ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్
| డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్-2027 మినీ వేలానికి ముందు పలు జట్లలో కెప్టెన్సీపై చర్చ మొదలైంది. రోహిత్, తిలక్ వర్మ పేర్లు ముంబైకి, రింకూ సింగ్ పేరు కేకేఆర్‌కు వినిపిస్తున్నాయి. లఖ్‌నవూకు కొత్త సారథి అవసరం కాగా, ఢిల్లీలో పంత్, అక్షర్, రాహుల్ మధ్య పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి. కమిన్స్ అందుబాటుపై స్పష్టత కోసం హైదరాబాద్ ఎదురుచూస్తోంది.
ఐపీఎల్ అంటేనే కోట్ల రూపాయల వర్షం.. ట్రేడింగ్‌ల మాయాజాలం.. కానీ డిసెంబర్ 16న గోవాలో జరగబోయే ఐపీఎల్-2027 మినీ వేలానికి ముందే ఫ్రాంచైజీల్లో అసలైన మ్యూజికల్ చైర్స్ ఆట మొదలైంది. 66 స్లాట్ల కోసం పది జట్ల వద్ద రూ.297.95 కోట్ల పర్స్ మనీ సిద్ధంగా ఉన్నా.. జట్ల ఓనర్ల కళ్లన్నీ కొత్త ఆటగాళ్ల కంటే కెప్టెన్సీ కుర్చీ పైనే ఉన్నాయి. రిటెన్షన్లు.. ట్రేడింగ్‌ల దెబ్బకు పలు జట్లలో నాయకత్వ సమీకరణాలు తలకిందులయ్యాయి.
ఐదు టైటిళ్లు గెలిచిన ముంబయి ఇండియన్స్‌కు గత కొన్ని సీజన్లుగా కాలం కలిసిరావడం లేదు. హార్దిక్ పాండ్య చేతికి పగ్గాలిచ్చినా పాత వైభవం మాత్రం తిరిగి రాలేదు. జట్టులో బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి హేమాహేమీలు.. భవిష్యత్ ఆశాకిరణం తిలక్ వర్మ ఉన్నప్పటికీ.. మళ్లీ మాజీ సారథి రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాత ఇనుము.. కొత్త బంగారం అన్నట్లు ముంబయి యాజమాన్యం మళ్లీ రోహిత్ వైపే చూస్తుందా లేక తిలక్ వర్మకు ప్రమోషన్ ఇస్తుందా అన్నది చూడాలి.
రహానే వీడ్కోలుతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కెప్టెన్సీ సీటు ఖాళీ అయింది. చివరి ఓవర్లలో సిక్సర్లతో మ్యాచ్‌లను మలుపు తిప్పే రింకూ సింగ్‌కు ఈసారి ఏకంగా జట్టునే నడిపించే ప్రమోషన్ దక్కేలా ఉంది. గతంలో వైస్ కెప్టెన్‌గా చేసిన అనుభవం.. ఒత్తిడిని తట్టుకునే తత్వం రింకూకు ప్లస్ పాయింట్లు. బౌలర్లను వణికించిన రింకూ ఇప్పుడు ప్రత్యర్థి వ్యూహాలను ఎలా చిత్తు చేస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రిషభ్ పంత్ జట్టుకు గుడ్‌బై చెప్పడంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిన అగత్యం ఏర్పడింది. రేసులో పూరన్, మిచెల్ మార్ష్ ఉన్నా.. గతంలో హైదరాబాద్‌ను నడిపించిన ఐదెన్ మార్‌క్రమ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మరి మార్‌క్రమ్ రాకతోనైనా లఖ్‌నవూ రాత మారుతుందో లేదో..
రిషభ్ పంత్ మళ్లీ సొంతగూటికి చేరడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం ముక్కోణపు పోటీ నెలకొంది. గత సీజన్‌లో జట్టును నడిపించిన అక్షర్ పటేల్ తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఇటు పంత్.. అటు సీనియర్ కేఎల్ రాహుల్ కూడా సారథ్య బాధ్యతలపై కన్నేశారు. ఈ ముగ్గురిలో ఎవరిని కాదన్నా అలకలు తప్పవు మరి..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్ రూపంలో అద్భుతమైన నాయకుడు ఉన్నాడు. కానీ వచ్చే సీజన్‌లో ఆయన అందుబాటుపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ కమిన్స్ రాకపోతే గత సీజన్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్‌కు పూర్తిస్థాయి పగ్గాలు దక్కే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ కూడా రేసులో ఉన్నాడు.
డిసెంబర్ 16న జరిగే గోవా వేలం.. ఆటగాళ్ల జేబులు నింపడంతో పాటు ఈ ఐదు జట్లలో ఎవరి నెత్తిన కెప్టెన్సీ కిరీటం పెడుతుందో చూడాలి మరీ..