ఏఐపై నిషేధం: అందరూ ముందుకెళుతుంటే.. న్యూయార్క్ మేయర్ మమ్దానీ వెనక్కి తీసుకెళుతున్నాడు..

దాదాపు 6 లక్షల మంది చిన్నారులను ఒకే ఒక్క నిర్ణయంతో "చాట్‌జిపిటి ప్రపంచం" నుంచి బయటకు లాగి మళ్లీ పాతకాలపు పుస్తకాలు, పెన్నుల వైపునకు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Update: 2026-09-03 05:07 GMT

ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) జపం చేస్తూ భవిష్యత్తు వైపు పరుగులు తీస్తుంటే న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ మాత్రం హాయిగా సైకిల్ ‘రివర్స్ గేర్’ వేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 2-కే నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులపై ఏఐ వాడకంపై ఏడాది పాటు ఏకంగా నిషేధ ముద్ర వేశారు. దాదాపు 6 లక్షల మంది చిన్నారులను ఒకే ఒక్క నిర్ణయంతో "చాట్‌జిపిటి ప్రపంచం" నుంచి బయటకు లాగి మళ్లీ పాతకాలపు పుస్తకాలు, పెన్నుల వైపునకు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.

మమ్దానీ గారి మార్క్ తర్కం చాలా సింపుల్‌గా ఉంది. హోమ్‌వర్క్ లేదా మ్యాథ్స్ ప్రాబ్లమ్ రాగానే చాట్‌బాట్‌ను అడిగి క్షణాల్లో ఆన్సర్ కొట్టేయడం కాకుండా కొంచెం బుర్రకి పదును పెట్టండి అంటున్నారు. పిల్లలు కష్టపడాలి.. తప్పులు చేయాలి.. ఆ కష్టంలోంచే కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేది ఆయన సిద్ధాంతం. టీచర్ ఇచ్చిన వ్యాసాన్ని ఏఐతో రాయిస్తే దానికి విలువ ఏముంటుంది? సొంతంగా ఆలోచించి, తప్పులు చేసి, సరిదిద్దుకున్నప్పుడే కదా నిజమైన భాషా నైపుణ్యం ఒంటపట్టేది.. అందుకే ఏఐ వచ్చి పిల్లల తరఫున ఆలోచించేస్తే ఇక వారి సొంత బుర్ర ఎందుకని మేయర్ గారు చాలా నిష్కర్షగా ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ నిషేధంతో పాటు స్క్రీన్ టైమ్‌పై కూడా ప్రభుత్వం గట్టి ఆంక్షలే విధించింది. మూడో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలకు రోజుకు కేవలం ముప్పై నిమిషాలు, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి పిల్లలకు నలభై ఐదు నిమిషాల సమయం మాత్రమే డిజిటల్ స్క్రీన్ల కోసం కేటాయించారు. అంతేకాకుండా పాఠశాలల్లో పిల్లలకు తోడుగా ఉండే ఏఐ చాట్‌బాట్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. అయితే హైస్కూల్ పిల్లలకు మాత్రం ఏఐ పరిజ్ఞానంపై కొంత మినహాయింపు ఇచ్చారు. అక్కడ ఏఐని వాడటం కంటే కూడా అది ఇచ్చే సమాచారంలో తప్పులను ఎలా పట్టుకోవాలి.. దాంట్లోని పరిమితులు ఏమిటనే విషయాలపై పరిమితంగా పాఠాలు చెప్పనున్నారు.

మిగతా ప్రపంచమంతా టెక్నాలజీ పిచ్చిలో పడి పిల్లల చేతికి డైరెక్ట్‌గా ఏఐ ఇచ్చేస్తుంటే న్యూయార్క్ మాత్రం ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తోంది. పిల్లలకు కావాల్సింది ఏఐ షార్ట్‌కట్లు కాదని, సొంత ఆలోచన, సృజనాత్మకత, సమస్యలను ఎదుర్కొనే ధైర్యమని ఈ ప్రయోగం ద్వారా చాటిచెబుతోంది. ఈ ఒక ఏడాది విరామం శాశ్వతమైనది కాకపోయినా ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం గుర్తుచేస్తోంది. మనుషులు ఏఐని ఒక సాధనంగా వాడాలి తప్ప ఏఐ మన పిల్లలను తన కంట్రోల్లోకి తీసుకోకూడదు. ప్రపంచమంతా ముందూ వెనుకా చూడకుండా ఏఐ వెనక పరుగులు తీస్తున్న వేళ, "మనం పిల్లలకు ఏఐ నేర్పిస్తున్నామా? లేక ఏఐకే మన పిల్లలను అప్పగించేస్తున్నామా?" అని న్యూయార్క్ విసిరిన ప్రశ్న నిజంగా ఆలోచించదగ్గదే!

Tags:    

Similar News