జగన్ పూర్తిగా మారిపోయారు! వైసీపీ నేతల్లో విస్తృత చర్చ
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తీరులో మార్పు వచ్చిందని పార్టీ నేతల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తీరులో మార్పు వచ్చిందని పార్టీ నేతల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో జగన్ రెడ్డి పర్యటనలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలు పరిశీలిస్తుంటే అధినేతలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత చాలా కాలం పాటు తాడేపల్లిలోని నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలకే పరిమితమైన జగన్ తాజాగా తనపై కేడర్ లో ఉన్న అసంతృప్తిని దూరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. దీనికి ఉదాహరణగా జగన్ కర్నూలు టూరును ఉదహరిస్తున్నారు.
జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేసిన వారికి కనీసం అపాయింట్మెంటు ఇచ్చేవారు కాదని విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆయనను కలిసేందుకు వెళ్లే నేతలు, ప్రజాప్రతినిధులను తాడేపల్లి ప్యాలెస్ బయటే నిలిపివుంచే వారని ఆరోపణలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఈ వ్యవహారశైలి ఒక కారణంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల క్షేత్రస్థాయి సమాచారం అధినేతకు తెలియలేదని అంటున్నారు. ఈ కారణంగానే ఎన్నికల సమయంలో చేదు ఫలితాలను అనుభవించాల్సివచ్చిందని వ్యాఖ్యానాలు వినిపించాయని చెబుతున్నారు.
ఇక ఎన్నికల అనంతరం కూడా అధినేతకు నేతలకు మధ్య సంబంధాలు మెరుగైన పరిస్థితులు పెద్దగా కనిపించలేదని పరిశీలకులు చెబుతున్నారు. దీనివల్ల కేడర్ లో ఒక విధమైన నిరుత్సాహం పెరిగిపోతోందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన అధినేత జగన్ లో ఇటీవల స్పష్టమైన మార్పు వచ్చిందని అంటున్నారు. పార్టీ ఓటమి తర్వాత కార్యకర్తలను తాడేపల్లిలోని కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడిన జగన్ రెడ్డి ఇప్పుడు మరో కీలక అడుగు వేశారని చెబుతున్నారు. దీనిద్వారా నేతలు, కార్యకర్తలతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకునేలా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
అధికారంలో ఉండగా ప్రజప్రతినిధులు, పార్టీ నేతలను పెద్దగా కలుసుకోని జగన్ రెడ్డి ఇప్పుడు తన వైఖరి మారిందనే సంకేతాలు పంపుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నేతలు అంతా తన సొంత కుటుంబ సభ్యులతో సమానం అన్నట్లు వారితో సంబంధాలు నెరుపుతున్నారని చెబుతున్నారు. దీనికి తాజాగా జగన్ రెడ్డి వేస్తున్న అడుగులే నిదర్శనంగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన తరచూ పార్టీ నేతల ఇళ్లల్లో జరుగుతున్న వివాహ కార్యక్రమాలతోపాటు ఇతర శుభకార్యక్రమాలకు హాజరవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా కర్నూలులో పర్యటించిన జగన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి ఇంట్లో శుభకార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఇక గత వారం కూడా ఆయన హైదరాబాదులో పర్యటించి పార్టీ సానుభూతిపరుడుగా గుర్తుంపు తెచ్చుకున్న రిటైర్డ్ పోలీసు అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంట్లో కార్యక్రమానికి హాజరయ్యారని చెబుతున్నారు. ఈ పరిణామాలు గమనిస్తే దూరమైన వారిని దగ్గరకు తీసుకునేలా అధినేత జగన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.