శోధన ఆగింది.. జాను ఏమైంది?!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఈ నెల 2వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చి కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జ్క్షానేశ్వరి ఉరఫ్ జాను జాడ ఇప్పటికీ కనిపించలేదు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఈ నెల 2వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చి కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జ్క్షానేశ్వరి ఉరఫ్ జాను జాడ ఇప్పటికీ కనిపించలేదు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ బాలిక జాడ లభించలేదని అధికారులు ప్రకటించారు. పోలీసు, రెవెన్యూ , అటవీ, ఎన్‌డీఆర్ ఎఫ్(విపత్తు దళం) సహా.. స్థానిక అధికారులు, బంధుమిత్రులు కూడా అన్ని ప్రాంతాల్లో నూ గాలించారు. అయినా.. పాప జాడ తెలియరాలేదు.
కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం.. ఇలా.. ఎక్కడా ఇంచ్ కూడా వదల కుండా జాను కోసం వెతికారు. అయినా.. పాప జాడ తెలియలేదని అధికారులు తెలిపారు. ఒకానొక దశలో బొమ్మల్లో మాంసం కూరి.. అటవీ ప్రాంతంలో పెట్టారు. ఒకవేళ ఏవైనా జంతువులు.. పాపను ఎత్తుకుపోయి ఉంటే.. తిరిగి మాంసం కోసం వస్తాయన్న ఆలోచనతో ఈ ప్రయోగం చేశారు. అయినా.. ఇది కూడా ఫలించలేదు. మరోవైపు చిట్టడవుల్లో డ్రోన్లతోనూ పరిసరాలను జల్లెడ పట్టారు.
ఇలా.. దాదాపు 20 రోజులకు పైగానే పాప జాడ కోసం ప్రయత్నించారు. కానీ, ఎక్కడా కనిపించలేదు. దీంతో తమ ప్రయత్నాలను విరమిస్తున్నట్టు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అయితే.. కుట్ర కోణం లేదా.. అపహరణ కోణంలో మాత్రం దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇదిలావుంటే.. ఇప్పటి వరకు దర్యాప్తు సాగడంతో తల్లిదండ్రులు పాప జాడ తెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు వేట నిలిచిపోవడంతో వారు మరింత ఆవేదనకు గురయ్యారు.
కోర్టుకు ఏం చెప్పాలి?
ప్రస్తుత పరిస్థితులను యధాతథంగా కోర్టుకు విన్నవించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే.. శోధన నిలిచిపోయినా.. పోలీసులు తమ ప్రయత్నాలు మానవద్దని హోం శాఖ ఆదేశించింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా.. తండాలు, గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ మొబైల్ ఫోన్లకు పాప ఫొటోలను పంపించి.. వెతకాలని నిర్ణయించారు. అదేసమయంలో రాష్ట్రంలోని యాచక ముఠాలను కూడా విచారించాలని ఆదేశాలు వచ్చాయి. కొందరు యాచకులు.. చిన్నారులను అపహరించి పొరుగు రాష్ట్రాలకు విక్రయిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు.