లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో టాప్ 2లో హైదరాబాద్

తాజాగా వెలువడిన రిపోర్టు ఒకటి హైదరాబాద్ లో అత్యంత విలాసవంతమైన.. ఖరీదైన ఇళ్లకు సంబంధించిన అమ్మకాలు ఎంత జోరుగా సాగుతున్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది.;

Update: 2026-03-28 09:30 GMT

తాజాగా వెలువడిన రిపోర్టు ఒకటి హైదరాబాద్ లో అత్యంత విలాసవంతమైన.. ఖరీదైన ఇళ్లకు సంబంధించిన అమ్మకాలు ఎంత జోరుగా సాగుతున్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది. 2025లో రూ.లక్ష కోట్ల విలువైన విక్రయాలతో లగ్జరీ ఇళ్ల విభాగంలో హైదరాబాద్ దూసుకెళ్లిందని.. దేశంలోనే టాప్ 2 ప్లేస్ లో నిలిచినట్లుగా పేర్కొన్నారు. క్రెడాయి - లియోసెస్ ఫోరాస్ రిపోర్టు ఈ ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. దేశంలో అగ్రగామి రియల్ ఎస్టేట్ ఇళ్ల మార్కెట్ లో హైదరాబాద్ ఒకటిగా మారినట్లుగా పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో ఈ లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు రూ.1.08 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం.

లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నది సరే.. మరి ఈ సెగ్మెంట్ లో మొదటిస్థానంలో ఉన్నది ఎవరు? అన్నప్పుడు దేశ రాజధాని ఢిల్లీ, పరిసరప్రాంతాలుగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో సుమారు రూ.1.83 లక్షల కోట్ల విలువైన లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు జరిగినట్లుగా పేర్కొన్నారు. 2025లో దేశ వ్యాప్తంగా జరిగిన మొత్తం ఇళ్ల అమ్మకాల విలువలో 78 శాతం కేవలం రూ.కోటి పైబడిన ఇళ్ల నుంచి రావటం గమనార్హం.

ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ మూడో స్థానంలో నిలిచింది. అల్ట్రా లగ్జరీ (అత్యంత విలాసవంతమైన) ఇళ్ల విభాగంలో అమ్మకాలు గతం కంటే 51 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ విభాగంలోని ఇళ్ల కనీస ధర రూ.2 కోట్లకు పైనే ఉంటుంది. ఇటీవల కాలంలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోందని.. అదే సమయంలో అమ్ముడుబోని ఇళ్లల్లో దాదాపు 64-66 శాతం వరకు ఈ విభాగంలోనే ఇళ్లు ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. కొవిడ్ తర్వాత ప్రజలు విశాలమైన ఇళ్లపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఎక్కువ మంది త్రీ బీహెచ్ కే.. ఫోర్ బీహెచ్ కేకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News