రాములమ్మకు మంత్రి యోగం ?
కొండా సురేఖ ఎపిసోడ్ దాదాపుగా క్లైమాక్స్ కి చేరుకున్నట్లే అని అంటున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీదనే నోరు పారేసుకున్న సురేఖ కుమార్తె సుస్మిత తల్లి మంత్రి పదవికే ఎసరు తెచ్చారు అని అంటున్నారు.
కొండా సురేఖ ఎపిసోడ్ దాదాపుగా క్లైమాక్స్ కి చేరుకున్నట్లే అని అంటున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీదనే నోరు పారేసుకున్న సురేఖ కుమార్తె సుస్మిత తల్లి మంత్రి పదవికే ఎసరు తెచ్చారు అని అంటున్నారు. దాంతో కేంద్ర కాంగ్రెస్ పెద్దలు అంతా ఆమెను సాగనంపడానికే నిర్ణయించారు అన్నది ఢిల్లీ కబురుగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఆశావహులు ఇపుడు కేబినెట్ బెర్త్ లో కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధినాయకత్వం తొందరలోనే అనుమతి ఇస్తుందని అంటున్నారు. కొండా సురేఖను తప్పిస్తే బీసీల ఆగ్రహానికి గురి కాకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు రెడీ చేసి ఉంచారని అంటున్నారు. దాని ప్రకారం ఇలా కొండా అవుట్ అయితే ఆమె ప్లేస్ లో అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకుని భర్తీ చేస్తే కాంగ్రెస్ కి ఏ విధమైన ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు అని అంటున్నారు.
రేసులో విజయశాంతి :
ఇదిలా ఉంటే కొండా సురేఖ వ్యవహారం పాకన పడడంతో ఆశావహులు అంతా రేసులోకి వస్తున్నారు. ఇక గత ఏడాది ఎమ్మెల్సీగా పెద్దల సభలో ప్రవేశించిన సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతికి కొండా సురేఖ ప్లేస్ లో మంత్రి పదవి దక్కే చాన్స్ అధికంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆమె కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారుగా చెబుతున్నారు. ఆమె కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు. అలాగే ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు. దాంతో విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాజకీయ సామాజిక సమతూకం పాటించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు విజయశాంతి సినీ గ్లామర్ ని ఆమె ఇమేజ్ ని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వినియోగించుకోవడానికి వీలు ఉంటుందని అంటున్నార్జు.
పెద్దల ఆశీస్సులు :
ఇక విజయశాంతి విషయానికి వస్తే చివరి నిముషంలో ఆమె ఎమ్మెల్సీ అభ్యర్ధిగా అనూహ్యంగా ఎంపిక అయ్యారు. ఆ నిర్ణయం వెనక కేంద్ర పెద్దల దీవెనలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇపుడు కూడా కేంద్ర పెద్దలు ఆమెకి మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ బలోపేతానికి వాడుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి సూచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే కొండా సురేఖ ఫైర్ బ్రాండ్ ఆమె పార్టీని వీడి రేపటి రోజున కాంగ్రెస్ మీద నిప్పులు చెరగడం ఖాయమని అంటున్నారు ఆమెని ఢీ కొట్టాలి అంటే సొంత ఇమేజ్ కలిగిన బలమైన నాయకులు అయితేనే సాధ్యమని కాంగ్రెస్ పెద్దలు నమ్ముతున్నారని తెలుస్తోంది. దాంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కేంద్ర మంత్రి పదవి విజయశాంతికి ఇపుడు వెతుక్కుంటూ వస్తోంది అని అంటున్నారు. ఒకవేళ ఆమె పేరు కాకపోతే గద్వాల విజయలక్ష్మి పేరు కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరిలో ఒకరికి కొండా సురేఖ ప్లేస్ లో మంత్రి పదవి ఖాయమని అంటున్నారు.
విస్తరణకు రెడీ :
కేవలం కొండా సురేఖ వల్ల ఏర్పడిన మంత్రి పదవిని భర్తీ చేసి ఊరుకోకుండా పూర్తి స్థాయి విస్తరణ చేపడతారని అంటున్నారు. కేబినెట్ లో పనిచేయని వారిని పక్కన పెట్టి కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారని కూడా అంటున్నారు. ఆ విధంగా మంత్రి వర్గ విస్తరణ జరపడం ద్వారా మరి కొంతమందిని తప్పించి కొండా సురేఖ ఒక్కరి మీదనే వేటు పడలేదు అన్న సంకేతాలను ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు.