ఇక రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

భారతీయ కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో తొలిసారిగా పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Update: 2026-08-11 12:47 GMT

భారతీయ కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో తొలిసారిగా పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో అత్యధికంగా చలామణిలో ఉండే తక్కువ విలువ కలిగిన రూ.10, రూ.20 నోట్లను ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేసి ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.

తొలుత 100 కోట్ల నోట్లు

ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్లను వంద కోట్ల చొప్పున విడుదల చేయనున్నట్లు సమాచారం. దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని చలామణిలోకి తీసుకొచ్చి ప్రజల వినియోగం, నోట్ల మన్నిక, భద్రత వంటి అంశాలను పరిశీలించనున్నారు. ప్రయోగాత్మక దశలో వచ్చే ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో ఇతర విలువల నోట్లను కూడా పాలిమర్ కరెన్సీగా మార్చే అవకాశాన్ని పరిశీలించనున్నారు.

కాగితపు నోట్ల కంటే ఎక్కువ మన్నిక

ప్రస్తుతం రూ.10, రూ.20 వంటి చిన్న విలువ కలిగిన నోట్లు పెద్ద మొత్తంలో ప్రజల చేతుల్లో తిరుగుతుంటాయి. రోజువారీ లావాదేవీల్లో విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఇవి త్వరగా చిరిగిపోవడం.. మురికిగా మారడం.. పాడవడం జరుగుతుంది. ఫలితంగా ఆర్బీఐ తరచూ దెబ్బతిన్న నోట్లను చలామణి నుంచి ఉపసంహరించి కొత్త నోట్లను విడుదల చేయాల్సి వస్తోంది.

పాలిమర్ నోట్లకు కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నిక ఉండటం ప్రధాన ప్రయోజనంగా భావిస్తున్నారు. నీరు, తేమ వంటి పరిస్థితులను కూడా ఇవి మెరుగ్గా తట్టుకునే అవకాశం ఉంది. దీంతో చిన్న నోట్లను తరచూ ముద్రించాల్సిన అవసరం తగ్గి, దీర్ఘకాలంలో కరెన్సీ నిర్వహణ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నకిలీ నోట్లకు చెక్?

ప్లాస్టిక్ కరెన్సీలో ఆధునిక భద్రతా లక్షణాలను పొందుపరచడం ద్వారా నకిలీ నోట్ల తయారీని అడ్డుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లలో ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దీంతో నకిలీ కరెన్సీని గుర్తించడం మరింత సులభమయ్యే అవకాశం ఉంది.

2027 ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో?

ప్రస్తుతం ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా మాత్రమే ప్రవేశపెడుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే 2027 ఏప్రిల్ నుంచి ప్లాస్టిక్ నోట్లను విస్తృతంగా చలామణిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల వెల్లడించారు. అయితే దీనిపై తుది నిర్ణయం ఫీల్డ్ ట్రయల్స్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

పాత నోట్ల సంగతేంటి?

ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెట్టినంత మాత్రాన ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు రూ.10, రూ.20 నోట్లు వెంటనే చెల్లుబాటు కాకుండా పోవు. ప్రస్తుత కరెన్సీ నోట్లు యథావిధిగా చెలామణిలో కొనసాగుతాయి. ప్రయోగాత్మక దశలో ప్లాస్టిక్ నోట్ల పనితీరును పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు.

మొత్తంగా చూస్తే.. ప్లాస్టిక్ కరెన్సీ ప్రయోగం విజయవంతమైతే భారత కరెన్సీ వ్యవస్థలో ఇది కీలకమైన మార్పుగా నిలిచే అవకాశం ఉంది. ఎక్కువ మన్నిక, మెరుగైన భద్రత, నోట్ల నిర్వహణలో మార్పులు వంటి అంశాల్లో పాలిమర్ కరెన్సీ కొత్త అధ్యాయానికి తెరతీయనుంది.

Tags:    

Similar News