"మేక్ కోకాపేట్ గ్రేట్ ఎగైన్!".. భాగ్యనగరంలో ట్రంప్ 65 అంతస్తుల విలాసవంతమైన సర్కస్!
కోకాపేట్ వైపు అడుగుపెడితే దుమ్ము, సిమెంట్ వాసన రావడం పాత మాట... త్వరలోనే అక్కడ డాలర్ల ఘుమఘుమలు, ట్రంప్ మార్కు ఆంబియెన్స్ గుప్పుమనబోతోంది!
మన భాగ్యనగరం రూపురేఖలు మారిపోతున్నాయి భయ్యా.. నిన్నటిదాకా బిర్యానీ, చార్మినార్, హుస్సేన్‌సాగర్ అని మురిసిపోయిన మనం.. ఇప్పుడు "స్కై బ్రిడ్జ్‌లు", "గ్లాస్ ఫ్యాకేడ్‌లు", "అల్ట్రా లగ్జరీ" అనే భారీ అంతర్జాతీయ పదాలు వాడుకోవాల్సి వస్తోంది. కోకాపేట్ వైపు అడుగుపెడితే దుమ్ము, సిమెంట్ వాసన రావడం పాత మాట... త్వరలోనే అక్కడ డాలర్ల ఘుమఘుమలు, ట్రంప్ మార్కు ఆంబియెన్స్ గుప్పుమనబోతోంది!
అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సుల్తాన్ ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ చివరికి మన హైదరాబాద్‌పైన కూడా కన్నేసింది. కోకాపేట్ గోల్డెన్ మైల్ ప్రాంగణంలో ఏకంగా 65 అంతస్తులతో ట్విన్ టవర్స్ కట్టడానికి సిద్ధమైపోయింది.
టీ-రెరా పచ్చజెండా.. రోడ్ల సంగతి ఏమో కానీ ఆకాశంలో రూట్ క్లియర్
కోకాపేట్ రోడ్ల మీద రోజువారీ ట్రాఫిక్ సిగ్నళ్లు సరిగ్గా పనిచేసినా చేయకపోయినా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ రెరా) మాత్రం ఈ భారీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సుమారు ₹3,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ విలాసవంతమైన ప్రాజెక్ట్ కోసం ఏకంగా ముగ్గురు దిగ్గజాలు చేతులు కలిపారు. ట్రంప్ ఆర్గనైజేషన్, భారత్‌లో ట్రంప్ పార్టనర్ ట్రిబెకా డెవలపర్స్ , ఐరా రియాల్టీ కలిసి గురుగ్రామ్, ముంబై, పుణే, కోల్‌కతా నగరాల్లో ధనికుల జేబులు ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో నిర్మితమవుతున్న 5వ ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్‌గా మన హైదరాబాద్ నిలవడం మనకైతే గర్వకారణమే... కానీ ఆ ధరలు వింటేనే సామాన్యుడికి గుండె ఆగిపోవడం ఖాయం!
కేవలం 450 ఫ్లాట్లు మాత్రమే.. సామాన్యులకు 'నో ఎంట్రీ'
సుమారు 4 ఎకరాల భారీ విస్తీర్ణంలో 65 అంతస్తులు కడుతున్నారు కాబట్టి వేల సంఖ్యలో ఇళ్లు ఉంటాయనుకుంటే పొరపాటే. అక్కడ నిర్మిస్తున్నది కేవలం 450 ‘అల్ట్రా లగ్జరీ’ ఫ్లాట్లు మాత్రమే.
ఈ ఫ్లాట్లలో ఉండే హంగులు ఒకసారి చూస్తే .. 3.5 BHK, 4 BHK, ఆకాశంలో తేలియాడేలా ఉండే ‘స్కై డుప్లెక్స్’ ఇళ్లు. గ్లాస్ ఫ్యాకేడ్ డిజైన్ అంటే గోడల బదులు మొత్తం అద్దాలే!, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, ప్రైవేట్ వ్యూయింగ్ డెక్స్. 65వ అంతస్తు బాల్కనీలో నిలబడి కింద కోకాపేట్‌లో అంగుళం అంగుళం కదిలే ట్రాఫిక్ జామ్‌లను ప్రశాంతంగా కాఫీ తాగుతూ చూడటానికి ప్రత్యేక ఏర్పాట్లు అన్నమాట..
స్కై బ్రిడ్జ్ అట భయ్యా.. కింద నడిచే ఓపిక లేక పైన రోడ్డు
ఈ ట్విన్ టవర్స్‌కి అసలైన స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటో తెలుసా? రెండు టవర్లను కలుపుతూ ఆకాశంలో ఏర్పాటు చేసే ‘స్కై బ్రిడ్జ్’ కింద రోడ్ల మీద నడిస్తే గుంతలు, ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి కాబట్టి, ఒక టవర్ నుంచి ఇంకో టవర్‌కి వెళ్లడానికి ఏకంగా గాల్లోనే వంతెన కట్టేస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మూడేళ్లలోనే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఇక గ్రాండ్ లాంచ్ లేదా భూమిపూజ కార్యక్రమానికి స్వయంగా ‘ట్రంప్ ఫ్యామిలీ’ సభ్యులే అమెరికా నుంచి హైదరాబాద్‌కి ఊడిపడబోతున్నారని టాక్. వాళ్లు ఇక్కడికి వచ్చి "మేక్ కోకాపేట్ గ్రేట్ ఎగైన్" అని మైకులో అరిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మన ప్లాన్ ఏంటి?
ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ ఎయిర్‌పోర్టులకు ఆనుకుని ఉండే కోకాపేట్‌లో ఈ ట్రంప్ టవర్స్ రాకతో హైదరాబాద్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇమేజ్ ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్లడం ఖాయం.
ఏది ఏమైనా అక్కడ ఫ్లాట్ కొనడం మన వల్ల అయ్యే పని కాదు కాబట్టి... త్వరలోనే నిర్మాణం పూర్తయ్యాక ఆ 65 అంతస్తుల టవర్ కింద నిలబడి.. తల పైకెత్తి మెడ నొప్పులు తెచ్చుకుంటూ టీ తాగడానికి మానసికంగా సిద్ధమైపోదాం..