సాయికృష్ణ కేసుపై సుప్రీం సంచలన నిర్ణయం.. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2026-09-23 08:59 GMT

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు తీరును తప్పుబడుతూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించింది. సెప్టెంబరు 30లోగా కేసు వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా హైకోర్టులో సాయికృష్ణ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లను తమకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేసింది.

గాదె సాయికృష్ణ కేసులో సుప్రీం వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. వైసీపీ ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్ ఆధారంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర పోలీసులకు పలు ప్రశ్నలు సంధించింది. సాయికృష్ణ మిస్సింగ్ పై ఆయన తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని నిలదీసింది. డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించడంతోపాటు పోలీసు స్టేషన్ పర్యవేక్షించాల్సిన ఏసీపీపైనా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, సీసీటీవీ పుటేజ్ ధ్వంసం చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందని అంటున్నారు.

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ కేసు ఇప్పటికే తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ప్రభుత్వ జోక్యంతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీని ఛేదించినప్పటికీ వైసీపీ మాత్రం జరిగిన ఘటనను తేలిగ్గా తీసుకోవడం లేదని అంటున్నారు. బాధితులకు న్యాయం చేయడంతోపాటు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందనే చర్చను జాతీయస్థాయికి తీసుకువెళ్లేందుకు విపక్షం పకడ్బందీగా వ్యూహరచన చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మే 9 నుంచి అదృశ్యమయ్యారు. ఆయన్ను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపణలు ఉన్నాయి.సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎంతకీ కోర్టులో హాజరుపరచకపోవడం, ఆయన ఆచూకీ లభించకపోవడంతో తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలోనే తమ కుమారుడిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారని, మృతదేహాన్ని మాయం చేశారని తల్లి ఆరోపించడంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ నేపథ్యంలో సాయికృష్ణ అదృశ్యం కేసులో మిస్టరీ ఛేదించేందుకు ప్రభుత్వం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ వేయగా, అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజుతోపాటు మరికొందరు హెడ్ కానిస్టేబుళ్లు కలిసి సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసినట్లు సిట్ పోలీసులు ఆధారాలు సంపాదించినట్లు చెబుతున్నారు. దీనిపై తాజాగా కోర్టులో చార్జిషీటు కూడా దాఖలు చేశారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకువచ్చిన పోలీసులు విజయవాడలో ఒక పాడబడిన భవనంలో చిత్రహింసలకు గురిచేశారని, పోలీసు దెబ్బల వల్ల అతడు మృతి చెందాడని సిట్ కోర్టుకు తెలియజేసింది. దీంతో కేసు కొలిక్కి వచ్చినట్లుగా భావిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు జోక్యంతో అనూహ్య మలుపుతిరిగిందని అంటున్నారు. ఎంపీ గురమూర్తి ఫిర్యాదుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసును తామే పర్యవేక్షిస్తామని తేల్చిచెప్పడం సంచలనం సృష్టిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News