చెమట చుక్కల నమ్మకానికి మిగిలింది శూన్యమేనా? ఆటోమొబైల్ చరిత్రలోనే అతిపెద్ద కన్నీటి కథనం

గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఊహించని నిర్ణయంతో ప్రపంచ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది.

Update: 2026-09-04 05:28 GMT

ఐటీ అయిపోయింది.. ఇతర రంగాలు కుదేలయ్యాయి.. ఇక ఇప్పుడు ఆటోమొబైల్ పై సంక్షోభం పడింది. వేలాది మంది కార్మికుల చెమట చుక్కలపై నిర్మితమైన ఆ సామ్రాజ్యం.. ఈరోజు వారి భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేసింది. తరతరాలుగా తమ జీవితాలను, నమ్మకాన్ని ఆ సంస్థకే అంకితం చేసిన వేలాది కుటుంబాలకు 'ఉద్యోగ కోత' అనేది కేవలం ఒక వార్త కాదు... వారి కంటిపాపలా చూసుకున్న భవిష్యత్తు ఒక్కసారిగా చీకటిమయమైన చేదు నిజం. జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ కాంపౌండ్‌లో ఇప్పుడు ఒకప్పటి ప్లాంట్ల యంత్రాల హోరు కంటే, తమ రేపటి రోజు ఏమవుతుందోనన్న ఉద్యోగుల గుండెల నిశ్శబ్ద రోదనే మిన్నెగసి వినిపిస్తోంది.

గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఊహించని నిర్ణయంతో ప్రపంచ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. మారుతున్న మార్కెట్ సమీకరణాలు, తీవ్రమవుతున్న పోటీ, పెరిగిన ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంతో 2030 నాటికి ఏకంగా ఒక లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలోనే ఇది అత్యంత అతిపెద్ద పునర్వ్యవస్థీకరణగా నిలవనుంది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు యూరోపియన్ మార్కెట్లోకి వేగంగా విస్తరిస్తూ తక్కువ ధరలకే కార్లను అందిస్తుండటం.. వోక్స్‌వ్యాగన్ సాంప్రదాయ మార్కెట్‌ అయిన చైనాలో విక్రయాలు వేగంగా పడిపోవడం కంపెనీకి పెద్ద దెబ్బగా మారింది. దీనికి తోడు అమెరికా విధించిన భారీ టారిఫ్‌లు, యూరప్‌లోని ప్లాంట్లలో అవసరానికి మించి ఉన్న అధిక ఉత్పత్తి సామర్థ్యం , రోజురోజుకూ పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు లాభాలను తీవ్రంగా దెబ్బతీశాయి.

ఈ తీవ్రమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి వోక్స్‌వ్యాగన్ యాజమాన్యం, కార్మిక సంఘాలు ఒక మహత్తర ఒప్పందానికి వచ్చాయి. ఇప్పటికే ప్రణాళిక చేసిన 50,000 ఉద్యోగాల తొలగింపునకు అదనంగా తాజాగా మరో 50,000 ఉద్యోగాలను కోత విధిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో ఉన్న 6.5 లక్షల మంది సిబ్బందిలో దాదాపు 15 శాతం మంది ఈ నిర్ణయంతో ఉపాధి కోల్పోనున్నారు. ఈ ఉద్యోగ కోతలతో పాటు జర్మనీలోని నాలుగు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలైన హానోవర్, ఎమ్డెన్, జ్వికావ్ , నెకార్సుల్మ్ ప్లాంట్ల భవిష్యత్తు కూడా అనిశ్చితిలో పడింది. 2030 తర్వాత ఈ ప్లాంట్ల కార్యకలాపాలను కొనసాగించడంపై ఎటువంటి హామీ ఇవ్వలేమని యాజమాన్యం స్పష్టం చేయడంతో అక్కడి వేలాది మంది కార్మికులలో తీవ్ర ఆందోళన మొదలైంది. వోల్ఫ్‌స్బర్గ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఈఓ ఒలివర్ బ్లూమ్ ప్రసంగిస్తున్నప్పుడు ఉద్యోగులు నిరసన నినాదాలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఆర్థిక సంక్షోభం కేవలం సిబ్బంది సంఖ్యపైనే కాకుండా కంపెనీ ఉత్పత్తి చేసే మోడళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఖర్చులను గణనీయంగా తగ్గించుకునే చర్యల్లో భాగంగా ప్రస్తుతం గ్రూప్ విక్రయిస్తున్న మోడళ్ల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించాలని నిర్ణయించారు. వోక్స్‌వ్యాగన్‌తో పాటు ఆడి, పోర్షే, బెంట్లీ, స్కోడా, సీట్, కుప్రా, లంబోర్గిని వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్ల పోర్ట్‌ఫోలియోను కూడా సమూలంగా ప్రక్షాళన చేయనున్నారు.

మారుతున్న ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా సంస్థను పునర్నిర్మించడం.. భవిష్యత్తు పోటీకి సిద్ధం చేయడం అత్యంత ఆవశ్యకమని, అందుకే పర్యవేక్షణ బోర్డు ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఒకప్పటి గ్లోబల్ దిగ్గజం ఈ స్థాయిలో ఉద్యోగులకు గుడ్‌బై చెప్పడం ప్రపంచ ఆటో పరిశ్రమలో ఆందోళనకరమైన పరిణామంగా మారింది.

Tags:    

Similar News