మరణశిక్ష ఎదుర్కొంటున్నా వెనక్కి తగ్గని షేక్ హసీనా.. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు రీ ఎంట్రీ
| బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెకు బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. 2024 విద్యార్థి ఉద్యమ అణచివేతలో 1,400 మంది మరణాలకు బాధ్యురాలిగా ఆమెపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తిరుగు ప్రయాణం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఒకప్పుడు బంగ్లాదేశ్ రాజకీయ యవనికపై తిరుగులేని చక్రం తిప్పిన ధీరవనిత.. 15 ఏళ్ల పాటు దేశాన్ని తన కనుసన్నల్లో నడిపించిన అజేయ శక్తి.. కానీ కాలచక్రం తిరిగింది. ప్రజాగ్రహ జ్వాలల్లో చిక్కుకుని.. కట్టుబట్టలతో కన్నతల్లి లాంటి దేశాన్ని వదిలి.. ప్రాణరక్షణ కోసం భారత్‌లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. స్వదేశంలో ప్రత్యేక ట్రిబ్యునల్ విధించిన మరణశిక్ష కత్తిలా మెడపై వేలాడుతున్నా సొంత పార్టీపై నిషేధం ఉన్నా.. ఆమెలో పోరాట పటిమ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. అందుకే మృత్యువునే ధిక్కరిస్తూ డిసెంబర్ 16న తిరిగి బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెడతానని మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన ప్రకటన ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.
డిసెంబర్ 16.. ఇది కేవలం క్యాలెండర్‌లోని ఒక తేదీ మాత్రమే కాదు.. ప్రతి బంగ్లాదేశీయుడి గుండెల్లో రక్తాక్షరాలతో లిఖించబడిన స్వాతంత్ర్య దినం. 1971లో పాకిస్థాన్ అరాచకాలపై విజయం సాధించి తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కలల సౌధమైన స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భవించిన పవిత్రమైన రోజు. సరిగ్గా అదే విజయ్ దివస్ రోజున ఢాకాలో అడుగుపెట్టాలని హసీనా నిర్ణయించుకోవడం వెనుక లోతైన భావోద్వేగ, రాజకీయ వ్యూహం దాగి ఉంది. తన తండ్రి ప్రాణత్యాగంతో నిర్మించిన దేశంలో.. తాను ఎవరికీ భయపడి పారిపోలేదని తన ప్రజల కోసమే తిరిగి వస్తున్నానని చాటిచెప్పే ప్రయత్నమిది.
హసీనా తిరుగు ప్రయాణం పూలబాట ఏమీ కాదు.. అది అక్షరాలా ముళ్లకంప. ఢిల్లీ నుంచి ఢాకాకు జాతీయ విమానయాన సంస్థ విమానాన్ని ఏర్పాటు చేయాలని ఆమె చేసిన విజ్ఞప్తిని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. ఆమె ఒక దోషి అంటూ విమాన సదుపాయం కల్పించేందుకు నిరాకరించడం ద్వారా ఢాకాలో అడుగుపెట్టిన మరుక్షణమే ఆమెను సంకెళ్లతో బంధిస్తామన్న స్పష్టమైన సంకేతాలను పాలకులు పంపారు.
2024 నాటి విద్యార్థి ఉద్యమ అణచివేతలో సుమారు 1,400 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు బాధ్యురాలిని చేస్తూ ఆమె గైర్హాజరీలోనే ప్రత్యేక ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో విమానాశ్రయంలో దిగగానే అరెస్టు.. ఆపై ఉరికంబం ఎక్కే ప్రమాదం పొంచి ఉన్నా.. వెనక్కి తగ్గకూడదని హసీనా తీసుకున్న నిర్ణయం ఆమె మొండి ధైర్యానికి నిదర్శనం.
బంగ్లాదేశ్‌లోని రాజకీయ వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. హసీనా పార్టీపై నిషేధం విధించడం.. నేతలను అక్రమంగా అరెస్టు చేస్తుండటంతో ఆమె మద్దతుదారులు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ తరుణంలో తమ నాయకురాలు తిరిగి వస్తోందన్న వార్త ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకవేళ హసీనా నిజంగానే ఢాకా గడ్డపై అడుగుపెడితే లక్షలాది మంది అభిమానులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలు చెలరేగి దేశం మరోసారి అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా రెండేళ్లుగా భారత్ ఆశ్రయంలో ఉన్న హసీనా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం భారత్-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలకు కూడా ఒక అగ్నిపరీక్షగా మారనుంది.
తన తండ్రి, కుటుంబ సభ్యులందరినీ హత్య చేసిన గడ్డపైనే.. ఇప్పుడు మరణశిక్షను ఎదుర్కొంటూ అడుగుపెట్టేందుకు సిద్ధమైన షేక్ హసీనా సాహసం చరిత్రలో నిలిచిపోనుంది. డిసెంబర్ 16న ఢాకా విమానాశ్రయంలో ఏం జరగబోతోంది? ఉక్కు మహిళ తిరిగి జైలు గోడల మధ్యకు వెళ్తారా? లేక బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో సంచలన అధ్యాయానికి తెరలేపుతారా? అన్నది ఉత్కంఠగా మారింది.