కేంద్రానికి దళపతి విజయ్ షాక్ - నీట్ పై అసెంబ్లీలో సంచలన తీర్మానం

తమిళనాడు అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం నీట్, విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు (ఎఫ్సీఆర్ఏ)కు వ్యతిరేకంగా తీర్మానాలు చేసింది.

Update: 2026-08-11 12:48 GMT

తమిళనాడు అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం నీట్, విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు (ఎఫ్సీఆర్ఏ)కు వ్యతిరేకంగా తీర్మానాలు చేసింది. ఈ రెండు రాష్ట్ర హక్కులకు, సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఈ తీర్మానాలపై విస్తృత చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నీట్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలను తమిళనాడు వాసులు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. తమ రాష్ట్రంలోని మెడికల్ సీట్లను ఇతర రాష్ట్రాల వారికి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ తీర్మానం చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోందని అంటున్నారు.

నీట్ పరీక్షపై తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగిందని చెబుతున్నారు. నీట్ విధానం వల్ల గ్రామీణులు, పేదలు, తమిళ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరీక్ష కోసం నిర్వహించే ఖరీదైన కోచింగ్ సెంటర్లు పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారాయని, దీనివల్ల కేవలం ధనికులు మాత్రమే వైద్య విద్యను పొందే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా, గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోపాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని, దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీర్మానంలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కారణంగా తమిళనాడులో వైద్య ప్రవేశాలు గతంలో మాదిరిగానే 12వ తరగతి మార్కుల ఆధారంగానే జరగాలని ప్రభుత్వం కేంద్రానికి తేల్చి చెప్పింది.

మరోవైపు, ఎఫ్‌సిఆర్‌ఏ (FCRA) సవరణ బిల్లుపై కూడా తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న రూపంలో ఈ బిల్లు అమలైతే, మైనార్టీ వర్గాలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, వైద్య సేవా కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా విరాళాల నిబంధనల ఉల్లంఘన లేదా రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన నెపంతో స్వచ్ఛంద సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించే నిబంధనలు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ప్రభుత్వం వాదించింది. ప్రజా సేవలో అంకితభావంతో పనిచేసే సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే చర్యలను సహించేది లేదని ఈ తీర్మానం ద్వారా స్పష్టం చేసింది.

ఈ తీర్మానాల ద్వారా తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి కొన్ని బలమైన సంకేతాలను పంపాలని భావిస్తోందని అంటున్నారు. విద్య, సామాజిక సేవలు రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశాలని, కావున స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రానికే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుచేస్తోందని అంటున్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని దెబ్బతీసే ఏకపక్ష చట్టాలను లేదా నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించబోదని ఈ తీర్మానాల ద్వారా స్పష్టం చేసిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ రాష్ట్రం తన హక్కుల పరిరక్షణలో ఎంతటి కఠినంగా వ్యవహరిస్తుందో చాటిచెబుతోందని అంటున్నారు. ఇక రాజకీయాలకు అతీతంగా అన్నిపార్టీల వారు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం తమిళుల ఐక్యతను ప్రతిబింబిస్తున్నదని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News