్నారు.

లలిత సంగీత దర్శకుడు :

ఆయన కెరీర్ లో శివరంజని (1978), ఆనంద భైరవి (1983), శ్రీవారికి ప్రేమలేఖ (1984), స్వయం కృషి (1987) వంటి సినిమాలకు అద్భుతమైన బాణీలు అందించారు. ఎన్నో సినిమాలకు లలిత సంగీతం లాంటి మ్యూజిక్ అందించిన రమేష్ నాయుడు 1987సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన చివరి చిత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి. ఈ చిత్రం విడుదలయ్యే ముందు రోజే రమేష్ నాయుడు మరణించడం విశేషం. అప్పటికి ఆయన వయసు 54 ఏళ్ళు మాత్రమే. చిన్న వయసులోనే దివికేగిన రమేష్ నాయుడు తెలుగులో మెలోడీ సంగీత ప్రియులకు ఒక విధంగా అన్యాయం చేశారు అని చెప్పాలి. ఆయన మరింత కాలం జీవించి ఉంటే ఎంతో హృద్యమైన సంగీతం తెలుగు వారి సొంతం అయ్యేది.

పాటకు ప్రాణం పోసి :

ఇక రమేష్ నాయుడుని ఎక్కువగా ప్రోత్సహించిన దర్శకులలో దాసరి నారాయణరావు తొలి స్థానంలో ఉంటారు. ఆయన ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మేఘ సందేశం చిత్రం కోసం సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడిని ఎన్నుకున్నారు. అప్పటికే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం మూవీ సంగీత కళాఖండంగా నిలిచింది. దానికి ధీటుగా మూవీ తీయాలని దాసరి సంకల్పించారు. దాంతో ఈ మూవీ కోసం రమేష్ నాయుడు నిజంగా ప్రాణాలే పెట్టేశారు. అప్పటికే ఆయనకు అనారోగ్యం వెంటాడుతోంది. అయినా ఈ సినిమా ఒక్కో పాటను తపస్సుగా రోజుల తరబడి చేశారు. అందులో ఆకాశ దేశాన ఆషాడ మాసాన పాట సాంగ్ కంపోజింగ్ చేస్తూ హార్మోనీ మీద ఆయన వాయిస్తున్నప్పుడు ఆయన ఒంట్లో బాగులేక ఎంతో సతమతం అయ్యారని చెబుతారు. ఆయన ముక్కు నుంచి రక్తం కారుతూ హార్మోనీ మీద చేతి వేళ్ల మీద పడుతున్నా ఎక్కడా ఆగకుండా సంగీత యజ్ఞమే చేసి ఆ పాటకు శాశ్వతత్వం కల్పించారు. కేజే ఏసుదాస్ ఆ పాటను పాడి ఎవర్ గ్రీన్ హిట్ చేశారు. తనకు నచ్చిన వారితోనే పనిచేస్తూ సెలెక్టివ్ గానే సినిమాలు చేసిన రమేష్ నాయుడు అత్యంత ప్రతిభావంతుడైన మ్యూజిక్ డైరెక్టర్ అనడంలో సందేహం లేదు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా సంగీతాభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

Tags:    

Similar News