ట్రంప్ మావా.. తిక్క కుదిరిందా? 'బర్త్‌రైట్'పై కోర్టు గట్టి డోస్!

తీరా సెప్టెంబర్ 5న మార్గదర్శకాలు విడుదల చేద్దామని ట్రంప్ టీమ్ కాగితాలు సర్దుకునేలోపే మేరీల్యాండ్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి డెబోరా బోర్డ్‌మన్ రూపంలో పెద్ద విలన్ వచ్చి పడ్డారు.

Update: 2026-09-03 17:45 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి వార్తల్లో నిలవడానికి రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వలసదారుల పొట్ట కొట్టడం.. పుట్టబోయే పిల్లల పౌరసత్వాన్ని లాక్కోవడం ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యాపకంలా మారిపోయింది. "అమెరికాలో పుడితే చాలు.. ఆటోమేటిక్‌గా సిటిజన్‌షిప్ ఇచ్చేయడమేంటి? ఈ రూల్‌నే తీసేస్తా!" అంటూ తొడగొట్టి మరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు తెచ్చిన ట్రంప్ తాతకు, అమెరికా న్యాయస్థానాలు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. తాజాగా మేరీల్యాండ్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ట్రంప్ మార్క్ 'స్కెచ్' మరోసారి అడ్డం తిరిగింది.

బర్త్ టూరిజంపై కన్ను.. కోర్టు వేసింది చిన్న కన్ను

14వ రాజ్యాంగ సవరణను తిరగరాయాలని చూసిన ట్రంప్‌కు గతంలో సుప్రీంకోర్టు కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయినా తగ్గేదేలే అన్నట్లు ఈసారి ఆగస్టు 6న రూటు మార్చి కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఈసారి "బర్త్ టూరిజం" అంటే కేవలం పిల్లలకు సిటిజన్‌షిప్ తెచ్చుకోవడానికే అమెరికాలో ల్యాండ్ అయ్యేవాళ్లు పై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నానంటూ హడావుడి చేశారు. తల్లిదండ్రులు ప్రసవం కోసమే వచ్చినా విదేశీ ప్రభుత్వ ఉద్యోగులైనా, లేదా అబద్ధాలు చెప్పి వచ్చినా సరే.. ఇక్కడ పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇచ్చేది లేదంటూ కొరడా ఝళిపించారు. "ఇదిగో సెప్టెంబర్ 5 కల్లా గైడ్‌లైన్స్ వచ్చేస్తున్నాయి.. ఇక నా ఆట చూడండి" అని బిల్డప్ కూడా ఇచ్చారు.

అడ్వాన్స్ ‘గిఫ్ట్’ ఇచ్చిన మేరీల్యాండ్ జడ్జి

తీరా సెప్టెంబర్ 5న మార్గదర్శకాలు విడుదల చేద్దామని ట్రంప్ టీమ్ కాగితాలు సర్దుకునేలోపే మేరీల్యాండ్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి డెబోరా బోర్డ్‌మన్ రూపంలో పెద్ద విలన్ వచ్చి పడ్డారు. సీఏఎస్ఏ, అసైలమ్ సీకర్ అడ్వకేసీ ప్రాజెక్ట్ వంటి హక్కుల సంస్థలు వేసిన పిటిషన్‌ను విచారించిన జడ్జి అమ్మగారు.. "ఆగండి తాతగారూ మీరు తెచ్చిన ఆర్డర్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టండి" అంటూ స్పాట్‌లోనే ప్రిలిమినరీ ఇంజంక్షన్ జారీ చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న వేసిన సెంటిమెంట్ పాచికలు నీరుగారిపోయాయి.

న్యాయశాఖ లాయర్ల ఏడుపు.. వినేనా కోర్టు

"అయ్యో అధ్యక్షా మన కొత్త ఆర్డర్ పాతదాని కంటే చాలా చిన్నదండి.. ఇప్పటికిప్పుడు దీన్ని ఆపాల్సిన అవసరం లేదు, సెప్టెంబర్ 5దాకా ఆగితే మా గైడ్‌లైన్స్ చూపిస్తాం" అని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ లాయర్లు ఎంత మొత్తుకున్నా జడ్జి గారు అస్సలు కనికరించలేదు. రాజ్యాంగబద్ధమైన హక్కులతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పేశారు.

మొత్తానికి బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేసి తన ఓటు బ్యాంకును ఖుషీ చేద్దామనుకున్న ట్రంప్ ప్లాన్‌కు అమెరికా చట్టాలు వరుసగా బ్రేకులు వేస్తూనే ఉన్నాయి. ఒక్క సంతకంతో అంతా మార్చేయవచ్చని అనుకున్న ట్రంప్‌కు అమెరికా రాజ్యాంగం అంత తేలికగా వంగనని మరోసారి నొక్కిచెప్పినట్లయింది. మరి ఈ 'తిక్క' తగ్గించుకుని ట్రంప్ ఊరుకుంటారా లేక మళ్లీ ఇంకో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో తయారవుతారా అనేది మున్ముందు చూడాలి.

Tags:    

Similar News