ప్రాభవం కోల్పోతున్న 'ఓరుగల్లు' బీఆర్ ఎస్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు బీఆర్ ఎస్‌కు మంచి పట్టు ఉండేది. పలువురు కీలక నాయకులతో సందడి సందడిగా కనిపించేది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు బీఆర్ ఎస్‌కు మంచి పట్టు ఉండేది. పలువురు కీలక నాయకులతో సందడి సందడిగా కనిపించేది. ముఖ్యంగా టీడీపీ నుంచి కడియం శ్రీహరి వంటి వారిని చేర్చుకున్న తర్వాత.. బీఆర్ ఎస్ వరంగల్ కేంద్రంగా రాజకీయాలను ముమ్మరం చేసింది. గతంలో జిల్లా వ్యాప్తంగా కూడా.. ఉద్యమాలు, ప్రభుత్వానికి అనుకూల విధానాల విషయంలోనూ నాయకులు ముందుకు కదిలేవారు. ముఖ్యంగా కేసీఆర్ పుట్టిన రోజైనా.. బీఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవమైనా.. ఓరుగల్లు ఓ గుర్తింపు పొందేది.
అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కీలక నాయకులుగా ఉన్న వారు.. పార్టీకి రాంరాం చెప్పడంతోపాటు.. వరుస ఎన్నికల్లో పరాజయం కూడా బీఆర్ ఎస్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా ఏమీ లేదులే.. అనుకున్న కాంగ్రెస్ పార్టీ వరం గల్ కేంద్రంగా పుంజుకుంది. కీలక నాయకులను చెంతకు చేర్చుకోవడంతోపాటు.. కేడర్‌ను కూడా బలోపేతం చేసింది. దీంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేష న్ ఎన్నికలపై ఈ ప్రభావం పడనుందని అంటున్నారు.
ముఖ్యంగా.. కడియం శ్రీహరిని పోగొట్టుకుని బీఆర్ ఎస్ ఇబ్బందిపడుతోందన్న వాదన అయితే.. ప్రధానంగా వినిపి స్తోంది. ఎంపీ స్థానం కూడా బీఆర్ ఎస్ పోగొట్టుకున్న దరిమిలా.. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టే నాయకులు పెద్దగా కనిపించడం లేదు. మాజీడిప్యూటీ సీఎం రాజయ్య ఉన్నా.. ఆయన హవా పెద్దగా కనిపించడం లేదు. పైగా.. ఆయనకు కేడర్ దూరమై.. కాంగ్రెస్ పంచన చేరిపోయింది. మరోవైపు.. కొండ సురేఖ వర్గం సొంతగా రాజకీయాలు చేస్తుండడం కూడా.. బీఆర్ ఎస్‌పై ప్రభావం చూపుతోంది.
ఒకప్పుడు కొండా కూడా బీఆర్ ఎస్ లోనే ఉన్నారు. అప్పట్లో తూర్పు వరంగల్ నియోజకవర్గంతోపాటు.. ఇతర నియోజకవర్గాల్లోనూ కొండా ఫ్యామిలీ చక్రం తిప్పింది. ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో కొండా ఫ్యామిలీ కేడర్‌ను బలోపేతం చేసుకుని.. బీఆర్ ఎస్ కార్యకర్తలను తమవైపు తిప్పుకొంది. దీంతో ఇప్పుడు ఓరుగల్లు బీఆర్ ఎస్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ నాయకులు కనిపించడం లేదు. కొందరు కేసుల భయంతో బయటకు కూడారాని పరిస్థితి ఏర్పడింది. ఒకనాడు తెలంగాణ ఉద్యమానికి కీలక భూమిక వహించి.. బీఆర్ ఎస్ వెంట నడిచిన నాయకులు.. ఇప్పుడు వేళ్లపై లెక్కించే స్థాయికి చేరిపోయారు.