రాజమండ్రిలో ఆసక్తికర పోటీ.. హర్షకుమార్ కోడలు, వైసీపీ రెబల్ ప్రభావం ఎంత?
| రాజమండ్రి మేయర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రేలంగి శ్రీదేవి, వైసీపీ అభ్యర్థి దాసి వెంకటరావు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే వైసీపీ రెబల్‌గా అజ్జరపు వాసు, కాంగ్రెస్ తరఫున హర్షకుమార్ కోడలు బుడితి అన్విత బరిలో ఉండటంతో ఓట్ల చీలికపై చర్చ సాగుతోంది. వాసు వల్ల వైసీపీ ఓట్లు, అన్వితకు క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు మళ్లే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కూటమిలో ఓట్ల బదిలీ, బీజేపీ సంస్థాగత బలంపై కూడా చర్చ జరుగుతోంది. మొత్తం 13 మంది అభ్యర్థులు మేయర్ రేసులో ఉండటంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నిక తీవ్ర ఆసక్తి రేపుతోంది. కూటమి తరఫున ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రేలంగి శ్రీదేవి నామినేషన్ వేశారు. అయితే ఆమె అభ్యర్థిత్వంపై కూటమిలోని కొందరు టీడీపీ నేతలకు అభ్యంతరాలు ఉన్నాయన్న ప్రచారం ప్రతిపక్షం వైసీపీలో ఆశలు పెంచుతోంది. తొలి విడత ఎన్నికల్లో అనంతపురం కార్పొరేషన్ ను కైవసం చేసుకున్నట్లు రాజమండ్రిని దక్కించుకోవాలని వైసీపీ భావిస్తోందని చెబుతున్నారు. తన అభ్యర్థిగా దాసి వెంకటరావును నిలబెట్టిన విపక్షం పార్టీ నేతల నుంచి తిరుగుబాట్లను ఎదుర్కొంటున్నా సంస్థాగత బలంతో నెగ్గుకు వస్తామని ఆశిస్తోంది. అయితే రాజమండ్రిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ కోడలు బుడితి అన్విత పోటీ చేయడంతోపాటు వైసీపీ నేత అజ్జరపు వాసు ఇండిపెండెంట్ గా దిగడం విపక్షాన్ని ఆందోళనకు గురిచేస్తోందని చెబుతున్నారు.
తుది పోరులో 13 మంది
మేయరు రేసులో మొత్తం 13 మంది నేతలు మిగిలారు. ఇందులో బీజేపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ హర్షకుమార్ కోడల బుడితి అన్విత, స్వతంత్ర అభ్యర్థి అజ్జరపు వాసు చీల్చే ఓట్లు ఎవరి తలరాతను మార్చుతుందనే చర్చ ఆసక్తి రేపుతోంది. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నేత రేలంగి శ్రీదేవి ప్రభుత్వ బలంతోపాటు కూటమి నేతల మద్దతుతో ధీమాగా కనిపిస్తున్నారని చెబుతున్నారు. అయితే కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ సక్రమంగా జరగాల్సివుందని అంటున్నారు. ఇదేసమయంలో బీజేపీకి సంస్థాగతంగా పెద్దగా పట్టులేకపోవడంతో కూటమిలో కొంతవరకు ఆందోళన నెలకొందని చెబుతున్నారు. ఇదే అనుమానంతో కూటమి అగ్ర నేతలు సైతం స్థానిక నేతలను అప్రమత్తం చేశారని చెబుతున్నారు. అనంతపురంలో ఎదురైన అనుభవంతో జాగ్రత్తగా ఉండాలని టీడీపీ కేడర్ కు దిశానిర్దేశం చేసినట్లుగా చెబుతున్నారు.
మరోవైపు బీజేపీ అభ్యర్థి పోటీలో ఉండటం తమకు సానుకూల అంశమని ప్రతిపక్షం వైసీపీ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే రెబల్ అభ్యర్థి అజ్జరపు వాసు కారణంగా ఎంతమేర నష్టం జరుగుతుందనే భయమే ఆ పార్టీని వెంటాడుతోందని చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి బుడితి అన్విత వల్ల కూడా వైసీపీ ఓటు బ్యాంకుకు గండిపడే ప్రమాదం ఉందని సందేహిస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్న అజ్జరపు వాసు సుదీర్ఘకాలంగా వైసీపీలో పని చేస్తున్నారు. తనకు అవకాశం ఇవ్వాల్సిన సమయంలో పార్టీ నేతలు బయటవారిని తీసుకువచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పోటీకి దిగారని అంటున్నారు. కోవిడ్ సమయంలో విస్తృత ప్రజాసేవ చేసిన తనకు నగరంలో మంచి మద్దతు ఉందని ఆయన చెబుతున్నారు. దీంతో వాసుకు పడిన ప్రతి ఓటు వైసీపీకి దక్కాల్సినదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న బుడితి అన్వితకు క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉందని అంటున్నారు. అన్విత మామ మాజీ ఎంపీ హర్షకుమార్ క్రిస్టియన్ మైనార్టీలకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహించి ఆ వర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారని విశ్లేషిస్తున్నారు. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు డేంజర్ సిగ్నల్ గానే పరిగణిస్తున్నారు. సంప్రదాయంగా క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు వైసీపీ ఖాతాలో ఉంటూ వస్తున్నాయని, కార్పొరేషన్ ఎన్నికల్లో హర్షకుమార్ కారణంగా ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మళ్లిపోతే తాము మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని భయపడుతున్నారు. దీంతో రాజమండ్రి నగర పాలక సంస్థలో మేయర్ ఎన్నిక ఉత్కంఠగా మారిపోయింది. పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన అభ్యర్థులకు రకరకాల టెన్షన్లు వెంటాడుతున్నాయని చెబుతున్నారు.