తెలంగాణలో మూడో ఉప ఎన్నిక టెన్షన్ !

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో తొలి వికెట్ కింద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు పడింది.

Update: 2026-09-25 14:30 GMT

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో తొలి వికెట్ కింద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద అనర్హత వేటు పడింది. దీంతో దీని ఉప ఎన్నిక ఎప్పుడు ప్రకటిస్తారో అన్న ఉత్కంఠ నెలకొన్నది. నిబంధనల ప్రకారం ఖాళీ అయిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. ఈ లెక్కన 2027 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఉప ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ ఖైరతాబాద్ సీటు ఖాళీ అయిందని ఎన్నికల సంఘానికి త్వరలో సమాచారం అందించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలుస్తోంది.

ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్, వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలతో పాటు, లేదా మిగతా రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ ఎన్నిక నిర్వహిస్తారని భావిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించాడు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించాడు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావడంతో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ మొదలైంది.

సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎన్నికలకు సిద్దం అని అనర్హత వేటు పడిన దానం నాగేందర్ ప్రకటించాడు. ఎన్నికలు నాకు కొత్త కాదు. ఖైరతాబాద్ నా కోట. ప్రజల మద్దతు ఉంది అని దానం అంటున్నారు. అనర్హత వేటు పడిన స్థానం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడేళ్ల తర్వాత వస్తున్న ఎన్నిక కాబట్టి బీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2028 ఎన్నికల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని అంటున్న బీజేపీ కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోది. ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడితే తప్ప అభ్యర్థులు ఎవరు అన్నది తేలుతుంది.

Tags:    

Similar News