బంగారు గనిలా మారిన ‘హైదరాబాద్ ఐటీ కారిడార్’
తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరం ప్రపంచ పటంలో తన ప్రాభవాన్ని మరోసారి సగర్వంగా చాటుకుంది.
తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరం ప్రపంచ పటంలో తన ప్రాభవాన్ని మరోసారి సగర్వంగా చాటుకుంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, వాణిజ్య కేంద్రంగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. నగరం వైపు ప్రపంచ దిగ్గజ సంస్థల చూపు నిలవడంతో.. ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ముఖ్యంగా నగర ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం ప్రాంతం వేలం పాటల్లో రోజుకో కొత్త మైలురాయిని అధిగమిస్తూ, పెట్టుబడులకు తిరుగులేని కేంద్రంగా నిలుస్తోంది.
వారంలోనే రూ.5 కోట్లు పైకి.. గ్లోబల్ బ్రాండ్‌గా రాయదుర్గం
తాజాగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఆన్‌లైన్ భూమి వేలంలో రాయదుర్గం విశ్వరూపం ప్రదర్శించింది. సర్వే నంబర్ 83/1 పరిధిలోని 5.38 ఎకరాల భూమికి ప్రభుత్వం ఎకరానికి రూ.175 కోట్ల ప్రారంభ ధరను నిర్ణయించగా.. పోటీపడ్డ సంస్థలు పోటీపడి బిడ్లు దాఖలు చేశాయి. తీవ్ర పోటీ మధ్య వంశీ రామ్ బిల్డర్స్ సంస్థ ఎకరానికి ఏకంగా రూ.269 కోట్లు చొప్పున బిడ్ దాఖలు చేసి భూమిని దక్కించుకుంది.
కేవలం ఒక వారం క్రితమే ఇదే ప్రాంతంలో ఎకరం రూ.264 కోట్లకు విక్రయమవ్వగా ఇప్పుడు మరో రూ.5 కోట్లు పెరిగి రూ.269 కోట్లకు చేరడం మార్కెట్ వర్గాలను విస్తుపోయేలా చేసింది. ఈ ఒక్క వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.1,447 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.
రూ.300 కోట్ల దిశగా.. అపార అవకాశాల వేదిక
గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి నాలెడ్జ్ హబ్‌లకు అత్యంత సమీపంలో ఉండటం.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతో రాయదుర్గం బిజినెస్ ల్యాండ్‌మార్క్‌గా మారింది. బహుళజాతి కంపెనీలు, విలాసవంతమైన నిర్మాణాలకు ఈ ప్రాంతం ప్రాధాన్య గమ్యస్థానంగా మారింది. వేలంలో కనిపిస్తున్న ఈ అపూర్వమైన ధరల పెరుగుదల రేసును చూస్తుంటే.. త్వరలోనే రాయదుర్గంలో ఎకరం ధర రూ.300 కోట్ల మైలురాయిని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ ఆత్మవిశ్వాసానికి, తిరుగులేని ఆర్థిక రంగానికి ఈ సరికొత్త రికార్డు ఒక నిలువెత్తు నిదర్శనం.