బెజవాడలో వైసీపీ థర్డ్ ప్లేస్ లోకా ?

విజయవాడ ఏపీలో రాజకీయ గుండె కాయ లాంటిది అన్నది తెలిసిందే. రాజకీయ రాజధానిగా ఈ నగరానికి పేరుంది.

Update: 2026-10-21 03:43 GMT

విజయవాడ ఏపీలో రాజకీయ గుండె కాయ లాంటిది అన్నది తెలిసిందే. రాజకీయ రాజధానిగా ఈ నగరానికి పేరుంది. ఈనాటి మాట కాదు, వందేళ్ళకు పూర్వం నుంచే ఈ నగరానికి ఆ ఘనత ఉంది. దానికి కారణం అన్ని ప్రాంతాలకు మధ్యన ఉండడం భౌగోళికంగా కీలకమైన అంశం. అలాగే చైతన్యవంతులైన ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. రాజకీయ వేడి కూడా అలాగే ఉంటుంది. బెజవాడలో ప్రధాన సామాజిక వర్గాల ఆధిపత్యం కూడా కొనసాగుతూ వస్తుంది. పార్టీలు కాలాలు రాజకీయాలు వేరు అయినా ఆ సామాజిక వర్గాలు మాత్రం ఎపుడూ ఫోర్ ఫ్రంట్ లోనే ఉంటాయి. రేసులో ఎపుడూ టాప్ చైర్ కోసం దూకుడు చేస్తూనే ఉంటాయి.

రంగంలోకి రాధా :

ఈ నేపథ్యం నుంచి చూసినపుడు బెజవాడ కార్పోరేషన్ రాజకీయం ఇపుడు మచి హీట్ మీద ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి విడతలో ఈ నెల 28న జరిగే ఎన్నికలలో బెజవాడ మీదనే ఏపీ మొత్తం ఫోకస్ ఉంది. దానికి కారణం ఇక్కడ వంగవీటి రంగా కుమారుడు రాధా దాదాపు 12 ఏళ్ళ తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం. ఆయన చివరి సారిగా 2014లో వైసీపీ తరఫున విజయవాడ తూర్పు అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత 2019, 2024లలో పోటీ చేయలేదు. దాంతో పాటు విజయవాడ నగరం మొత్తాన్ని ప్రభావితం చేసే మేయర్ సీటుకు రాధా ఫోకస్ చేయడం కూడా అతి పెద్ద రాజకీయ చర్చగా ఉంది. ఆయన రాష్ట్ర మంత్రి అవుతారని అంతా ఆశిస్తున్న వేళ మేయర్ గా బరిలోకి దిగడం ఏమిటి అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. అయితే మేయర్ పదవి కూడా మామూలుది కాదు కాబట్టి రాధా డెసిషన్ ఓకే అంటూ మద్దతుదారులు అయితే యమ జోరు మీద ప్రచారం చేస్తున్నారు.

ఏబీవీ ఎంట్రీతో :

రాధా పోటీకి దిగడమే ఒక సర్ ప్రైజ్ అనుకుంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మేయర్ పదవికి పోటీ పడడం మరో సర్ ప్రైజ్ గా ఉంది. ఏబీవీ రాష్ట్ర స్థాయిలో పేరున్న అధికారి. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన మేయర్ కి పోటీ అంటూ సంచలనం సృష్టించారు. అలాగే ఇండిపెండెంట్ గా అని మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. దాంతో ఏబీవీ పోటీ కూడా ఆసక్తిని పెంచుతోంది. ఏబీవీ రాజకీయ నాయకుడు కాదు, కానీ ఆయన పోటీ మీద ఎందుకు అంత ఆసక్తి అంటే ఆయన సీనియర్ మోస్ట్ అధికారిగా పనిచేసిన వారు. ఇక ఆయన పదవిలో ఉండగా ఒక పార్టీ నుంచి రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన ఇపుడు రేసులోకి దిగడంతో ఆయనకు మద్దతు ఏ వైపు నుంచి వస్తుంది అన్నది కూడా చర్చగానే ఉంది. అయితే ఇక్కడ రాజకీయంతో పాటు సామాజిక సమీకరణలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముందే చెప్పుకున్నట్లుగా బెజవాడ అనగానే రెండు ప్రధాన సామాజిక వర్గాల ఆధిపత్యం ఎపుడూ ఉంటుంది. అలా ఒక బలమైన సామాజిక పక్షానికి చెందిన ఏబీవీ పోటీకి దిగడంతో ఎవరికి దెబ్బ ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది.

వైసీపీ సంగతేంటి :

ఇక వైసీపీ అయితే కూటమి ఎత్తుకు పై ఎత్తు వేయాలని చూసింది. ఒక దశలో యువ నేత దేవినేని అవినాష్ ని రంగంలోకి దించాలనుకుంది. కానీ అది కుదరలేదు, దాంతో రాయన భాగ్యలక్ష్మిని పోటీకి రెడీ చేసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అన్న కార్డుతో వైసీపీ రంగంలో ఉంది. అయితే కూటమి వర్సెస్ వైసీపీ అన్నపుడు ఎంతో కొంత ఓటు వైసీపీకి పడేది. కానీ ఇపుడు ఏబీవీ రంగంలో ఉండడంతో వైసీపీకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితి అని అంటున్నారు. గత ఎన్నికల్లో వార్డు కార్పోరేటర్ గా గెలిచి మేయర్ అయ్యారు ఆమె. దాంతో ఆమె నగరం మొత్తానికి మేయర్ గా కొంత వరకూ పరిచయం ఉన్నా రాజకీయ పట్టు ఆ విధంగా లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏబీవీ కూడా గెలుపు సంగతి పక్కన పెడితే తనకు భారీగా ఓట్లను దక్కించుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అని అంటున్నారు. ఒక బలమైన సామాజిక వర్గం దన్నూ మద్దతు కూడా దక్కవచ్చు అన్న చర్చ సైతం సాగుతోంది. ఈ విధంగా సాగే పోరులో వైసీపీ కచ్చితంగా ఇరాకాటంలో పడి మూడవ ప్లేస్ లోకి వెళ్తుందా అన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే ఏబీవీ ఓడినా రన్నరప్ గా హిట్ అవుతారు. వైసీపీ రాజకీయ రాజధానిలో చేదు ఫలితాలను అందుకోవాల్సి వస్తుంది. మరి ఆ పరిస్థితి తలెత్తకుండా వైసీపీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అన్నదే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News