టీడీపీకి బరువుగా మారిన కొలికపూడి?
అధికారంలో ఉన్న వేళ అధినేతకు అండగా నిలుస్తూ.. అవసరం ఉన్నా లేకున్నా విపక్షంపై విరుచుకు పడుతూ.. తనకు మించిన విధేయత మరెవరిలోనూ కనిపించదన్నట్లుగా వ్యవహరించే తీరును కొందరు నేతలు ప్రదర్శిస్తుంటారు.
అధికారంలో ఉన్న వేళ అధినేతకు అండగా నిలుస్తూ.. అవసరం ఉన్నా లేకున్నా విపక్షంపై విరుచుకు పడుతూ.. తనకు మించిన విధేయత మరెవరిలోనూ కనిపించదన్నట్లుగా వ్యవహరించే తీరును కొందరు నేతలు ప్రదర్శిస్తుంటారు. అదే సమయంలో చేతిలో అధికారంలో ఉన్నప్పుడు వెనుకా ముందు చూసుకోకుండా వ్యవహరించే అతి నేతలకు కొదవ ఉండదు. ఇందుకు భిన్నంగా అవసరం ఉన్నా.. లేకున్నా.. అదే పనిగా వివాదాల్లో చిక్కుకుంటూ అసంతృప్త నేతగా ముద్ర వేయించుకునే తీరుకు వీలైనంత దూరంగా వ్యవహరిస్తుంటారు. అందులోని ప్రాంతీయ పార్టీలో ఈ తరహా వైఖరి నేతల రాజకీయ ఫ్యూచర్ కు ఏ మాత్రం మంచిది కాదు. అందుకే తోక జాడించేందుకు జంకుతుంటారు. ఇందుకు భిన్నమైన వ్యవహారశైలితో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
కారణం ఏదైనా కానీ వివాదాలతో సహజీవనం చేస్తున్న ముద్రను వేసుకున్నారు కొలికపూడి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ విపక్షంలో ఉన్న వేళ.. అమరావతి రాజధాని ఉదంతంలోనూ.. రాజధాని రైతులు చేసిన పోరాటంలో కీలకభూమిక పోషించిన ఆయన.. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాత్రం ఆయన వ్యవహారశైలిలో మార్పు వచ్చిందన్నమాట అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ మధ్యనే విస్సన్నపేట మండలం నరసాపురం జెడ్పీహెచ్ స్కూల్ పీఈటీగా పని చేస్తున్నరమేశ్ అనే టీచర్ ను.. డిప్యూటీ డీఈవో ద్వారా తన ఇంటికి పిలిపించుకొని ఇష్టమొచ్చినట్లుగా తిట్టటమే కాదు.. కర్రతో కొట్టినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ అంశాన్ని అధికార పార్టీకి చెందిన రాష్ట్రసామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య స్పందిస్తూ.. ఎమ్మెల్యే కొలికపూడి తీరుతో అటు పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొంటూ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు నివేదించటం గమనార్హం. పీఈటీ టీచర్ ను ఇంటికి పిలిపించిన మాట వాస్తవమేనని.. గత ఏడాది పదో తరగతి ఫలితాలు సరిగా రాలేదని.. ఆటల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టటం వల్లే చదువు దెబ్బ తింటోందన్న ఫిర్యాదు నేపథ్యంలో విద్యా శాఖ అధికారులతో కలిసి ఇంటికి పిలిపించి.. సమీక్షించినట్లుగా పేర్కొన్నారు.
తాను కొట్టలేదని.. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా రియాక్టు కావటమే కాదు సవాలు విసిరారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని.. అలా చేస్తున్న వారిని తాను విడిచి పెట్టనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా కొలికపూడిపై వచ్చే వివాదాలకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఆయనపై తరచూ ఏదో ఒక విమర్శ.. ఆరోపణ వస్తూనే ఉంటుంది. తాజాగా తన వాట్సప్ స్టేటస్ లో తన నియోజకవర్గంలో చేపట్టే డెవలప్ మెంట్ కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించకుండా ప్రవర్తిస్తున్నారని.. అందుకు తన సామాజిక ప్రాతినిధ్యాన్ని ప్రస్తావిస్తూ పెట్టిన పోస్టులు తాజా ఇష్యూగా మారింది.
తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు.. విజయవాడ ఎంపీ కేశినేని చిననికి మధ్య రచ్చ అంతకంతకూ పెరగటం.. ఇదో అధిపత్య పోరుగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాల పీఈటీ టీచర్ పై దాడి ఆరోపణలను పక్కదారి పట్టించటానికి ప్రోటోకాల్ పంచాయితీని తెరమీదకు తెచ్చారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. స్కూల్ టీచర్ ఇష్యూలోనూ ఎంపీ హస్తం ఉందని.. తనను రాజకీయంగా దెబ్బ తీయటానికి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.
తమది ఎస్సీ నియోజకవర్గం కావటంతో తనపై వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ ప్రభుత్వ ఇమేజ్ ను సైతం దెబ్బ తీసేలా కొలికపూడి తీరు ఉందన్న వాదన పార్టీలో ఈ మధ్యన పెరిగింది. మొత్తంగా నియోజకవర్గంలోని అధికారపార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడటమే కాదు.. ఇవన్నీ కలిసి కూటమి సర్కారు ఇమేజ్ ను దెబ్బ తీసే స్థాయిలో ఉంటున్నట్లుగా చెబుతున్నారు. తిరువూరు నియోజకవర్గం పరిధిలో జరిగే ఏ అధికారిక కార్యక్రమానికైనా స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షత వహించటం మామూలే. అలాంటివి తిరువూరులో జరగటం లేదని.. దీనికి ఎంపీ కేశినేని కారణంగా కొలికపూడి వర్గీయులు ఆరోపిస్తున్నారు.
అమరావతి ఉద్యమ నేపథ్యంలో పార్టీకి దన్నుగా నిలవటం.. దళిత సెంటిమెంట్ లాంటి అంశాలే అధినేత చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోవటానికి తటపటాయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పార్టీ లైనుకు భిన్నంగా వ్యవహరించే నేతలపై చర్యల కొరడా ఝుళిపించే విషయంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు అంత బాగా కనిపించదు. ఓపిక పడుతూ.. వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తుంటారు. రాజధాని అమరావతి అంశంలో పోరాడిన ఉద్యమ నేత ఇమేజ్ ఉన్న కొలికపూడిపై చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందన్న అభిప్రాయం చంద్రబాబులో ఉందని.. అందుకే ఆయన చర్యలకు వెనుకాడుతున్నట్లుగా చెబుతున్నారు.
చర్యల సంగతిని పక్కన పెడితే.. నియోజకవర్గంలోని అధిపత్య పోరుకు పరిష్కారాన్ని చూపినా బాగుంటుంది కదా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇరువురు నేతల మధ్య నెలకొన్న వర్గ పోరును చక్కదిద్దేందుకు ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా కమిటీని రంగంలోకి చంద్రబాబు దించినా.. పెద్దగా ప్రయోజనం లేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే కమిటీ ద్వారా రిపోర్టు తెప్పించుకున్నప్పటికి చర్యల కంటే కౌన్సెలింగ్ మార్గాన్నిఅధినేత ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొలికపూడి వ్యవహారశైలిని చంద్రబాబు తప్పు పట్టారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే సహించనని స్పష్టం చేసినా.. పరిస్థితిలో అయితే మార్పు రావటం లేదు. అంతేకాదు.. వ్యవహారశైలిని మార్చుకోకపోతే పార్టీ తరఫు గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించినా.. పరిస్థితుల్లో మార్పు రాలేదు. మొత్తంగా చూస్తే.. పార్టీకి ప్రభుత్వానికి బరువుగా మారిన కొలికపూడి విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని అధినేత తీసుకోవాలన్న మాట తరచూ వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి