అట్రాక్షన్ లాగేస్తోంది.... బీచ్ మింగేస్తోంది !
| విశాఖలోని రుషికొండ బీచ్‌లో వరుస సముద్ర ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రిప్ కరెంట్స్, బలమైన అలల కారణంగా ఈత వచ్చినవారు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. 2021 నుంచి నవంబర్ 2026 వరకు విశాఖ తీరంలో 165 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా సముద్రంలోకి దిగడమే విషాదాలకు కారణమవుతోంది.
ప్రకృతి ఎపుడూ అందమైనదే. అంతే కాదు ఆ అందం వెనక తెలియని రహస్యాలు కూడా ఎన్నో ఉంటాయి. ఊహించని అగాధాలు ప్రమాదాలు సైతం పొంచి ఉంటాయి. బీచ్ ని చూస్తే సాధారణంగా ఎవరికైనా కాళ్ళకు రెక్కలు వస్తాయి. పెద్దలు సైతం పిల్లలు అయిపోతారు. కెరటాలకు తమ పాదాలను తాకిస్తూ అలా వాటి వెంట పరుగులు తీస్తారు. అయితే ఈ కెరటాలు అందించే ఉత్సాహం మాటునే ముప్పు కూడా ఉంటుంది. అప్రమత్తత లేకపోతే క్షణాలలో బతుకు మునిగిపోతుంది. విశాఖ బీచ్ లో ఎన్నో బ్యూటీఫుల్ స్పాట్స్ ఉన్నాయి. అదే సమయంలో ప్రమాదాలు హెచ్చరించే స్పాట్స్ ఉన్నాయి. అయితే యువత అంతా రుషికొండ బీచ్ నే ఎంచుకుంటారు. ఇది నిజం చెప్పాలంటే డేంజరస్ స్పాట్ గా ఉంటుంది.
తరచూ ప్రమాదాలు :
విశాఖ సాగర తీరంలో అందమైన బీచ్‌లతో పాటు రిప్ కరెంట్స్ వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అయితే వాటర్ స్పోర్ట్స్, అందమైన వాతావరణం వల్ల యువత రుషికొండ బీచ్ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ ఇక్కడే రిప్ కరెంట్స్ తాకిడి ఎక్కువ. అది ఏమీ చూడకుండా సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరంగా మారుతోంది. రుషికొండ బీచ్ వద్ద వరస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా చూస్తే కనుక నగరానికి చెందిన ఒక డిగ్రీ కళాశాల నుంచి ఎనిమిది మంది విద్యార్థులు రుషికొండ బీచ్ వద్దకు వెళ్ళారు. ఇందులో కొందరు స్నానాలకు దిగారు. అయితే ఒక విద్యార్థి గల్లంతు అయ్యాడు, దాంతో ఆనందం కాస్తా విషాదంగా మారిపోయింది.
కబలిస్తున్న సరదా :
ఇదొక్కటే కాదు ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రమాదాలు ఇదే రుషికొండ బీచ్ వద్ద జరిగాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ముగ్గురు విద్యార్థులు సముద్ర స్నానానికి దిగి బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అలాగే సెప్టెంబర్ 14న నగరానికి చెందిన ఇద్దరు యువకులు స్నానం చేస్తుండగా అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. 2021 నుండి నవంబర్ 2026 మధ్య కాలంలో విశాఖపట్నం తీరంలో మొత్తం 165 మంది మరణించగా, అందులో రుషికొండ బీచ్‌లో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై దాకా లేదా అంతకంటే ఎక్కువే ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
రుషికొండ ఎందుకు ప్రమాదం :
ఇదిలా ఉంటే సముద్రం పైకి ఉల్లాసంగా కనిపించినా లోపల పరిస్థితి వేరుగా ఉంటుంది. బలమైన అలలు రిప్ కరెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలా రుషికొండ తీరంలో కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వచ్చే బలమైన అలలు, నీటి అడుగున ఉండే సుడులు ఈత వచ్చిన వారిని కూడా లోపలికి లాగేస్తున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇస్రో ఎన్ సీఈఎస్ఎస్ అధ్యయనాల ప్రకారం విశాఖ సాగర తీరం మొత్తంలోనే రిప్ కరెంట్ల ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇవి ఒడ్డు నుంచి లోతు సముద్రం వైపు వేగంగా లాక్కెళ్తాయి. ఆహ్లాదం, ఈత కోసం సముద్రంలోకి దిగి లోతులోకి వెళ్లడం వల్ల యువత, విద్యార్థులు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయే ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
హెచ్చరికలను పట్టించుకోరు :
విశాఖలో అనేక చోట్ల హెచ్చరికల బోర్డులు కనిపిస్తాయి. అయితే ఎవరూ వాటిని కనీసంగా చూడరు. ఇలా హెచ్చరిక బోర్డులు, సేఫ్టీ ఫ్లాగ్‌లు ఉన్నప్పటికీ కొన్నిసార్లు లోతులోకి వెళ్లడం లేదా నిబంధనలు పాటించకపోవడం ప్రాణాలకే ప్రమాదాలకు దారితీస్తోంది. లైఫ్ గార్డ్స్ మెరైన్ పోలీసులు ప్రమాదకర ప్రాంతాల గురించి హెచ్చరిస్తున్నప్పటికీ పర్యాటకులు అందులోనూ ఎక్కువగా యువకులు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లడం వల్ల వరస విషాదాలు జరుగుతున్నాయి. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా హెచ్చరికలు ఉన్నప్పుడు సముద్రంలోకి దిగకూడదని అధికారులు సూచిస్తున్నారు. అయినా ఉత్సాహం కెరటాలతో పోటీ పడుతోంది. ఈ పందెంలో నిండు ప్రాణం బలి అవుతోంది.