చెప్ప‌కుండానే చెక్ పెడుతున్న సేనాని.. !

ఇక‌, ఇప్పుడు ఆ స్థానంలో `జైకొట్టు` పేరుతో యువ‌సేన‌కు శ్రీకారం చుట్టారు. ఇది అంత చిన్న విష‌యం కాదు.. చాలా వ్యూహాత్మ‌కంగానే జ‌న‌సేన పార్టీ అడుగులు వేసింది.

Update: 2026-09-03 13:30 GMT

జ‌న‌సేన పార్టీలో కొంద‌రు సీనియ‌ర్లు.. కులాల ప్రాతిప‌దిక‌న చేస్తున్న రాజ‌కీయం త‌ర‌చుగా పార్టీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీని వ‌ల్ల పార్టీ ఇమేజ్ దెబ్బ‌తింటోంద‌ని అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్నారు. అయినా కొంద‌రు ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌లేకపోతున్నారు. మ‌రికొన్ని చోట్ల కూట‌మి నాయ‌కుల మ‌ధ్య వివాదాలు నివురు గ‌ప్పిన నిప్పులా మారుతున్నాయి. ఈ ప‌రిణామాలు కూడా పార్టీని వేధిస్తున్నాయి. అందుకే.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కీల‌క ప‌ద‌వుల‌ను స‌స్సెండ్ చేశారు.

ఇక‌, ఇప్పుడు ఆ స్థానంలో `జైకొట్టు` పేరుతో యువ‌సేన‌కు శ్రీకారం చుట్టారు. ఇది అంత చిన్న విష‌యం కాదు.. చాలా వ్యూహాత్మ‌కంగానే జ‌న‌సేన పార్టీ అడుగులు వేసింది. సీనియ‌ర్ల‌కు చెక్ పెట్ట‌డంతో పాటు.. పార్టీ లైన్ త‌ప్పిన వారికి కూడా జైకొట్టు ఒక కీల‌క హెచ్చ‌రిక‌గా మార‌నుంది. ఎన్నిక‌ల‌కు మూడు ఏళ్ల ముందే ఈ విభాగాన్ని ఏర్పాటు చేయ‌డం వెనుక ఉద్దేశాలు కూడా.. సీనియ‌ర్ల‌కు మింగుడు ప‌డ‌ని విధంగా ఉన్నాయి. పార్టీని అతిక్ర‌మించిన వారు.. కూట‌మి ల‌క్ష్యాల‌ను దెబ్బ‌తీసేవార‌ని ప‌క్క‌న పెట్టే వ్యూహం దీనివెనుక ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది.

నిజానికి.. జైకొట్టు విభాగం అంటే.. కేవ‌లం యూత్‌ను ఆక‌ర్షించ‌డ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, పార్టీ ల‌క్ష్యాల‌కు భిన్నంగా వ్య‌వ‌హరించే నాయ‌కుల‌కు కూడా ఇది చెక్ కానుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఏదైనా నియోజ క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నేత మాట వినక‌పోయినా.. ప్ర‌స్తుతం స‌హిస్తారు. జ‌న‌సేన అధినేత మాట‌లో చెప్పాలం టే భ‌రిస్తారు. కానీ, ఎన్నిక‌లంటూ వ‌చ్చాక‌.. ఆ స్థానంలో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి యువ నేత‌ను ఎంపిక చేసే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా చెప్ప‌కుండానే.. సీనియ‌ర్ల‌కు మంగ‌ళం పాడేస్తారు.

అది ఒక‌ర‌కంగా జెన్‌జీని ఆక‌ర్షించ‌డంతోపాటు.. సీనియ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌గా కూడా ప‌నిచేయ‌నుంది. నాయ కులు అంటే.. కేవ‌లం ఆధిప‌త్యం కోస‌మో.. అధికారం కోస‌మో.. కాద‌న్న త‌ర‌హాలోనే జ‌న‌సేన రాజ‌కీయాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆదిశ‌గానే ఆలోచ‌న చేస్తున్నారు. జైకొట్టు ద్వారా బ‌ల‌మైన యువ‌త‌ను ఆక‌ర్షించి.. వారిని నాయ‌కులుగా తీర్చిదిద్ది.. కూట‌మికి లైన్ క్లియ‌ర్ చేసే వ్యూహాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. త‌ద్వారా.. నాయ‌కులు ఎత్తుతున్న కుల రాజ‌కీయాలు.. కూట‌మి విభేదాల‌కు జై కొట్టు చెక్ పెడుతుంద‌ని అంటున్నారు. సో.. ఇప్పుడు తేల్చుకోవాల్సింది.. వివాదాస్ప‌ద నాయ‌కులు.. దారిత‌ప్పుతున్న ఎమ్మెల్యేలే!!.

Tags:    

Similar News