2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?
| దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈడీ నవంబర్ 18న సవరించిన చార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో జప్తు చేసిన రూ.793.34 కోట్ల ఆస్తుల విలువను అప్పిలేట్ ట్రైబ్యునల్ రూ.92.52 కోట్లకు తగ్గించిన నేపథ్యంలో ఈడీ తాజా సవరణలు చేసినట్లు సమాచారం. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఒక్కసారిగా వేగం పెంచింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో ఇవాళ (నవంబర్ 18) కోర్టులో సవరించిన కొత్త చార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ సీఎం జగన్మోహనరెడ్డిపై ఇప్పటివరకు 9 చార్జిషీట్లు దాఖలు కాగా, తాజాగా పదో అస్త్రం సంధించినట్లుగా భావిస్తున్నారు. అంతేకాకుండా మాజీ సీఎం చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అన్న చర్చ జోరందుకుంది. తాజా చర్యను కేవలం న్యాయపరమైన ప్రక్రియగానే కాకుండా, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, జగన్‌కు మధ్య సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
ఇదీ అసలు కథ
దాల్మియా సిమెంట్స్ కేసులో ఈడీ తాజా కదలిక వెనుక బలమైన న్యాయపరమైన కారణాలు ఉన్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులను రోజువారీ విచారణకు అనుమతించడంతో, డిశ్చార్జ్ పిటిషన్లపై త్వరగా తేల్చేందుకు దర్యాప్తు సంస్థ సిద్ధమైందని అంటున్నారు. గతంలో ఈ కేసులో మనీలాండరింగ్ కింద ఈడీ రూ. 793.34 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అయితే, ఈ ఏడాది మార్చిలో అప్పిలేట్ ట్రైబ్యునల్ నేరార్జన మొత్తాన్ని రూ. 92.52 కోట్లకు తగ్గించింది. అదే సమయంలో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు బదులు బ్యాంకు గ్యారెంటీ వంటి ప్రత్యామ్నాయ భద్రత కల్పించే వెసులుబాటు ఇచ్చిందని చెబుతున్నారు. ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా పాత ప్రాసిక్యూషన్ ఫిర్యాదుకు కీలక సవరణలు చేస్తూ ఈడీ తాజా చార్జిషీటు వేసినట్లుగా భావిస్తున్నారు.
ఢిల్లీ సమీకరణాలు మారుతున్నాయా?
మాజీ సీఎం జగన్ కేసుల్లో ఈడీ దూకుడు వెనుక రాజకీయ కోణం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రంతో జగన్ సత్సంబంధాలు నెరిపారనే విమర్శలు ఉండేవి. అప్పట్లో రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదం కోసం బీజేపీకి వైసీపీ మద్దతు అవసరమయ్యేది. కానీ, 2024 ఎన్నికల ఫలితాలు ఆ లెక్కలను తలకిందులు చేశాయి. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడం, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు కీలక భాగస్వామిగా మారడంతో ఢిల్లీ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమై, పార్లమెంటులో బలం కోల్పోయిన వైసీపీ అవసరం ఇప్పుడు కేంద్రానికి లేకుండా పోయిందని, ఫలితంగానే జగన్ కేసులపై దృష్టి పెట్టిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఒత్తిడిలో వైసీపీ అధినేత?
అక్రమాస్తుల కేసు మాత్రమే కాకుండా, గత వైసీపీ హయాంలో జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం స్కాంతోపాటు పలు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ అధికారులతో ప్రత్యేక దర్యాప్తులు జరిపిస్తోంది. ఈ కేసులపైనా ఈడీ కన్నేసినట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలు, మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులతో మాజీ సీఎం జగన్ న్యాయపరంగా, రాజకీయంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని భావిస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావంతోనే జగన్ తన రాజకీయ వ్యూహంలో మార్పులు చేసుకుంటున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన ఇస్తున్న సంకేతాలు కూడా తాజా చిక్కుల తీవ్రతకు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.