ఎకరా రూ.237 కోట్లు.. హైదరాబాద్ లో ఇదెక్కడ?
ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. తాజాగా నిర్వహించిన వేలంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరాకు రూ.139 కోట్లు మాత్రమే.
ఎకరం రూ.కోటి. కొన్నేళ్ల క్రితం అదో పెద్ద సంచలనం. ఆ తర్వాత రూ.10కోట్లు. కొద్దికాలం క్రితం రూ.100 కోట్లు. ఏంటి? ఒక్క ఎకరం రూ.100కోట్లా? అంటూ నోరెళ్లబెట్టిన పరిస్థితి. అంతదాకా ఎందుకు ఏడాది క్రితం కూడా ఎకరం రూ.170 కోట్ల ధర వేలంలో పలికితే.. ఆశ్చర్యపోయిన పరిస్థితి. తాజాగా ఆ రికార్డుల్ని బద్ధలు కొడుతూ.. సరికొత్త రికార్డు ధర పలికిన తాజా వేలం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఈ సరికొత్త రికార్డు నమోదైంది.
ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. తాజాగా నిర్వహించిన వేలంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరాకు రూ.139 కోట్లు మాత్రమే. వేలం ప్రారంభమైన తర్వాత బేస్ ధరకు ఏకంగా 70.5 శాతం అధిక మొత్తానికి బిడ్ వేసిన సంస్థ చివరకు రికార్డు ధరకు ఈ భూమిని సొంతం చేసుకుంది. ఇంత భారీ ధరకు కొన్నేళ్లు ఎవరు? ఏంటి? అనే విషయాలు ఇప్పటికే బోలెడంత మంది చెప్పేసిన పరిస్థితి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇంత భారీ ధర పలికిన భూమి హైదరాబాద్ మహానగరంలో అసలు ఎక్కడ ఉందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇంతకూ ఎకరా రూ.237కోట్లు పలికిన ఈ ల్యాండ్ ఎక్కడ ఉంది? అన్న విషయానికి వస్తే.. రాయ్ దుర్గ్ మెట్రో స్టేషన్ కు కాస్త దూరంలో.. మరికాస్త వివరంగా చెప్పాలంటే ఐకియాకు కాస్త ఎదురుగా ఉండే టీహబ్ వెనుక భాగంలో ఉంది. ఈ ల్యాండ్ ఇంత ధర పలకటానికి కారణం.. ఇది ఉన్న ప్రాంతం అత్యంత కీలకం కావటమే. అవుటర్ రింగ్ రోడ్ నుంచి శిల్పా ఫ్లైఓవర్ మీదుగా తీగల వంతెనకు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ ఫ్లాట్ ఉంది.
ఇప్పటికే ఈ ప్రాంతం అత్యంత ఖరీదైన కమర్షియల్.. రెసిడెన్షియల్ ప్రాంతంగా పేరుంది. పేరున్న ఎన్నో ఐటీ కంపెనీలకు.. పెద్ద పెద్ద హబ్ లకు ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్. నిజానికి ఈ ప్రాంతం నుంచి వెళ్లే వేళలో హైదరాబాద్ లో ఉన్నట్లు కాకుండా.. విదేశాల్లో ఉన్న అనుభూతి కలగటం ఖాయం. అంతలా డెవలప్ అయిన ఈ ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు రికార్డు మొత్తాన్ని ఇచ్చి సొంతం చేసుకున్నారని చెప్పాలి.
ఈ భూవేలానికి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్లు భారీగా పాల్గొని పోటాపోటీగా బిడ్లు వేశారు. చివరకు రూ.1490.73 కోట్లకు దీన్ని సొంతం చేసుకున్నారు. ఇంత భారీ ఎత్తున వేలంలో భూమిని సొంతం చేసుకున్న సంస్థ ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల వాణిజ్య.. ఐటీ భవనాల్ని నిర్మిస్తుందని చెబుతున్నారు. గత ఏడాది (సరిగ్గా చెప్పాలంటే ఎనిమిది నెలల క్రితం) ఇదే ప్రాంతంలో టీజీఐఐసీ సంస్థ 7.67 ఎకరాలను వేలం వేసింది.అప్పట్లో ఎకరం రూ.177కోట్లు పలికి సరికొత్త రికార్డుగా నమోదైంది. అప్పటివరకు రాష్ట్ర చరిత్రలో అదే పెద్ద రికార్డు. కాగా.. తాజాగా ఆ రికార్డును బద్ధలు కొడుతూ మరింత భారీ ధరకు అమ్ముడుపోవటం గమనార్హం. ఏమైనా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రేంజ్ ఎంతన్న విషయాన్ని తాజా వేలం మరోసారి స్పష్టం చేసిందన్న మాట వినిపిస్తోంది.