వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?
| విజయవాడ మేయర్‌గా జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ కూడా వేడుకకు వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 25 ఏళ్ల తర్వాత మేయర్ పదవి చేపడుతున్న రాధా ప్రమాణ స్వీకారంపై ఆసక్తి నెలకొంది.
విజయవాడ వంటి రాజకీయ రాజధానిలో కూటమి జెండా బలంగా పాతింది. మేయర్ గా కూటమి తరఫున జనసేన అభ్యర్ధి వంగవీటి రాధాకృష్ణ లక్షా ముప్పై అయిదు వేల పై చిలుకు ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. పాతికేళ్ళ తరువాత ఆయన ఈ విలువైన పదవిని అందుకున్నారు. ఆయన తండ్రి కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా మొదట కార్పొరేటర్ గానే గెలిచి విజయవాడ నగర పాలక సంస్థ నుంచి తన రాజకీయాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత ఆయన తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే రాధాకృష్ణ ఇక్కడ రివర్స్. ఆయన విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇపుడు విజయవాడ కార్పోరేషన్ లో అడుగుపెడుతున్నారు. అయితే మేయర్ గా బెజవాడ రాజకీయాన్ని శాసించే పాత్రలోకి ఆయన వెళ్ళారు.
అతిరధ మహారధులు :
ఇదిలా ఉంటే వంగవీటి రాధాకృష్ణ మేయర్ గా ప్రమాణం చేసే కార్యక్రమాన్ని అదిరిపోయే రేంజిలో నిర్వహించాలని కూటమి ఆలోచిస్తోంది. విజయవాడ నడిబొడ్డున సాగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే కూటమికి చెందిన మొత్తం మంత్రులు అంతా హాజరవుతారని అంటున్నారు. అలాగే అతిరధ మహారధులు ఎందరో ఈ ప్రమాణ కార్యక్రమానికి వస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.
చిరంజీవి బాలయ్య :
అయితే ఈ మొత్తం పేర్లు ఒక ఎత్తు సినీ ఇండస్ట్రీ నుంచి టాప్ స్టార్స్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ హాజరవుతారు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఈ ఇద్దరు సినీ ఇండస్ట్రీ తరఫున మాత్రమే కాదు వారికి రాధాతో ఉన్న పరిచయాలు వల్ల కూడా హాజరవుతారు అని అంటున్నారు. ఇక ప్రజారాజ్యం నుంచి 2009లో రాధాకృష్ణ పోటీ చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. దాంతో చిరంజీవికి ఆయనతో ఉన్న బంధాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇపుడు జనసేన నుంచి మేయర్ గా రాధా గెలవడంతో చిరంజీవి తప్పక వస్తారు అని అంటున్నారు. బాలయ్య అయితే కూటమి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా రాధాకృష్ణ తో ఉన్న స్నేహం కారణంగా వస్తున్నారు అని చెబుతున్నారు.
కన్నుల పండుగగా:
ఇలా మెగాస్టార్ బాలయ్య వస్తున్నారు అన్న ప్రచారంతోనే రాధా పట్టాభిషేకం ఏ రేంజిలో ఉండబోతోంది అన్నది తెలుస్తోంది అంటున్నారు. ఇక్కడ వంగవీటి ఒక బ్రాండ్. అలాగే విజయవాడ మరో బ్రాండ్. కూటమి భారీ విజయాలు ఇంకో బ్రాండ్. దాంతో అన్నీ కలిపి బెజవాడ నుంచే బిగ్ సౌండ్ చేయడానికే ఈ వేడుకను వేదికగా చేసుకుంటున్నారు అని అంటున్నారు. చూడాలి మరి చిరంజీవి బాలయ్య కనుక వస్తే మాత్రం బెజవాడ హోరెత్తిపోవడం ఖాయమనే అంటున్నారు.