పాక్‌లో భారత జట్ల పర్యటనకు గ్రీన్ సిగ్నల్?

2027లో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక సౌత్ ఏషియన్ గేమ్స్‌ లో భారత బృందం పాల్గొనేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందన్న వార్త ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2026-09-07 21:04 GMT

భారత్, పాకిస్థాన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడ్డకట్టిన పరిస్థితుల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. 2027లో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక సౌత్ ఏషియన్ గేమ్స్‌ లో భారత బృందం పాల్గొనేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందన్న వార్త ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భారత్ సూత్రప్రాయ ఆమోదం

పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ (పీఏఓ) సెక్రటరీ జనరల్ ఖలీద్ మహ్మూద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జరిగిన సౌత్ ఏషియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉన్నతస్థాయి సమావేశంలో భారత ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2027లో జరిగే ఎస్.ఏఎఫ్ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత్ ప్రతినిధుల స్థాయిలో సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. తమ బృందానికి సంబంధించిన పూర్తి నివేదికను.. అథ్లెట్ల వివరాలను 2027 జనవరి నాటికి భారత ఒలింపిక్ వర్గాలు అందజేసే అవకాశం ఉందన్నారు. అయితే ఈ పరిణామంపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ముద్ర పడలేదు. సాధారణంగా పాకిస్థాన్‌లో పర్యటించాలంటే కేంద్ర హోమ్, విదేశాంగ మంత్రిత్వ శాఖల అనుమతి తప్పనిసరి. కాబట్టి ప్రస్తుతం దీనిని ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్‌గా కాకుండా క్రీడా సంస్థల మధ్య జరిగిన ప్రాథమిక అవగాహనగానే చూడాల్సి ఉంటుంది.

- 28 క్రీడలు.. 3 ప్రధాన నగరాలు

పాకిస్థాన్ ఈ క్రీడోత్సవాన్ని 2027 ఏప్రిల్ 4 నుంచి 11 వరకు వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇస్లామాబాద్ (15 క్రీడలు), లాహోర్ (10 క్రీడలు), పెషావర్ (3 క్రీడలు). క్రికెట్, హాకీ, స్విమ్మింగ్, టెన్నిస్, స్క్వాష్, వివిధ మార్షల్ ఆర్ట్స్ విభాగాలతో సహా మొత్తం 28 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి.

చారిత్రక ప్రాధాన్యత.. భద్రతా సవాళ్లు

ఒకవేళ భారత ప్రభుత్వం ఈ పర్యటనకు తుది ఆమోదం తెలిపితే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒక పెద్ద భారతీయ క్రీడా బృందం పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి అవుతుంది. పాకిస్థాన్‌లో చివరిసారిగా 2004లో సౌత్ ఏషియన్ గేమ్స్ జరిగాయి. సరిగ్గా 23 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ మళ్లీ ఈ ప్రాంతీయ క్రీడా సమరానికి ఆతిథ్యమిస్తోంది.

వేలాది మంది విదేశీ క్రీడాకారులు, అధికారులు, జర్నలిస్టులు రానుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అయినప్పటికీ భారత అథ్లెట్ల భద్రత అత్యంత కీలకమైన అంశం కానుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే తుది నిర్ణయంపైనే భారత క్రీడాకారులు పాకిస్థాన్‌లో అడుగుపెడతారా లేదా అనేది ఆధారపడి ఉంది.

Tags:    

Similar News