గ్రోత్ ఇంజిన్ గా తూర్పు హైదరాబాద్.. మారుతున్న సిటీ తీరు..
ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే పశ్చిమం. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ చుట్టూనే అభివృద్ధి చక్రం తిరుగుతున్నట్టు అనిపించేది.;
ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే పశ్చిమం. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ చుట్టూనే అభివృద్ధి చక్రం తిరుగుతున్నట్టు అనిపించేది. ఉద్యోగాలు అక్కడే, పెట్టుబడులు అక్కడే, రియల్‌ఎస్టేట్ విలువలు అక్కడే అన్న భావన నగరవాసుల్లో బలంగా నాటుకుపోయింది. కానీ కాలం మారుతోంది. నగరపు శ్వాస ఇప్పుడు తూర్పువైపు మళ్లుతోంది. ఉప్పల్ నుంచి చెర్లపల్లి, తర్నాకా మీదుగా విస్తరిస్తున్న తూర్పు హైదరాబాద్, నెమ్మదిగా కానీ స్థిరంగా ‘న్యూ గ్రోత్ ఇంజిన్’గా రూపుదిద్దుకుంటోంది.
లుక్ ఈస్ట్ పాలసీతో న్యూ లుక్..
ప్రభుత్వం ప్రకటించిన ‘లుక్ ఈస్ట్’ పాలసీ ఈ మార్పునకు పునాది వేసింది. అభివృద్ధి అన్నది ఒకే దిశలో కేంద్రీకృతమైతే అసమతుల్యత పెరుగుతుందని పాలకులు గ్రహించారు. అందుకే పశ్చిమంపై ఒత్తిడి తగ్గించి, తూర్పు హైదరాబాద్‌ను సమాంతరంగా ఎదిగేలా చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతోంది. ఈ విధానానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు, రవాణా, పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు అన్నీ ఒకే దారిలో ముందుకు సాగుతున్నాయి. మెట్రో రైలు విస్తరణ తూర్పు ప్రాంతానికి పెద్ద వరం. ఉప్పల్–నాగోల్ లైన్ ఇప్పటికే నగర కేంద్రంతో బలమైన అనుసంధానం కల్పించింది. తర్నాకా, హబ్సిగూడ, మేడ్చల్-మల్కాజ్‌గిరి ప్రాంతాలు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, నివాస కాలనీలతో చురుకుగా మారాయి. దీనికి తోడు కొత్త ఫ్లైఓవర్లు, విస్తరించిన రహదారులు రోజువారీ ట్రాఫిక్ భారాన్ని తగ్గిస్తూ, ప్రాంతానికి కొత్త ఊపిరి ఇస్తున్నాయి.
చెర్లపల్లి టెర్నినల్ తో భారీ డెవలప్ మెంట్..
చెర్లపల్లి మెగా టెర్మినల్ తూర్పు హైదరాబాద్ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ఇది కేవలం రైల్వే స్టేషన్ కాదు.. ఒక ట్రాన్స్‌పోర్ట్ హబ్. నగరానికి తూర్పు ద్వారంలా పనిచేసే ఈ టెర్మినల్, ప్రయాణ సౌకర్యాలతో పాటు వాణిజ్య కార్యకలాపాలకు కూడా బలం చేకూరుస్తుంది. స్టేషన్ చుట్టుపక్కల అభివృద్ధి సహజంగానే వేగం పుంజుకుంటుంది. హోటళ్లు, గోదాములు, లాజిస్టిక్స్, చిన్న వ్యాపారాలు ఇక్కడ పుట్టుకొస్తాయి. ఇంకా కీలకమైన అంశం రీసెర్చ్ కారిడార్. ఉప్పల్–పోయచారంల మధ్య ఏర్పడుతున్న ఈ కారిడార్‌లో బయోటెక్నాలజీ, ఫార్మా, డిఫెన్స్ రీసెర్చ్, స్టార్టప్ ల్యాబ్స్‌కు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇది కేవలం ఐటీ ఆధారిత అభివృద్ధి కాదు. ఇక్కడ పరిశ్రమలు, పరిశోధన, విద్య కలిసి ఒక ‘హైబ్రిడ్ ఎకానమీ’ని నిర్మిస్తున్నాయి. పశ్చిమ హైదరాబాద్ ఐటీకి ప్రతీక అయితే, తూర్పు హైదరాబాద్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా ఎదుగుతోంది.
ఆర్ఆర్ఆర్ తో అభివృద్ధికి మరింత ఊతం..
రీజినల్ రింగ్ రోడ్ (RRR) ఈ మార్పును మరింత వేగవంతం చేస్తోంది. చెర్లపల్లి, ఘట్‌కేసర్, పోచారం ప్రాంతాలు నగరానికి మాత్రమే కాదు.., రాష్ట్రంలోని ఇతర పారిశ్రామిక క్లస్టర్లకు కూడా నేరుగా అనుసంధానమవుతున్నాయి. దీని ప్రభావం భూమి విలువలపై ఇప్పటికే కనిపిస్తోంది. ఒకప్పుడు నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలు ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ మార్పులన్నింటి మధ్య ఒక స్పష్టమైన సంకేతం ఉంది. తూర్పు హైదరాబాద్ ఇక ‘వెయిటింగ్ జోన్’ కాదు. ఇది రేపటి అవకాశాల కేంద్రం. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం, వ్యాపారం ప్రారంభించడం, పరిశ్రమ పెట్టడం అన్నీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకున్న నిర్ణయాలుగా మారుతున్నాయి. నగర అభివృద్ధి ఒకే దిశలో కాకుండా అన్ని వైపులా విస్తరించినప్పుడే సమతుల్యత, స్థిరత్వం వస్తాయి. ఆ దిశగా తూర్పు హైదరాబాద్ చేస్తున్న ప్రయాణం, హైదరాబాద్ భవిష్యత్తుకు ఒక బలమైన బ్లూప్రింట్‌లా కనిపిస్తోంది. పశ్చిమం ఐటీకి హృదయం అయితే, తూర్పు హైదరాబాద్ రేపటి మేధస్సు, పరిశ్రమ, పరిశోధనల సంగమంగా ఎదుగుతోంది. ఈ మార్పును ఇప్పుడే గమనించినవారే, రేపటి లాభాలను ముందుగా ఆస్వాదించగలరు.