టీడీపీ హాట్ టాపిక్: విజయనగరం జడ్పీ ప్రస్తుతానికి రెండేళ్లేనా..?
| విజయనగరం జడ్పీ చైర్మన్ పదవిపై టీడీపీలో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. కులపరమైన ఇబ్బందులు, కోర్టు కేసుల నేపథ్యంలో సిరి సహస్రకు బదులుగా కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లు చంద్రకళకు, ఆ తర్వాత సిరి సహస్రకు పదవి ఇచ్చే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన జడ్పీ స్థానం విజయనగరం. ఇక్కడ టీడీపీకి బలమైన నాయకులు, మంత్రులు ఉన్నారు. ఇదేసమయంలో వైసీపీకి కూడా బొత్స సత్యనారాయణ వంటి కీలక నాయకుడు ఉండడంతో ఈ జిల్లాపై పట్టు ఇరు పక్షాల మధ్య ఊగిసలాడుతోంది. దీంతో బొత్స వ్యక్తిగతంగానే కాకుండా.. పార్టీ పరంగా కూడా తమ ప్రాధాన్యం తగ్గించుకునేందుకు అంగీకరించడం లేదు. పైగా తన కుమార్తె అనూష ఓటమి నుంచి ఆయన ఇంకా బయట పడలేదు. ఇలాంటి సమయంలో విజయనగరం జడ్పీ విషయంలో ఆయన పట్టుదలతో ఉన్నారు.
వాస్తవానికి విజయనగరంలో వైసీపీ ఓడిపోయింది. అయినప్పటికీ.. తన మేనల్లుడు.. మజ్జి శ్రీను తనకు వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్లిపోయారని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమార్తె సిరి సహస్రకు విజయనగరం జడ్పీ దక్కితే.. అది మరింతగా తనకు ఇబ్బంది అవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సిరి సహస్రను సాధ్యమైనంత వరకు దూరం పెట్టాలన్నది ఆయన ఉద్దేశం. ఇక, ప్రమాణ స్వీకారానికి కూడా సమయం చేరువ అయిన నేపథ్యంలో టీడీపీలో ఈ విషయం చర్చకువచ్చింది.
సిరిసహ్రసకు కులం ప్రాతిపదికన ఎదురైన ఇబ్బందులు ఇప్పట్లో తొలగిపోయే అవకాశం లేదని భావిస్తున్న టీడీపీ నాయకత్వం.. ఈ స్థానంలో మరో నేతకు అవకాశం ఇచ్చేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే పూసపాటిరేగ జడ్పీటీసీ, మార్క్ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళ పేరును అధిష్టానం పరిశీలిస్తోంది. అయితే.. ఇదేసమయంలో చిన్న శ్రీను వారసురాలికి ఇబ్బంది లేకుండా.. కోర్టు కేసులు తేలేవరకు.. ఈ స్థానంలో రెండేళ్ల సమయానికి విభజించి.. ఇద్దరిని జడ్పీ చైర్మన్లు పేర్కొనే అవకాశం ఉంది.
2024 ఎన్నికల్లో జనసేనకు నెల్లిమర్ల అసెంబ్లీ సీటు కేటాయించడంతో టీడీపీ టికెట్ ఆశించిన బంగార్రాజు ఆ స్థానా న్ని వదులుకోవలసి వచ్చింది. ఈ కారణంగా ఆయన ఇప్పుడు తన కుమార్తెకు జడ్పీ పీఠం ఇవ్వాలని కోరుతున్నా రు. దీంతో ఉభయ కుశలోపరిగా.. ఇప్పటికిప్పుడు బంగార్రాజు కుమార్తెకు అవకాశం ఇచ్చి.. కోర్టు కేసులు తేలిన తర్వాత.. సిరిసహస్రకు అవకాశం కల్పించే దిశగా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా అయితే..ఏ వర్గానికీ ఇబ్బంది ఉండదన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. తద్వారా రెండు+ మూడు సంవత్సరాల పాటు ఈ పదవిని పంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.