గోవా కేరళ తరహాలో విశాఖ....కూటమి యాక్షన్ ప్లాన్ !
| విశాఖను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా కొత్త ప్యాకేజీలు, అడ్వెంచర్ యాక్టివిటీస్, బీచ్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. డిసెంబర్‌లో విశాఖ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించడంతో పాటు గోవా, కేరళ తరహాలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఏపీలో అందమైన నగరంగా విశాఖ ఉంది. అలాగే ఆర్థిక సాంస్కృతిక రాజధానిగా కూడా ఉంది. విశాఖ ఎన్నో జాతీయ అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలుస్తోంది. ఆసియా ఖండంలోనే శర వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీగా ఉంది. అలాటి విశాఖను టూరిజం పరంగా కూడా అగ్ర స్థానంలో నిలబెట్టాలని కూటమి ప్రభుత్వం సీరియస్ ఆలోచిస్తోంది. ఈ మేరకు యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తోంది. టూరిజం వల్ల పెద్ద ఎత్తున ఆదాయాలను సంపాదించే అనేక దేశాలు ఉన్నాయి. అలాగే దేశంలో కూడా అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఆ విధంగా విశాఖను తీర్చిదిద్దాలని కూటమి సర్కార్ భావిస్తోంది.
పర్యాటక గమ్యస్థానంగా :
విశాఖను పర్యాటకానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రూపొందించే పనిలో విశాఖ జిల్లా యంత్రాంగం ప్రస్తుతం ఉంది. కేవలం నగరాన్ని మాత్రమే కాకుండా విశాఖ జిల్లాను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ, వీఎంఆర్డీఏ అధికారులు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాల్ని సందర్శిస్తున్న పర్యాటకుల వివరాల్ని ప్రాంతాల వారీగా పర్యాటకుల విభిన్న విభాగాల వారీ విశ్లేషించాలని జిల్లా యంత్రాంగం సంబంధిత శాఖల అధికారులకు సూచించింది. పర్యాటకులు ఏయే ప్రాంతాల నుంచి వస్తున్నారు, వారి ఆసక్తులు, సందర్శన ప్రాధాన్యతలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి, అందుకనుగుణంగా పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధం అవుతోంది.
టూరిస్టులను ఆకట్టుకుంటూ :
విశాఖకు టూరిస్టులు పెద్ద ఎత్తున వచ్చేలా వారిని ఆకట్టుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం ఏపీటీడీసీతో పాటు ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న పర్యాటక ప్యాకేజీలు, సాహస క్రీడలు, ఇతర పర్యాటక కార్యకలాపాల పూర్తి వివరాల్ని సేకరించి పర్యాటకులకు సులభంగా అందుబాటులో ఉండేలా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారిక వెబ్‌సైట్లలో పొందుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ అధికారులకు సూచిస్తున్నారు. పర్యాటకులు తమ పర్యటనలను ముందుగానే ప్రణాళిక చేసుకునేందుకు, అందుబాటులో ఉన్న పర్యాటక సేవలు మరియు కార్యకలాపాలపై సమగ్ర సమాచారం పొందేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. విశాఖ జిల్లా పరిధికే పరిమితం కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి అందాలు, వారసత్వ ప్రదేశాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రాలను కూడా గుర్తించి, వాటిని అనుసంధానం చేస్తూ సమగ్ర పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. ఈ యాక్షన్ ప్లాన్ అమలు అయితే విశాఖకు పర్యాటకులు పోటెత్తడం ఖాయమని అంటున్నారు.
విశాఖ ఉత్సవ్ తోనే :
ఈ క్రమంలో డిసెంబర్ నెలలో విశాఖ ఉత్సవ్‌ను ఘనంగా వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈసారి ఉత్సవాల్లో పర్యాటకుల్ని ఆకర్షించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, సాహస క్రీడలు, వివిధ ప్రత్యేక ఆకర్షణలను ఏర్పాటు చేయాలనుకుంటోంది. విశాఖ తీర ప్రాంతంలోని ప్రతి బీచ్‌కు ప్రత్యేక గుర్తింపు కల్పించే విధంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం కూడా యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఉంది. ప్రతి బీచ్‌లో విభిన్నమైన పర్యాటక ఆకర్షణలు, వినోద కార్యక్రమాలు, అడ్వెంచర్ యాక్టివిటీస్, పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా అన్ని బీచ్‌లను ప్రత్యేక పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. గోవా, కేరళ రాష్ట్రాల తరహాలో విశాఖ జిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.