హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెను సంచలనం!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను మరోసారి ప్రపంచ స్థాయి చర్చల్లో నిలబెడుతూ కోకాపేట భూమి ధరలు కొత్త రికార్డు సృష్టించాయి.;
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను మరోసారి ప్రపంచ స్థాయి చర్చల్లో నిలబెడుతూ కోకాపేట భూమి ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. ప్రభుత్వ భూ వేలంలో ఒక్క ఏకరానికి భారీగా రూ.137 కోట్లు పలకడం పెట్టుబడిదారులను, రియల్ ఎస్టేట్ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. అధికారులు మొదట్లో ఊహించిన బేస్ ధర కంటే రెట్టింపు ఉత్సాహం కనిపించడంతో ఈ వేలం నగర రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
* అవుట్‌స్కర్ట్స్ నుంచి ప్రీమియం జోన్‌గా కోకాపేట
కొన్నేళ్ల క్రితం వరకు నగర శివార్ల ప్రాంతంగా పరిగణించిన కోకాపేట, ప్రస్తుతం హైటెక్ సిటీ – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల విస్తరణ కారణంగా అత్యంత ప్రాధాన్య ప్రాంతంగా మారింది. భారీ కమర్షియల్ ప్రాజెక్టులు రాబోతుండటం... అంతర్జాతీయ స్థాయి రోడ్డు కనెక్టివిటీ (ఓఆర్ఆర్) అందుబాటులో ఉండటం... వేగంగా పెరుగుతున్న ఐటీ హబ్ సమీపంలో ఉండటం... ఈ కారణాల వల్ల ఈ ప్రాంతంపై జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టి గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం ఏకరానికి రూ.99 కోట్లుగా బేస్ ప్రైస్‌ను నిర్ణయించింది. అయితే వివిధ ప్రధాన రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీ కారణంగా చివరి బిడ్ నేరుగా రూ.137 కోట్ల వరకు చేరింది.
* రాయదుర్గ్ తర్వాత కోకాపేట కొత్త హాట్‌స్పాట్
ఇప్పటివరకు ఏకరానికి అత్యధిక ధరను రాయదుర్గ్ రికార్డు చేసింది దాదాపు రూ.177 కోట్లు. అయితే అక్కడ భూమి లభ్యత తగ్గిపోవడంతో పెట్టుబడిదారులు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కోకాపేట వైపు దృష్టి మళ్లించారు. ఈ కొత్త రికార్డు, ప్రధాన ఐటీ కారిడార్ నుంచి పెట్టుబడుల డిమాండ్ ఎలా పరిసర ప్రాంతాలకు విస్తరించిందో స్పష్టంగా చూపిస్తోంది. కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోకాపేట, రాయదుర్గ్‌కు సమానమైన మౌలిక సదుపాయాలు.. భవిష్యత్ వృద్ధి అవకాశాలను అందించడం ఈ డిమాండ్‌కు ప్రధాన కారణం.
* భవిష్యత్ వృద్ధికి కోకాపేటే కేంద్రబిందువు
రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కోకాపేటను తదుపరి ప్రీమియం ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే అంశాలున్నాయి. రాబోయే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ వల్ల పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు.. గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధి సాధ్యమవుతుంది.. నూతన టెక్ జోన్ల ఏర్పాటుకు.. ఐటీ పరిశ్రమ విస్తరణకు అవకాశాలు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెంది విస్తృతంగా ఏర్పాటు కానున్న రోడ్లు , ఇతర మౌలిక సదుపాయాలు కల్పించబడుతాయి. ఓఆర్ఆర్ , నూతన రోడ్డు కనెక్టివిటీ: నగరంలోని ఇతర ప్రాంతాలకు వేగవంతమైన ప్రయాణం సులభంగా సాధ్యమవుతుంది..
హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నగరం. దీంతో ప్రధాన ఐటీ హబ్ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పెట్టుబడిదారులు పెద్దగా పరిశీలిస్తున్నారు. కోకాపేటలో తాజా వేలం,హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెద్ద ఊపు వచ్చేసింది అన్న విషయాన్ని స్పష్టంగా రుజువు చేసింది.