మూడు కోట్లు పెట్టుబడి.. అద్దె ఆదాయం 4 శాతమే.. రియల్ ఎస్టేట్‌లో ఇదేం లెక్క
| రూ.3 కోట్లు పెట్టి హైదరాబాద్‌లో ఇల్లు కొంటే నెలకు వచ్చే అద్దె సుమారు రూ.లక్ష మాత్రమే. ఏడాదికి రూ.12 లక్షల స్థూల ఆదాయం వచ్చినా పన్నులు, మెయింటెనెన్స్, మరమ్మతులు, ఖాళీగా ఉండే సమయం వంటి ఖర్చులు పోను నికర రాబడి 2.5-3 శాతానికి పడిపోవచ్చు. కేవలం అద్దె ఆదాయం కోసమే ప్రాపర్టీ కొనడం కంటే ఇతర పెట్టుబడి మార్గాలను కూడా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కోట్లు ఖర్చు పెట్టి కోటీశ్వరులమయ్యామని సంబరపడిపోతున్నారా? అయితే ఈ లెక్క వింటే మీ కళ్లు తెరుచుకోవడం ఖాయం.. రూ. 3 కోట్లు గుమ్మరించి నెలనెలా లక్ష రూపాయల అద్దె తీసుకుంటున్నారా గురూ? పైకి చూస్తే ఈ బిజినెస్ అద్దిరిపోతుంది కానీ.. లోపలికి దూరి లెక్కలేస్తే మాత్రం జేబుకు చిల్లు పడటం ఖాయం. అసలు ఈ అద్దె లీలలు చూశాక.. ఇల్లు మనదో లేక మనమే ఆ ఇంటికి అద్దె కడుతున్నామో అర్థం కాక తల పట్టుకోవాల్సిందే..
సొంతిల్లు ఉండాలనే కల ఎవరికైనా ఉంటుంది... కానీ అదే బాటలో ఒకటి రెండు ఇళ్లు కొని అద్దెల రూపంలో ఏ పనిచేయకుండా ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయించుకుందాం అనుకునే మహాశయులకు ఈ లెక్క కచ్చితంగా కనువిప్పు కావాల్సిందే. హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.3 కోట్లు పోసి ఓ లగ్జరీ ప్రాపర్టీ కొంటే.. నెలనెలా మీ చేతికి వచ్చే అద్దె ఎంతో తెలుసా? సరిగ్గా లక్ష రూపాయలు.. పైకి వినడానికి ఈ ఫిగర్ ఏవో సినిమా హీరో రేంజ్ లాగా అద్దిరిపోతుంది. కానీ లోపలికి వెళ్లి లెక్కలు తీస్తే అసలు సిసలు కామెడీ అర్థమవుతుంది.
అరకొర లాభాల కోసం కోట్లు గుమ్మరించే ఈ మహా తతంగం వెనుక ఉన్న అసలు బండారం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. రూ.3 కోట్లు పెట్టి ఒక ఆస్తి కొంటే ఏడాదికి వచ్చే అద్దె రాబడి కేవలం 4 శాతమే.. అంటే కోట్లు పెట్టి కొన్న ఆస్తికి ఏడాదికి వచ్చేది కేవలం రూ.12 లక్షలు. ఇదే డబ్బును బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా లేదా మరేదైనా సురక్షితమైన మార్గంలో మళ్లించినా దీనికంటే మెరుగైన రాబడి వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా స్టైల్లో ఆలోచిస్తే... అరే ఏడాదికి పన్నెండు లక్షలంటే మాములు విషయమా? అనిపించవచ్చు. కానీ అసలు సినిమా ఇక్కడే మొదలవుతుంది.
యజమాని చేతికి లక్ష రూపాయలు పడగానే సంబరపడిపోతే ఎలా? గవర్నమెంట్‌కి ఆస్తి పన్ను కట్టాలి. అపార్ట్‌మెంట్ అయితే సొసైటీ మెయింటెనెన్స్ బాదుడు సరేసరి. అప్పుడప్పుడు లీకేజీలని.. పెయింటింగ్‌లని మరమ్మతులు తలకెత్తుకోవాలి. ఇక అద్దెదారుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాక.. కొత్తగా అద్దెకు వచ్చేవారు దొరికే వరకు వచ్చే ఆదాయం అక్షరాలా సున్నా.. ఇన్ని తంతులు పోను చివరికి మీ చేతికి మిగిలే సగటు రాబడి కేవలం 2.5 నుంచి 3 శాతానికి పడిపోతుంది. అంటే లక్ష అద్దె వస్తోందని మీరు సంబరపడేలోపే ఖర్చులు వచ్చి మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయన్న మాట..
మరి ఈ లాభం లేని వ్యాపారానికి కోట్లు ఎందుకు పెట్టాలి అంటారా? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. హైదరాబాద్, అమరావతి లాంటి గ్రోత్ కారిడార్లలో భూమి విలువ పెరిగే కొద్దీ ప్రాపర్టీ రేట్లు విపరీతంగా పెరుగుతాయి. అద్దె ద్వారా వచ్చే ఆదాయం కంటే కాలక్రమేణా ఆస్తి విలువ పెరగడమే అసలైన కిక్ ఇస్తుంది. కాకపోతే ప్రతి ఏరియాలోనూ రేట్లు ఆకాశాన్ని తాకుతాయని.. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు రాబడి వస్తుందని గుడ్డిగా నమ్మడం మాత్రం అతిపెద్ద అత్యాశే అవుతుంది.
అందువల్ల కేవలం నెలవారీ రెగ్యులర్ ఆదాయమే లక్ష్యంగా పెట్టుకునేవారైతే.. రియల్ ఎస్టేట్ వైపు చూడటం అంత శ్రేయస్కరం కాదు. మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ బాండ్లు, లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ లాంటి ప్రత్యామ్నాయాలు మరింత మెరుగైన ఆప్షన్లుగా నిలుస్తాయి. లేదంటే మూడు కోట్లు పెట్టి ఇంటికి ఓనరవుతారు కానీ.. ఆ ఇంటి మెయింటెనెన్స్ ఖర్చులకే మీ పాకెట్ నుంచి ప్రతి నెలా అద్దె చెల్లించాల్సిన దుస్థితి వస్తుంది. కాబట్టి ప్రాపర్టీ కొనేటప్పుడు కేవలం సెంటిమెంట్‌ను నమ్ముకోకుండా.. పక్కా కాలిక్యులేటర్‌తో బేరీజు వేసుకోవడం ఎప్పుడైనా అత్యంత మంచి పనిగా నిపుణులు చెబుతున్నారు.