డబ్ల్యూపీఎల్ 2027 : వేలానికి వేదిక సిద్ధం.. కొత్త సీజన్‌పై ఫ్రాంచైజీల ఫోకస్

మహిళల క్రికెట్‌లో మరో ఉత్కంఠభరిత అధ్యాయానికి రంగం సిద్ధమవుతోంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) 2027 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం కోసం బీసీసీఐ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2026-09-17 10:32 GMT

మహిళల క్రికెట్‌లో మరో ఉత్కంఠభరిత అధ్యాయానికి రంగం సిద్ధమవుతోంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) 2027 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం కోసం బీసీసీఐ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ కీలకమైన వేలం ప్రక్రియను అక్టోబర్ 28న కేరళలోని కొచ్చిలో ఉన్న ప్రతిష్టాత్మక గ్రాండ్ హయత్ హోటల్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఐదో సీజన్‌ ప్రారంభానికి ముందే లీగ్‌లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలు తమ జట్లను కొత్త రూపంలో తీర్చిదిద్దేందుకు.. వ్యూహాత్మకంగా బలోపేతం చేసుకునేందుకు కసరత్తును ముమ్మరం చేశాయి.

టోర్నీకి సంబంధించి సెప్టెంబర్ 28వ తేదీ అత్యంత కీలకం కానుంది. ఫ్రాంచైజీలు తమ జట్లలో ఉండే ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ ఆ రోజు వరకు గడువు విధించింది. ఏ ఆటగాళ్లను కొనసాగించాలి... ఎవరిని విడుదల చేసి వేలంలోకి పంపాలి అనే అంశాలపై జట్ల మేనేజ్‌మెంట్‌లు తీవ్రంగా చర్చలు జరుపుతున్నాయి. ఈ రిటెన్షన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే వేలంలోకి వచ్చే ఆటగాళ్ల జాబితాతో పాటు ఫ్రాంచైజీల వద్ద మిగిలే బడ్జెట్‌పై కూడా స్పష్టత వస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 28న కొచ్చి వేదికగా జరిగే వేలంలో దేశీయ, విదేశీ ఆటగాళ్ల కోసం గట్టి పోటీ నెలకొననుంది.

ఈసారి డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లను కొత్త నగరాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఇప్పటివరకు ప్రధాన నగరాలకే పరిమితమైన మ్యాచ్‌లను ఈసారి ఇతర ప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నారు. ముంబైలోని చారిత్రాత్మక బ్రాబోర్న్ స్టేడియంను ఒక వేదికగా పరిశీలిస్తుండగా.. గుజరాత్‌లోని వడోదరతో పాటు ఆధ్యాత్మిక నగరం వారణాసి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా వారణాసిలో నూతనంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వస్తే అక్కడ కొన్ని డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది.

అయితే వారణాసి కొత్త స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంతవరకు సిద్ధంగా ఉందనేది బీసీసీఐ అధికారులు త్వరలోనే ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. పిచ్ నాణ్యత, డ్రెస్సింగ్ రూమ్‌లు, భద్రతా ఏర్పాట్లు, లైటింగ్ , ప్రత్యక్ష ప్రసార వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతే స్టేడియం సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పరీక్షించడానికి టోర్నీకి ముందే కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేదా దేశవాళీ టోర్నమెంట్లు అక్కడ నిర్వహించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.

డబ్ల్యూపీఎల్ 2027 సీజన్ సమగ్ర షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ జనవరి 14న ప్రారంభమై ఫిబ్రవరి 7 వరకు కొనసాగనుంది. దీంతో అక్టోబర్ లో వేలం ముగిసిన తర్వాత ఆటగాళ్లతో ప్రాక్టీస్ క్యాంప్‌లు నిర్వహించడానికి ఫ్రాంచైజీలకు తగినంత సమయం లభిస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉండగా గతంలో టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ తమ ఆధిపత్యాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. గత నాలుగు సీజన్లలోనూ ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని చూస్తోంది. దీంతో రాబోయే 2027 సీజన్ క్రికెట్ అభిమానులకు సరికొత్త వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News