విశాఖ పేరు మారుతోందా...క్లారిటీ ఇదే !
| విశాఖపట్నం పేరును మార్చుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వీఎమ్మార్డీయే ఖండించింది. విశాఖను ‘బే టెక్ సిటీ’గా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనని, కైలాసగిరి నుంచి భీమిలీ వరకు 52 చదరపు కిలోమీటర్లలో ప్రాజెక్టును ప్రతిపాదించామని స్పష్టం చేసింది. నగరం పేరు మార్పుపై ఎలాంటి నిర్ణయం లేదని తేల్చిచెప్పింది.
విశాఖ నగరం పేరు ఈనాటిది కాదు, దానికంటూ ఎంతో చరిత్ర ఉంది. అది గ్రంధస్థం చేయబడినది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఒక ఆంధ్ర రాజు కాశీ యాత్రకు వెళ్తూ ఇక్కడ బస చేసి తన ఇష్టదైవమైన విశాఖేశ్వరుడికి అంటే కుమారస్వామికి సముద్ర తీరంలో ఒక ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఆ స్వామి పేరు మీదుగానే ఈ ప్రాంతానికి విశాఖపట్నం అనే పేరు స్థిరపడిందని ఆ తరువాత కాలంలో ఆ ఆలయం సముద్ర గర్భంలో కలిసిపోయిందని చరిత్రకారులు చెబుతారు. అదే విధంగా శాసనాలు, చారిత్రక గ్రంథాలని బట్టి చూస్తే కనుక క్రీస్తు శకం 1068 నాటి కులోత్తుంగ చోళుడు శాసనాలలో ఈ నగరాన్ని విశాఖపట్నం అని పేర్కొన్నారని అంటారు.
ఆ పేరు కూడా ఉంది :
ఇక విశాఖ నగరానికి మధ్యయుగంలో కులోత్తుంగ చోళ పట్టణం అని కూడా ఉండేది. బ్రిటిష్ వారి కాలంలో పలకడానికి వీలుగా వాల్తేరు అని వైజాగ్ అని పేర్లు వాడుకలోకి వచ్చాయి. ఇక క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన పాణిని అష్టాధ్యాయి కౌటిల్యుడి అర్థశాస్త్రం వంటి ప్రాచీన గ్రంథాలలో కళింగ రాజ్యంలో భాగమైన ఈ తీర ప్రాంతం గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. అలాగే బౌద్ధ గ్రంథాలలో కూడా తొట్లకొండ, బావికొండ వంటి విహారాల ద్వారా ఈ ప్రాంత ప్రాముఖ్యత గ్రంథస్థం చేయబడింది. ఇంతలా విశాఖ పేరు వెనక చరిత్ర ప్రాముఖ్యత ఉంటే ఈ నగరం పేరు మారుతోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం వైరల్ గా మారుతోంది.
ఎందుకొచ్చిందంటే :
అసలు ఈ పుకార్లు కానీ ప్రచారం కానీ ఎందుకొచ్చింది అంటే విశాఖను హైటెక్ సిటీ మాదిరిగా బే టెక్ సిటీగా చేస్తామని కూటమి పెద్దలు చెప్పారు. ఇక దాని మీద విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ వీఎమ్మార్డీయే సమావేశంలో వైజాగ్ బే టెక్ సిటీగా విశాఖను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని అంటున్నారు. హై టెక్ సిటీగా హైదరాబాద్ లో అభివృద్ధి చేశారు కాబట్టి బే టెక్ సిటీ అని క్యాచీగా ఉంటుందని చెప్పుకొచ్చారు తప్పించి అసలు పేరు మార్పు ప్రశ్న లేదని అంటున్నారు. దీని మీద వీఎమ్మార్డీయే అయితే క్లియర్ కట్ గా ఒక ప్రకటన చేసింది. అందులో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు ఏవీ నమ్మవద్దని కోరింది.
బే టెక్ సిటీగా ప్రగతి :
అయితే బే టెక్ సిటీ గా విశాఖను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యమని పేర్కొంది. విశాఖలోని కైలాసగిరి నుంచి భీమిలీ దాకా ఉన్న 52 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వైజాగ్ బే సిటీ అభివృద్ధి ప్రాజెక్ట్ ని వీఎమ్మార్డీయే ప్రతిపాదించింది అని అధికారులు చెబుతున్నారు. అందువల్ల దీనికీ విశాఖ నగరం పేరు మార్పునకు ఎలాంటి సంబంధమే లేదని తేల్చేసింది. విశాఖలో సముద్రం ఒడ్డున సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన అని ఆ దిశగానే యాక్షన్ ప్లాన్ ఉంటుందని అంటున్నారు. ఇందులో పేరు మార్పు ప్రసక్తి లేదని చెబుతున్నారు. మరో వైపు చూస్తే విశాఖ పేరుని మార్చవద్దని మేధావులు స్థానికులు కోరుతున్నారు. ఇపుడు వీఎమ్మార్డీయే వివరణతో వారంతా సంతృప్తి చెందుతున్నారు.