టీడీపీలో సామాన్య కార్యకర్తలకు పదవులు.. అసలు సీక్రెట్ ఇదే.. పనిచేసిన లోకేశ్ మాస్టర్ ప్లాన్!
| నారా లోకేశ్ తీసుకొచ్చిన మైటీడీపీ యాప్ ద్వారా చురుగ్గా పనిచేసే కార్యకర్తలను గుర్తించి స్థానిక, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తల పనితీరు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వివరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు యాప్ డేటాను ప్రాతిపదికగా తీసుకుంటున్నట్లు సమాచారం. 10 లక్షల మందికి పైగా కార్యకర్తలు ఈ డిజిటల్ వేదికలో భాగస్వాములయ్యారు.
“పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది.. ప్రతిభకు తగిన అవకాశాలు దక్కుతాయి” అంటూ ప్రతి పార్టీలోనూ నేతలు ప్రకటనలు చేస్తారు. కానీ, నిజంగా కష్టపడి పనిచేసేవారిలో ఎందరికి పదవులు దక్కుతున్నాయనే విషయంపైనే క్లారిటీ ఉండదని చెబుతారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇటువంటి అభిప్రాయానికి తావులేదని నిరూపించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ తీసుకువచ్చిన మై టీడీపీ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం దక్కించుకున్నారని చెబుతున్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటుగా పార్టీని డిజిటల్ మాధ్యమంలోనూ వినూత్నంగా నడుపుతున్న లోకేశ్ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు అనువుగా మై టీడీపీ యాప్ తీసుకువచ్చారు. నామినేడెట్ పదవుల భర్తీలోనూ స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్ వంటి పదవులకు అభ్యర్థుల ఎంపికలోనూ మైటీడీపీ యాప్ డేటాను ప్రాతిపదికగా తీసుకున్నట్లు చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో చాలా మంది సామాన్యులు పెద్ద పదవులను చేపట్టినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం జిల్లాల జడ్పీ చైర్మన్ల ఎంపికతోపాటు చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్, మండల పరిషత్ ఎన్నికల్లో అనూహ్యంగా కొందరు ఎంపికయ్యారు. ఆయా స్థానాల్లో పోటీకి చాలా మంది ఆసక్తి చూపినా, పార్టీ హైకమాండ్ నుంచి ఎవరూ ఊహించని కార్యకర్తల పేర్లు ఎంపిక చేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏ బ్యాక్ గ్రౌండు లేని వారు ఆయా పదవులకు ఎలా ఎంపికయ్యారని నేతలు ఆరా తీయగా, ఊహించని పదవులకు అనూహ్యంగా ఎంపికైన వారి బ్యాక్ గ్రౌండ్ మై టీడీపీ యాప్ గా తేలిందని చెబుతున్నారు.
‘మైటీడీపీ’ యాప్ ద్వారా కార్యకర్తలు నిర్వహించే ప్రతి కార్యక్రమం, వారు పంచుకునే ఫొటోలు, ప్రజల్లోకి తీసుకెళ్లే పార్టీ సందేశాలు ఎప్పటికప్పుడు డేటా రూపంలో నమోదవుతున్నాయని చెబుతున్నారు. దీనివల్ల ఏ నియోజకవర్గంలో ఏ కార్యకర్త ఎంత చురుగ్గా పనిచేస్తున్నారనే విషయం నేరుగా అధిష్ఠానం దృష్టికి వెళ్తోందని అంటున్నారు. అంతేకాకుండా, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు సైతం క్యాడర్‌ను ఏ విధంగా కలుపుకొని వెళ్తున్నారనే అంశాన్ని ఈ యాప్ డేటా ద్వారా పార్టీ నాయకత్వం విశ్లేషిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతోమంది సాధారణ కార్యకర్తలకు సర్పంచులు, కార్పొరేటర్లుగా అవకాశాలు దక్కడం వెనుక, అలాగే నామినేటెడ్ పదవుల భర్తీలో కష్టపడిన వారికే ప్రాధాన్యం లభించడం వెనుక ఈ యాప్ అందించిన పనితీరు నివేదికలే ప్రామాణికంగా నిలిచాయని చెబుతున్నారు.
కార్యకర్తల కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ఈ వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని అంటున్నారు. యాప్ ద్వారా అప్పగించిన టాస్క్‌లను, పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిన ఉత్తమ కార్యకర్తలను గుర్తించి, వారికి స్వయంగా ప్రశంసాపత్రాలు అందజేస్తూ గౌరవిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల నుంచి ఈ యాప్‌కు విశేష స్పందన లభిస్తుండగా, యాప్ వినియోగం, కార్యక్రమాల నమోదులో పార్లమెంట్ నియోజకవర్గాల విభాగంలో నరసరావుపేట, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల విభాగంలో కుప్పం, వినుకొండ, కనిగిరి, మంగళగిరి, గన్నవరం అగ్రస్థానంలో కొనసాగుతూ పార్టీ సంస్థాగత బలోపేతంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి.
రాజకీయాల్లో సామాన్య కార్యకర్తకు తగిన గౌరవం, అధికారంలో భాగస్వామ్యం కల్పించినప్పుడే పార్టీ దీర్ఘకాలం బలంగా ఉంటుందని నారా లోకేశ్ విశ్వసిస్తారు. అందుకే ‘మైటీడీపీ’ యాప్‌ను కేవలం ఒక మొబైల్ అప్లికేషన్‌గా కాకుండా, ప్రతి కార్యకర్త భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఒక సాధికారత వేదికగా తీర్చిదిద్దారు. కష్టపడి పనిచేసే కార్యకర్తకు నాయకుల ఆశీస్సులు లేకపోయినా, వారి పనితీరే వారిని ఉన్నత పదవులకు చేరుస్తుందనే నమ్మకాన్ని కల్పించడంలో ఈ 10 లక్షల మంది డిజిటల్ సైన్యం ఒక తిరుగులేని శక్తిగా మారింది.