మెట్రోలో తగ్గుతున్న ఇళ్ల అమ్మకాలు.. కారణం ఇదేనట.. అనరాక్ సర్వేలో సంచలన విషయాలు..
ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ (Anarock ) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది.;
ఒకప్పుడు మెట్రో నగరాల్లో ఇల్లు కొనాలంటే ‘ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు’ అన్న భావన ఉండేది. లాంచ్ అయిన రోజే బుకింగులు, ప్రీ-లాంచ్ ఆఫర్లు, ధరలు రోజుకోలా పెరుగుతాయన్న భయం.. ఇవన్నీ రియల్ ఎస్టేట్‌ను ఎప్పుడూ ఎత్తులో ఉంచేవి. కానీ 2025కి వచ్చేసరికి అదే మెట్రో మార్కెట్‌లో విరుద్ధమైన దృశ్యం కనిపిస్తోంది. టవర్లు కడుతున్నారు, ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి, కానీ తాళం వేసిన ఫ్లాట్లు కొనుగోలుదారుడి కోసం ఎదురుచూస్తున్నాయి. మెట్రో నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. ఇది ఈ రంగాన్ని ఆలోచింపజేస్తుంది.
అనరాక్ లో సంచలన విషయాలు..
ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ (Anarock ) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. 2025 చివరి నాటికి దేశంలోని టాప్–7 మెట్రో నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 4 శాతం పెరిగి సుమారు 5.77 లక్షల యూనిట్లకు చేరింది. కేవలం ఏడాది క్రితం, అంటే 2024 చివరికి ఈ సంఖ్య 5.53 లక్షలుగా ఉంది. అంటే డిమాండ్ మందగిస్తుండగా, మార్కెట్‌లో ఇళ్ల నిల్వ మాత్రం పెరుగుతూనే ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో అసమతుల్యతను బయటపెడుతోంది. ఇళ్ల విక్రయాల గణాంకాలు ఈ పరిస్థితికి అసలు కారణాన్ని చెబుతున్నాయి. 2025లో ఇళ్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 14 శాతం మేర తగ్గాయి. 2024లో 4.59 లక్షల ఇళ్లు అమ్ముడుపోతే.., 2025లో 3.95 లక్షలకు పడిపోయింది. ఇది చిన్న తగ్గుదల కాదు, కొనుగోలుదారుల మనస్తత్వంలో వచ్చిన మార్పునకు అద్దం పట్టే సంఖ్య. ఇళ్ల ధరలు అనూహ్యంగా పెరగడం, హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇంకా భారంగానే ఉండడం, ఐటీ రంగంలో లే-ఆఫ్స్, జాబ్ సెక్యూరిటీపై అనిశ్చితి ఇవన్నీ కలిసి మధ్య తరగతి కొనుగోలుదారుడిని వెనక్కి నెట్టేశాయి.
ప్రాజెక్టులు ఆపకపోవడానికి కారణం ఇదే..
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.., విక్రయాలు తగ్గినా డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను ఆపలేదు. 2025లో కొత్త ఇళ్ల సరఫరా 2 శాతం పెరిగి 4.19 లక్షల యూనిట్లకు చేరింది. ఇది మార్కెట్‌లో డిమాండ్ కన్నా సప్లయ్ ఎక్కువగా మారిందన్న స్పష్టమైన సంకేతం. కొన్నేళ్ల బూమ్‌ను చూసి, ధరలు ఇంకా పెరుగుతాయన్న అంచనాతో డెవలపర్లు ముందుకు వెళ్లారు. కానీ కొనుగోలుదారుడి జేబు, ధైర్యం మాత్రం అంత వేగంగా ముందుకు రాలేదు. ఫలితంగా కొత్తగా కట్టిన ఇళ్లు అమ్ముడుపోకుండా నిల్వలుగా మారాయి. నగరాల వారీగా చూస్తే పరిస్థితి మరింత స్పష్టమవుతుంది. బెంగళూరులో అమ్ముడుపోని ఇళ్ల వాటా అత్యధికంగా 23 శాతానికి చేరింది. ఐటీ రాజధానిగా పేరున్న ఈ నగరంలోనే ఉద్యోగ భద్రతపై భయం ఎక్కువగా ఉండటమే దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. చెన్నైలో 18 శాతం అమ్ముడుపోని ఇళ్లు ఉండగా, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలు కొంత మెరుగైన స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుల లాంచ్ కొంత తగ్గడంతో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్యలో 2 శాతం స్వల్ప తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ నగరంలో ఇప్పటికీ దాదాపు 96,140 ఇళ్లు కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తున్నాయి.
డెవలపర్లపై భారం కొనుగోలు దారుపై పడుతుందా?
ఈ పెరుగుతున్న ఇన్వెంటరీ డెవలపర్లపై భారీ ఆర్థిక భారంగా మారుతోంది. ప్రాజెక్టుల్లో పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడం, క్యాష్ ఫ్లో తగ్గడంతో కొత్త నిర్మాణాల వేగం మందగిస్తుంది. ఇళ్లు అమ్ముడుపోకపోతే, బ్యాంక్ రుణాల వడ్డీలు, నిర్వహణ ఖర్చులు, మార్కెటింగ్ వ్యయాలు అన్నీ కలిసి డెవలపర్‌పై ఒత్తిడి పెంచుతాయి. దీని ప్రభావం చివరికి కొనుగోలుదారుడిపై కూడా పడే అవకాశం లేకపోలేదు. ప్రాజెక్టుల డెలివరీ ఆలస్యం కావడం, డిస్కౌంట్లు పెరగడం, లేదా కొన్ని చోట్ల ధరల సవరణ రావడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. ఇక కొనుగోలుదారుడి కోణంలో చూస్తే, ఇది ఒక అవకాశంలా కూడా కనిపిస్తుంది. డిమాండ్ కంటే సప్లయ్ ఎక్కువగా ఉన్నప్పుడు, చర్చకు అవకాశం పెరుగుతుంది. ధరలు కొంత స్థిరపడే అవకాశం, డెవలపర్ల నుంచి మెరుగైన ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అదే సమయంలో జాబ్ సెక్యూరిటీ, ఆదాయ స్థిరత్వం వంటి అంశాలు స్పష్టంగా లేకపోతే, పెద్ద పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు. మెట్రో నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల పెరుగుదల తాత్కాలిక సైకిల్ కావచ్చు, లేదా మార్కెట్ పరిపక్వతకు సంకేతం కావచ్చు. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ ఇక ఎప్పటికీ ఒకే దిశలో పరుగెత్తే రంగం కాదు. కొనుగోలుదారుడి అవసరాలు, ఆర్థిక వాస్తవాలు, ఉద్యోగ భద్రత అన్నీ కలిసి మార్కెట్ దిశను నిర్ణయిస్తున్నాయి. ఈ మార్పును అర్థం చేసుకొని ముందుకు వెళ్లినవారికే రాబోయే రోజుల్లో స్థిరమైన లాభాలు దక్కే అవకాశం ఉంది.