సచిన్ నే అనుకున్నాం.. కానీ అంతకుమించినోడు వచ్చాడే?
టెస్టుల్లో ఇప్పటికే సచిన్ పేరిట ఉన్న అత్యధిక అర్ధశతకాల రికార్డును దాటేసిన రూట్ దృష్టి ఇప్పుడు సచిన్ ఆల్‌టైమ్ టెస్టు పరుగుల రికార్డుపై పడింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులను తిరగరాయడం ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌కు అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్‌లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన పలు రికార్డులను అధిగమిస్తూ వస్తున్న రూట్.. ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్ సాక్షిగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో 23,000 పరుగుల మైలురాయిని చేరుకుని క్రికెట్ ప్రపంచంలో తన సత్తా చాటాడు.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రూట్ 23 వేల పరుగుల క్లబ్‌లో చేరడానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నాడు. శ్రీలంక బౌలర్ వేసిన బంతిని అద్భుతమైన ఫ్లిక్ షాట్‌తో బౌండరీ తరలించి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ ఒక ఇన్నింగ్స్ తేడాతో అధిగమించాడు. సచిన్ 522 ఇన్నింగ్స్‌ల్లో 23,000 పరుగులు పూర్తి చేయగా, రూట్ కేవలం 521 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అయితే ఈ జాబితాలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కేవలం 490 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను చేరుకుని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 23,000 పరుగులు సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ తరఫున ఈ అరుదైన ఘనత అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ మైలురాయిని అందుకున్న వారిలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ వంటి ప్రపంచ ప్రసిద్ధ దిగ్గజాలు ఉన్నారు.
రూట్ బలం కేవలం టెస్టులకే పరిమితం కాకుండా వన్డేల్లోనూ అద్భుతంగా కొనసాగుతోంది. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన రూట్ ఖాతాలో 7,800కి పైగా పరుగులు, 51కి పైగా బ్యాటింగ్ సగటుతో పాటు 20 సెంచరీలు ఉన్నాయి.
టెస్టుల్లో ఇప్పటికే సచిన్ పేరిట ఉన్న అత్యధిక అర్ధశతకాల రికార్డును దాటేసిన రూట్ దృష్టి ఇప్పుడు సచిన్ ఆల్‌టైమ్ టెస్టు పరుగుల రికార్డుపై పడింది. సచిన్ తన టెస్టు కెరీర్‌లో 15,921 పరుగులు చేయగా, ప్రస్తుతం రూట్ ఖాతాలో 14,278 పరుగులు ఉన్నాయి. వీరిద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 1,643 పరుగులు మాత్రమే. 36వ పడిలోకి అడుగుపెడుతున్నప్పటికీ రూట్ బ్యాటింగ్‌లో అదే స్థిరత్వం, ఫిట్‌నెస్ కనిపిస్తున్నాయి. ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో సచిన్ టెస్టు రికార్డును కూడా రూట్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.