పుష్కరాలకు మోడీ వస్తున్నారు.. ఏర్పాట్లు అదరాలి: చంద్రబాబు
| 2027 గోదావరి పుష్కరాలకు ప్రధాని మోదీ ఏపీకి వస్తారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జూన్ 26 నుంచి జులై 7 వరకు జరిగే పుష్కరాల కోసం రూ.3,700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 440 ఘాట్ల అభివృద్ధి, 4 వేల ప్రత్యేక బస్సులు, 1,560 రైళ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కానున్న పవిత్ర గోదావరి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని.. ఏర్పాట్లలో ఎక్కడా లోటు రాకూడ దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో స్వచ్ఛత పాటించాలన్నారు. `నమో గోదావరి` పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గోదావరి పుష్కరాలు 12 రోజులు మాత్రమే ఉంటాయన్న అపోహ తొలగించాలని.. ఏడాది పాటు గోదావరి స్నానం ఆచరించవచ్చ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ.. మహారాష్ట్రకు, ఏపీకి కూడా పుష్కరాల సమయంలోవస్తున్నట్టు చెప్పారు. తాను ఇటీవల ఆయనను కోరినట్టు తెలిపారు. దీనికి అంగీకరించారన్నారు..
గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, ఏర్పాట్ల విషయంలో రాజీ పడవద్దని సూచించారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. వాటిని కూడా కలుపుకొని.. 3,700 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతంలో 440 ఘాట్లు అభివృద్ధి చేయాలన్నారు. భక్తుల కోసం 4 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి మరో 1,560 రైళ్లు నడిపేలా రైల్వే అధికారులతో చర్చించాలన్నారు.
పుష్కరాల పర్యవేక్షణకు ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఎలాంటిఅవాంఛనీయ ఘటన లు జరగకుండా చూడాలన్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రానికి వస్తారని.. అలానే పెట్టుబడి దారులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అఖండగోదావరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని, పుష్కరాల సమయంలో దీనిని మరింతగా ప్రజలకు చేరువ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈవిషయంలో ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారని, వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు.
12 రోజులు కాదు..
పుష్కరాలు అనేది 12 రోజులు మాత్రమే కాదని సీఎంచంద్రబాబు చెప్పారు. ఏడాది పొడవునా ఎప్పుడు స్నానం చేసినా.. అదే ఫలితం వస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. తొక్కిసలాటలకు తావులేకుండా చూడాలన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని.. అనుమతులు ఇవ్వాలని సూచించారు. పుష్కరాలంటే కేవలం స్నానంతోనే సరికాదన్నారు. చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని.. పర్యాటకులను, భక్తులను ఆకర్షించడం ద్వారా ఆదాయ మార్గాలను కూడా అన్వేషించాలనిసూచించారు.