విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత
| విశాఖ నూతన మేయర్ ముక్కా శ్రావణి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడు నవంబర్ 20న గుండెపోటుతో కన్నుమూశారు. నవంబర్ 23న కుమార్తె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. కుమార్తెను మేయర్‌గా చూడాలన్న ఆయన కల నెరవేరినా, ఆ ఘట్టాన్ని చూడకుండానే తుదిశ్వాస విడిచారు.
విశాఖ నూతన మేయర్ ముక్కా శ్రావణి ఇంట పెను విషాదం నెలకొంది. ఆమె తండ్రి, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడు ఈ రోజు (నవంబరు 20) ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో మరణించారు. మేయర్‌గా కుమార్తె ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు చోటుచేసుకున్న ఈ విషాదం ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది. ఈ నెల 1న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ముక్కా శ్రావణి విశాఖ మేయరుగా గెలిచారు. మరో మూడురోజుల్లో మేయరుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వార్డుల్లో జరిగిన విజయోత్సవాల్లో శ్రావణితోపాటు ఆమె తండ్రి ముత్యాలనాయుడు కూడా పాల్గొనేవారు. మేయరు అయిన కుమార్తెను చూసి ఎంతో ఆనందంగా రోజులు గడుతున్నారు. ఈ క్రమంలోనే విధి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
సేవలే సింహాసనమై వరించాయి..
1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచే ముత్యాలనాయుడు పార్టీ జెండాను భుజాన మోశారు. 2007లో జీవీఎంసీ కార్పొరేటర్‌గా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. పదవులు ఉన్నా లేకపోయినా, నిస్వార్థంగా పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన చేసిన సేవలు అపారం. ఆయన నిబద్ధత, దశాబ్దాల విధేయతను గుర్తించిన పార్టీ అధిష్టానం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముక్కా శ్రావణికి విశాఖ మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. తండ్రి వేసిన బాటలో నడిచిన శ్రావణి, ఘన విజయం సాధించి విశాఖ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవితానికి దక్కిన అత్యున్నత గౌరవంగా కుమార్తెకు మేయర్ పదవి దక్కడంతో ముత్యాలనాయుడు ఉప్పొంగిపోయారు.
ప్రమాణ స్వీకారానికి ముందే విషాదం
నవంబర్ 23న ముక్కా శ్రావణి విశాఖ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఆ అపురూప ఘట్టాన్ని కళ్లారా చూసి మురిసిపోవాలని ముత్యాలనాయుడు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఇంతలో, ప్రమాణ స్వీకారానికి సరిగ్గా మూడు రోజుల ముందు శుక్రవారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.
తీరని లోటు.. కన్నీటి వీడ్కోలు
తిరుపతి పర్యటనలో ఉన్న శ్రావణి, తండ్రి మరణవార్త విని గుండెలు పగిలేలా రోదిస్తూ హుటాహుటిన విశాఖకు బయలుదేరారు. ఒకవైపు అత్యున్నత పదవి దక్కిన ఆనందం, మరోవైపు ఆ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన తండ్రిని కోల్పోయిన దుఃఖం ఏకకాలంలో ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కన్నకూతురిని ప్రథమ పౌరురాలిగా చూడాలన్న ఆ తండ్రి కల నెరవేరినా, ఆ మధుర క్షణాలను చూడకుండానే ఆయన శాశ్వత నిద్రలోకి జారుకోవడం విశాఖ వాసులను, పార్టీ కార్యకర్తలను కలచివేస్తోంది.