కొండా ఔట్ .. చిన్నారెడ్డి బోనస్ !
మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లోక్ భవన్ లోని గవర్నర్ కార్యాలయానికి ఆమెను తొలగించాలని కోరుతూ లేఖ రాసినట్లు సమాచారం. రాజీనామా చేయాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొండా సురేఖను ఆదేశించారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి ముందే బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు బయటకు రావడం విశేషం.
ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్న కొండా సురేఖ ఈ రోజు తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ మీడియా సమావేశంలో వెల్లడిస్తారని ప్రచారం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి బర్తరఫ్ ఉత్తర్వులు వెలువడేంత వరకు కూడా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని కొండా నివాసం కుటుంబ సభ్యులు మినహా అనుచరుల జాడ కనిపించలేదు. అటు వరంగల్ లోని నివాసం వద్ద కూడా వారి మద్దతు దారుల సందడి లేకపోవడం గమనార్హం.
కొండా సురేఖతో పాటు పార్టీ నాయకత్వం మీద ఆరోపణలు చేశారని, ఈ నేపథ్యంలో ఆయనను కూడా పదవి నుండి తొలగించాలని క్రమశిక్షణ సంఘం సిఫారసు ఎదుర్కొన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ని కూడా పదవి నుండి తొలగించారు. ఆయన స్థానంలో మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా ఉన్న ప్రభుత్వ సలహాదారు కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి నియమించడం గమనార్హం.
ఇక గద్వాల విజయలక్ష్మి స్థానంలో మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారదను నియమించారు. ఇక కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇక కొండా సురేఖ స్థానంలో మంత్రి ఎవరు అన్నది ఇప్పట్లో చేసేలా లేదు. దాని మీద అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో శాసనసభ సమావేశాల అనంతరమే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
మొత్తానికి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత రేపిన రాజకీయ చిచ్చు కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ దాకా వచ్చింది. గతంలో సుష్మిత చేసిన ఆరోపణలపై మిన్నకుండి పోయిన రేవంత్ రెడ్డి తాజా వివాదంపై గట్టిగానే పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కొండా సురేఖ వివాదం తెరపైకి రాకుంటే చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి పోయేది కాదని, కొండా సురేఖను తప్పించాలంటే చిన్నారెడ్డిని తొలగించక తప్పని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. బర్తరఫ్ విషయంలో కొండా సురేఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.