అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్టరీ అంటే.. గ్రేట్ ఇండియా!
| అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత్ ఒక్క వికెట్ తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలుత పాక్ 337 పరుగులు చేయగా, భారత్ చివరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది. మోహిత్ ఉల్వా చివరి బంతికి బౌండరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో భారత్ తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
దాయాది పాకిస్తాన్ తో ఇండియా మ్యాచ్ అంటే జనం చెవులు రిక్కించి, టీవీలకు కళ్లప్పగించేస్తారు. టీమిండియా ప్రతాపం కళ్లారా చూడాలనే ఉత్కంఠ ఊపేస్తుంది. అది అండర్ -19 మ్యాచ్‌లకు కూడా వర్తిస్తుంది. ఇటీవల కొంత కాలంగా అండర్ 19 ఆసియా కప్ మీడియాలో పెద్ద సౌండ్ చేస్తోంది. తాజాగా ఎంతో ఉత్కంఠతో కళ్లప్పగించి చూసేలా టీమిండియా చేసిన మ్యాజిక్ ఆశ్చర్యపరుస్తోంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేదు.. పాకిస్తాన్ అంటేనే మనోళ్లు చెలరేగిపోతారని మరోసారి ప్రూవ్ అయింది.
అండర్-19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా అల్ అమేరత్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో భారత అండర్-19 జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ అండర్-19 జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. అబ్దుల్ ఖాదిర్ కీలక అర్ధశతకంతో రాణించారు. భారత బౌలర్లలో కావ్య పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, చిగురుపాటి వెంకట మూడు వికెట్లతో పాక్ బ్యాటింగ్ దూకుడును కొంతమేర నిలువరించాడు. అయినా పాక్ భారీ టార్గెట్ నే భారత్ ముందుంచింది.
భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత యువ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ఆర్యవీర్ సెహ్వాగ్ (58 పరుగులు) అర్ధశతకంతో రాణించగా... కెప్టెన్ లక్ష్య రాచకొండ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి 80 పరుగులు సాధించాడు. అయితే మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది. ఒక దశలో విజయానికి దూరం అవుతున్నట్లు కనిపించిన తరుణంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాటపటిమ మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది.
చివరి ఓవర్లలో మానల్ చౌహాన్ - మోహిత్ ఉల్వా సాహసోపేతమైన బ్యాటింగ్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్ 1 వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి సంచలన విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో భారత్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుని.. గ్రూప్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో చివరి బంతికి బౌండరి బాది గ్రేట్ విక్టరీని అందించిన మోహిత్ ఆట తీరుపైనా ప్రశంసలు కురుస్తున్నాయి.