ట్రోఫీ కంటే జాతీయ గౌరవమే మిన్న: ‘పాక్’ నఖ్వీకి టీమిండియా షాక్.. మైదానంలో సెన్సేషనల్ డ్రామా!

ఆసియా కప్‌ను ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు.. మైదానంలోనే కాకుండా ప్రజెంటేషన్ వేదికపైనా తన దేశభక్తిని.. ఆత్మగౌరవాన్ని ఘనంగా చాటుకుంది.

Update: 2026-09-14 04:30 GMT

ఆసియా కప్‌ను ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు.. మైదానంలోనే కాకుండా ప్రజెంటేషన్ వేదికపైనా తన దేశభక్తిని.. ఆత్మగౌరవాన్ని ఘనంగా చాటుకుంది. శ్రీలంకను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో భారత ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పురుషుల జట్టు చేసినట్టే మన మహిళలు చేయడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోసి భారతీయుల ప్రాణాలు తీస్తుండడం.. సైనికులకు ఎదురవుతున్న పరిస్థితులు, జాతీయ భావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మైదానంలో అసలు ఏం జరిగింది?

టోర్నీ విజేతగా నిలిచిన భారత్‌కు ట్రోఫీని అందించేందుకు నఖ్వీ వేదికపైకి రాగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఆయన నుంచి ట్రోఫీని తీసుకోకుండా దూరంగా ఉండిపోయింది. బీసీసీఐ ప్రతినిధులు వారితో మాట్లాడినప్పటికీ ఆటగాళ్లు తమ నిర్ణయానికే కట్టుబడ్డారు. నఖ్వీ మైదానం నుంచి వెనుతిరిగిన తర్వాతే ట్రోఫీ లేకుండానే టీమిండియా సభ్యులు సంబరాలు చేసుకుంటూ విజయోత్సవ ఫోటోలు దిగారు.

ఈ సంఘటనతో మైదానంలోని ప్రేక్షకులు, అభిమానులు నఖ్వీ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. "ట్రోఫీ కంటే మాకు జాతీయ ఆత్మగౌరవమే ముఖ్యం" అంటూ సోషల్ మీడియాలో భారత అభిమానులు జట్టు నిర్ణయాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.

భారత హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ స్పందన

"ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయో కాదు. బీసీసీఐ మార్గదర్శకాలకు, జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి తీసుకున్న సమష్టి నిర్ణయం. ట్రోఫీ చేతికి వచ్చినా రాకపోయినా... ఈ టోర్నీ ఛాంపియన్లుగా రికార్డుల్లో నిలిచింది మాత్రం భారతే."

పునరావృతమైన చరిత్ర

గతంలో పురుషుల ఆసియా కప్‌ సందర్భంగానూ నఖ్వీ విషయంలో ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌ వైఖరికి నిరసనగా అప్పట్లోనూ భారత పురుషుల జట్టు ఆయన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడం గమనార్హం.

మొత్తానికి మైదానంలో అద్భుత ఆటతీరుతో శ్రీలంకను ఓడించడమే కాకుండా ప్రజెంటేషన్ వేదికగా తమ నిశ్శబ్ద నిరసనతో టీమిండియా మహిళా క్రికెటర్లు సరికొత్త స్ఫూర్తిని నింపారు. విజయం కన్నా, ట్రోఫీ కన్నా జాతీయ గౌరవమే అత్యున్నతమైనదని మరోసారి టీమిండియా నిరూపించింది..




Tags:    

Similar News