రూ.16 వేలతో 12 కిలోల గంజాయి కొనుగోలు: ప్రియురాలికి ఐఫోన్ కొనిచ్చేందుకు స్మగ్లర్‌గా మారిన ప్రేమికుడు

ప్రేమలో ఉన్నప్పుడు భాగస్వామిని సంతోషపెట్టడానికి ఖరీదైన కానుకలు ఇవ్వాలనుకోవడం సహజమే.

Update: 2026-09-04 13:30 GMT

ప్రేమలో ఉన్నప్పుడు భాగస్వామిని సంతోషపెట్టడానికి ఖరీదైన కానుకలు ఇవ్వాలనుకోవడం సహజమే. కానీ ఆ ఆశ తీర్చుకోవడానికి చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంటే జీవితం ఏ మలుపు తిరుగుతుందో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. ప్రియురాలి చేతిలో మెరిసే ఐఫోన్ పెట్టాలనే కోరికతో ఒక యువకుడు గంజాయి స్మగ్లర్‌గా మారి చివరికి పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ జైలు పాలయ్యాడు.

ఒడిశా నుంచి హైదరాబాద్‌కి అక్రమ రవాణా

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన మిత్ర చైతన్య (21), హేమలత (20) అనే ఇద్దరు యువతీ యువకులు సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. ప్రియురాలికి ఎలాగైనా ఖరీదైన ఐఫోన్ కొనిచ్చి సర్ ప్రైజ్ చేయాలని భావించిన చైతన్య.. గంజాయి అక్రమ రవాణాను ఎంచుకున్నాడు. ప్రణాళిక ప్రకారం ఇద్దరూ ఒడిశాలోని 'పసుపులంక' ప్రాంతానికి వెళ్లారు. అక్కడ భగవాన్ హంతల్ అనే స్థానిక ఏజెంట్ వద్ద రూ.16 వేలు వెచ్చించి ఏకంగా 12 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఆ సరుకును హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయించి ఆ వచ్చిన లాభంతో ఐఫోన్ కొనాలని ఆశపడ్డారు.

సినీ శైలిలో పోలీసులపైకి బైక్..

ఒడిశా నుంచి ద్విచక్ర వాహనంపై గంజాయి మూటలతో బయలుదేరిన ఈ జంట వైరా రింగ్ సెంటర్ వద్దకు చేరుకుంది. అక్కడ అప్పటికే నిఘా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ పోలీసులు వీరి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూడగానే ఖంగుతిన్న నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. సినిమా ఫైట్ సీన్‌ను తలపించేలా తమ బైక్‌తో నేరుగా పోలీస్ వాహనాన్ని అక్కడున్న సిబ్బందిని బలంగా ఢీకొట్టారు.

చివరికి లొంగిపోయిన జంట

ఈ అనూహ్య ఘటనలో ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో నిందితుల బైక్ కూడా అదుపుతప్పి కిందపడటంతో చైతన్య, హేమలత ఇద్దరూ గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న 12 కిలోల గంజాయిని.. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

క్షణికావేశంలో ఈజీ మనీ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఐఫోన్ కొనిచ్చి ప్రేమను చాటుకుందామనుకున్న ఆ యువకుడు ఇప్పుడు తీవ్రమైన క్రైమ్ కేసులో జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.

Tags:    

Similar News