తండ్రి నీడలో కొడుకు ప్రతిభ.. దిగ్గజాల వారసులకు పోలికల సెగ!

క్రికెట్‌లో ఒక దిగ్గజ ఆటగాడి కుమారుడు బ్యాట్ లేదా బాల్ పడితే చాలు.. మైదానంలో అతని ప్రతిభ కంటే ముందు తండ్రి రికార్డులే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

Update: 2026-09-25 22:30 GMT

క్రికెట్‌లో ఒక దిగ్గజ ఆటగాడి కుమారుడు బ్యాట్ లేదా బాల్ పడితే చాలు.. మైదానంలో అతని ప్రతిభ కంటే ముందు తండ్రి రికార్డులే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. తండ్రి ఎన్ని పరుగులు చేశాడు? ఎన్ని సెంచరీలు కొట్టాడు? ఎలాంటి అరుదైన మైలురాళ్లు సాధించాడు? కొడుకు కూడా అదే స్థాయికి చేరతాడా? అంటూ విశ్లేషణలు, పోలికలు మొదలైపోతాయి. అయితే ఈ తీరు యువ క్రికెటర్లపై ఎంతటి తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుందో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల లేవనెత్తిన ప్రశ్నలు ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి.

ఆర్యవీర్ ప్రయాణం.. సెహ్వాగ్‌తో పోలిక సమంజసమేనా?

సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ ఇటీవల ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 109 పరుగులు సాధించాడు. భారత్ ఆ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. కెరీర్ ఇప్పుడే ప్రారంభమైనప్పటికీ అతడి ప్రతిభను అప్పుడే తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్‌తో పోల్చడం ప్రారంభమైంది.

దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ దిగ్గజాల కుమారులపై అభిమానుల దృష్టి ఉండటం సహజమే అయినా తండ్రుల రికార్డులను కొలమానంగా మార్చుకుని వారిని అంచనా వేయడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘకాలం ఆడి ఎన్నో రికార్డులు సాధించానని.. కానీ ఆర్యవీర్ కెరీర్ ఇప్పుడే రూపుదిద్దుకుంటోందని గుర్తుచేశారు. ఆర్యవీర్‌ను తనతో కాకుండా.. అతని వయసు ఉన్న ఇతర యువ ఆటగాళ్లతో పోల్చి చూడటమే న్యాయమని ఆయన సూచించారు.

సచిన్ బ్యాటర్.. అర్జున్ బౌలర్.. మరి పోలిక ఎందుకు?

ఈ సందర్భంగా సెహ్వాగ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ప్రస్తావించారు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచిన సచిన్ రికార్డులతో అర్జున్‌ను పోల్చడం ఐరనీ అని ఆయన అన్నారు. అర్జున్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తన కెరీర్‌ను నిర్మించుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో తన సత్తా నిరూపించుకున్నాడు. విభిన్నమైన శైలి, విభిన్నమైన పాత్రలు ఉన్నప్పుడు అర్జున్ ఆటను సచిన్ బ్యాటింగ్ రికార్డులతో పోల్చడంలో అర్థం లేదని సెహ్వాగ్ తేల్చి చెప్పారు.

పేరు ముందే వస్తోంది.. ఆట తర్వాతే చూస్తున్నారు..

దిగ్గజాల వారసులకు లభించే ప్రచారం ఒక్కోసారి వారికి శాపంగా మారుతోంది. సాధారణ ఆటగాళ్లకు లభించని స్థాయిలో మీడియా, సోషల్ మీడియా దృష్టి వీరిపై పడుతుంది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే.. "తండ్రి తగ్గ తనయుడు" అని ఆకాశానికెత్తేస్తారు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైతే.. "తండ్రి స్థాయికి తగడు" అని విమర్శిస్తారు. ఈ రెండు పరిస్థితులు కూడా యువ క్రీడాకారుల మానసిక ధైర్యాన్ని.. సహజసిద్ధమైన ఆటను దెబ్బతీసే ప్రమాదం ఉంది. రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కూడా ప్రస్తుతం అండర్-19 సెటప్‌లో భాగమయ్యాడు. ఇలా ఒకే తరం క్రికెటర్లలో పలువురు దిగ్గజాల కుమారులు రాణిస్తున్న వేళ వారి కుటుంబ నేపథ్యం కంటే సొంత ప్రతిభకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

వారసత్వం ఇంట్లో.. రికార్డులు మైదానంలో..

తండ్రి నుంచి క్రికెట్‌పై ప్రేమ, అత్యుత్తమ మార్గదర్శకత్వం, మెలకువలు లభించవచ్చు. కానీ మైదానంలోకి దిగాక ఒత్తిడిని ఎదుర్కొని పరుగులు చేయాలన్నా.. వికెట్లు తీయాలన్నా ఆ ఆటగాడి సొంత కష్టం మాత్రమే పనిచేస్తుంది.

తండ్రి సాధించిన ఘనతలు కుమారుడికి గర్వకారణం కావచ్చు.. కానీ అవి వారి కెరీర్‌కు కొలమానం కాకూడదు. ఆర్యవీర్, అర్జున్, అన్వయ్ వంటి యువ ఆటగాళ్లకు ఇప్పుడు కావాల్సింది పోలికలు కాదు.. తమను తాము నిరూపించుకునే స్వేచ్ఛ, అవకాశాలు. తండ్రుల నీడ నుంచి బయటపడి, సొంత గుర్తింపును సాధించుకోవడానికి వారికి తగినంత సమయం ఇవ్వడమే క్రీడా ప్రపంచం చేయాల్సిన నిజమైన పని.

Tags:    

Similar News