11 నంబర్...జగన్ ని టార్గెట్ చేసిన విజయసాయి ?
వైసీపీ మాజీ నాయకుడు విజయసాయి రెడ్డి పాత పార్టీని మాజీ బాస్ జగన్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు.
వైసీపీ మాజీ నాయకుడు విజయసాయి రెడ్డి పాత పార్టీని మాజీ బాస్ జగన్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఏపీ పాలిటిక్స్ లో రెండు ప్రధాన పార్టీలకు మధ్యలో బ్యాలెన్స్ గా ఉన్నాను అని చెప్పే ప్రయత్నంలో కొంత వరకూ టీడీపీ మీద దాని అధినాయకుడు చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నా ఎక్కువ భాగం మాత్రం జగన్ నే కార్నర్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక జగన్ మతం గురించి ఆయన తరచూ ప్రస్తావించడం ద్వారా తన కొత్త పార్టీ రాజకీయ విధానం టార్గెట్ ఎవరి మీద బలంగా ఉండబోతోందో పరోక్షంగా చెబుతున్నారు అని అంటున్నారు.
నవంబర్ 11 డేట్ :
ఇపుడు చూస్తే విజయసాయిరెడ్డి నవంబర్ 11న తన కొత్త పార్టీని స్థాపిస్తున్నాను అని ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉన్నా అందులో పదకొండు నంబర్ సెట్ చేసి మరీ ముహూర్తం పెట్టారు నవంబర్ 11, ఉదయం పదకొండు గంటల పదకొండు నిముషాలకు అని చెప్పారు. ఇక్కడ చూస్తే నాలుగు 11 నంబర్లు వస్తున్నాయి. నవంబర్ నెల అంటే 11వ నెల, 11వ తేదీ 11 గంటలు, 11 నిముషాలు. ఇలా అన్ని చోట్లా 11ని తీసుకుని రావడంతో పరోక్షంగా వైసీపీని ర్యాగింగ్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే వైసీపీకి 2024 లో వచ్చిన సీట్లు పదకొండు. దాంతో సోషల్ మీడియాలో వైసీపీని ఎలెవెన్ పార్టీ అని ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇపుడు అదే ఎలెవెన్ నంబర్ ని తన ముహూర్తంగా విజయసాయిరెడ్డి పెట్టుకోవడం అంటే వైసీపీని జగన్ ని టార్గెట్ గట్టిగానే చేస్తున్నారు అని అంటున్నారు.
అజెండా నంబర్ కూడా :
అంతే కాదు కొత్త పార్టీ అజెండాలోని రాజకీయ అంశాలు కూడా 11 ఉంటాయని పేర్కొంటున్నారు. అంటే ఇలా అడుగడుగునా 11 నంబర్ ని పదే పదే ప్రస్తావించడం ద్వారా విజయసాయిరెడ్డి తన మాజీ పార్టీని దాని అధినాయకుడు జగన్ ని సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారా అన్న చర్చకు ఆస్కారం కల్పించారు. నిజానికి యాధృచ్చికంగా అయితే 11 ఒక చోట రావాలి. కానీ ముహూర్తంలో నాలుగు 11 అంకెలు వచ్చాయి. అజెండా అంశాలు కూడా 10 కాదు, 12 కాదు, కచ్చితంగా 11 అంశాలే ఉన్నాయి. దాంతో విజయ సాయిరెడ్డి పార్టీ జగన్ నే టార్గెట్ చేస్తోంది అన్న చర్చ సాగుతోంది. రప్పా రప్పా రాజకీయాలు అంటూ మత పిచ్చి అంటూ ఆయన వైసీపీ మీద చేసిన విమర్శలు కూడా ఘాటెత్తిపోయేలా ఉన్నాయని అంటున్నారు.
వైసీపీకే షాక్ :
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం ఎంత అది ఎన్నికల్లో సాధించే ఓట్లు ఎంత అన్నది పక్కన పెడితే ఎంతో కొంత నష్టం అయితే వైసీపీకే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన వైసీపీ పునాది నుంచి ఉన్న నాయకుడు. ఆ పార్టీ నేతలతోనే పరిచయాలు ఉన్నాయి. వైసీపీ ఆనుపానులు అన్నీ ఆయనకే తెలుసు అని అంటున్నారు. ఇక కొత్త పార్టీ ద్వారా విజయసాయిరెడ్డి ఆకట్టుకునేది కూడా వైసీపీ నాయకులనే అని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ బీజేపీ జనసేన వైసీపీ నాయకులను తమ వైపు లాగేసుకుంటున్నాయి. ఇపుడు విజయసాయిరెడ్డి కూడా అదే పనిలో ఉంటే మాత్రం వైసీపీకే ఇబ్బంది అని అంటున్నారు.