సౌరవ్ గంగూలీకి డెత్ థ్రెట్స్.. ఆరు నెలలుగా వస్తున్న బెదిరింపు లేఖలు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీని కూడా చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై కోల్‌కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖల వెనుక ఉన్న వ్యక్తి లేదా వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేకంగా వివరాలను సేకరిస్తున్నారు.
సౌరవ్ గంగూలీ కార్యాలయానికి సోమవారం రెండు బెదిరింపు లేఖలు చేరినట్లు సమాచారం. ఈ లేఖల్లో గంగూలీ, ఆయన భార్య డోనాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గంగూలీకి సన్నిహితంగా ఉండే వ్యక్తులకు కూడా హాని చేస్తామని లేఖల్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో గంగూలీ పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఆరు నెలలుగా బెదిరింపు లేఖలు?
ఈ కేసులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. గంగూలీ పేరుతో గత ఆరు నెలలుగా ఇలాంటి బెదిరింపు లేఖలు వస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. అయితే గతంలో వచ్చిన లేఖలను పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. తాజాగా వచ్చిన లేఖల్లో బెదిరింపులు మరింత తీవ్రంగా ఉండటంతో గంగూలీ కుటుంబం అప్రమత్తమైంది. దీంతో ఈసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు అధికారికంగా ప్రారంభమైంది.
ఈ ఫిర్యాదు దక్షిణ కోల్‌కతాలోని ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. బెదిరింపు లేఖలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎవరు పంపించారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొరియర్ సంస్థపై పోలీసుల దృష్టి
తాజాగా వచ్చిన బెదిరింపు లేఖలు ఉత్తర 24 పరగణాల పరిధిలోని బెల్‌ఘారియా ప్రాంతం నుంచి కొరియర్ ద్వారా పంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో సంబంధిత కొరియర్ సంస్థను పోలీసులు సంప్రదించారు. లేఖలను పంపిన వ్యక్తి వివరాలు, కన్సైన్‌మెంట్ బుకింగ్ సమాచారం, డెలివరీ వివరాలు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.
అదే సమయంలో లేఖలతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ మొబైల్ నంబర్‌ను కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ నంబర్ ఎవరికి చెందినది? దాని వినియోగదారు ఎక్కడెక్కడ సంచరించాడు? గతంలో గంగూలీకి వచ్చిన లేఖలతో ఈ నంబర్‌కు ఏమైనా సంబంధం ఉందా? వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.
ఒకే వ్యక్తి పంపించాడా?
గత ఆరు నెలల్లో వచ్చిన బెదిరింపు లేఖలు, తాజాగా వచ్చిన లేఖలు ఒకే వ్యక్తి లేదా ఒకే ముఠా నుంచి వచ్చాయా? అన్నది ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. లేఖలలో ఉపయోగించిన భాష, పంపిన విధానం, కొరియర్ వివరాలు, మొబైల్ నంబర్ తదితర ఆధారాలను పోలీసులు పోల్చి చూస్తున్నారు.
అలాగే గంగూలీని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడాల్సిన కారణం ఏమిటన్న దానిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. గంగూలీ ప్రస్తుతం సీఏబీ అధ్యక్షుడిగా క్రికెట్ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు.
ప్రస్తుతం పోలీసుల ప్రధాన లక్ష్యం బెదిరింపు లేఖలు పంపిన వ్యక్తిని గుర్తించడం.. అతడి ఉద్దేశాన్ని తెలుసుకోవడం.. అలాగే గత ఆరు నెలలుగా వస్తున్న లేఖలతో తాజా బెదిరింపులకు సంబంధం ఉందా అనే విషయాన్ని నిర్ధారించడం.. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.