హైద‌రాబాద్‌లో 63,700 ఇళ్ల ప‌రిస్థితి? రియ‌ల్ ఎస్టేట్‌పై వార్ పంచ్!

సాధారణంగా ఎంత భారీ ప్రాజెక్టులైనా అవి చివరి దశకు చేరుకున్న సమయంలో ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైతే సకాలంలో పూర్తి కావడం కష్టమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Update: 2026-06-13 20:05 GMT

పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూ ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ నిర్మాణ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్త స‌ప్లై చైన్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం.. ముడిసరుకు రవాణాలో జాప్యం జరగడం వంటి పరిణామాలు భారత్‌లో ఇళ్ల నిర్మాణ వేగాన్ని పూర్తిగా తగ్గించాయి. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ `అనరాక్` స‌ర్వే రిపోర్ట్ ప్రకారం.. ఈ సంక్షోభం కారణంగా భార‌త‌దేశవ్యాప్తంగా దాదాపు 5.4 లక్షల కొత్త ఇళ్ల సకాల డెలివరీ ఇప్పుడు తీవ్ర ముప్పులో పడింది.

నిజానికి 2026 సంవత్సరంలో భారతదేశంలోని టాప్ 7 ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో 5,40,400 గృహాల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. గత ఒక దశాబ్ద కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల డెలివరీలు క్యూలో ఉండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం మార్కెట్‌లో ఇళ్లకు మంచి డిమాండ్ ఉన్నా.. బిల్డర్లు ఆర్థికంగా బలంగా ఉన్నా.. సుదీర్ఘంగా సాగుతున్న ఈ అంతర్జాతీయ యుద్ధ వాతావరణం ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే డెవలపర్ల లక్ష్యాలను దెబ్బతీస్తోంది. ఈ యుద్ధ సంక్షోభ‌ తాకిడి నిర్మాణ రంగానికి ఒక పెద్ద సవాలుగా మారిందని అనరాక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు.

ఈ ఇళ్ల డెలివరీ భారం దేశంలోని పశ్చిమ, దక్షిణ భారత మార్కెట్లపైనే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది పూర్తి కావాల్సిన మొత్తం ఇళ్లలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) లోనే అత్యధికంగా 2,07,300 గృహాలు ఉన్నాయి. దీని తర్వాత పుణేలో 1,00,300 ఇళ్లు సిద్ధం కావాల్సి ఉంది. ఈ రెండు మెట్రో నగరాలే దేశవ్యాప్త డెలివరీలలో 57 శాతం వాటాను కలిగి ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో బెంగళూరు 69,000 ఇళ్లతో ముందంజలో ఉండగా... హైదరాబాద్‌లో 63,700 ఇళ్లు... చెన్నైలో 35,600 ఇళ్లు పూర్తి కావాల్సి ఉన్నాయి. వీటికి భిన్నంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో 39,000 ఇళ్లు..కోల్‌కతాలో అత్యంత తక్కువగా 22,500 ఇళ్లు మాత్రమే డెలివ‌రీకి ఇవ్వాల్సిన ద‌శ‌లో ఉన్నాయి.

ముంబై, పుణే, బెంగళూరు, హైద‌రాబాద్ నగరాలే 2026లో పూర్తి కాబోయే ఇళ్లలో దాదాపు 80 శాతం వాటాను కలిగి ఉండటంతో.. రవాణా ఖర్చులు, స్టీల్, అల్యూమినియం, కాపర్ వంటి ముడిసరుకుల ధరల పెరుగుదల ప్రభావం ఈ నగరాలపైనే అత్యంత తీవ్రంగా పడనుంది. గతంలో 2020లో వచ్చిన కరోనా మహమ్మారి సంక్షోభాన్ని అనరాక్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఆ ఏడాది 4.66 లక్షల ఇళ్లు పూర్తి కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్లు, కార్మికుల కొరత, సరఫరా చైన్ వ్య‌వ‌స్థ‌ దెబ్బతినడం వల్ల కేవలం 46 శాతం (2.14 లక్షలు) ఇళ్లు మాత్రమే కొనుగోలుదారులకు చేరాయి. ప్రస్తుత ఇరాన్ యుద్ధ వాతావరణం కూడా సరిగ్గా అలాంటి పరిస్థితులనే పునరావృతం చేసేలా కనిపిస్తోంది.

సాధారణంగా ఎంత భారీ ప్రాజెక్టులైనా అవి చివరి దశకు చేరుకున్న సమయంలో ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైతే సకాలంలో పూర్తి కావడం కష్టమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన మౌలిక వనరుల కొరత ..రవాణా ఇబ్బందులు బిల్డర్ల లాభాలను దెబ్బతీయడమే కాకుండా... ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న సామాన్య కొనుగోలుదారుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు త్వరలోనే ముగిసిపోకపోతే భారత రియల్ ఎస్టేట్ రంగం మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News