జెడ్పీ పీఠం కిమిడి కుటుంబానిదేనా !
| విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం కోసం కిమిడి కళా వెంకట్రావు, బొత్స సత్యనారాయణ కుటుంబాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కళా వెంకట్రావు కోడలు సంధ్య, బొత్స కోడలు గరివిడి నుంచి జెడ్పీటీసీలుగా పోటీ చేస్తున్నారు. మరోవైపు చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర పోటీపై వైసీపీ ఫిర్యాదు చేయడంతో వివాదం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జెడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
విజయనగరం జిల్లా పరిషత్తు పీఠం ఈసారి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు చీపురుపల్లి ఎమ్మెల్యే అయిన కిమిడి కళా వెంకట్రావు కుటుంబానికే దక్కుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య చీపురుపల్లి లోని గరివిడి నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయడం వెనక హైకమాండ్ భరోసా ఉందని అంటున్నారు. అలా హామీ లేకపోతే కోడల్ని పోటీకి దించేది ఉండదని చెబుతున్నారు. ఎంతో మంది దిగ్గజ నేతల వారసులు కూడా ఈ సీటు మీద ఆశలు పెట్టుకున్నా పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన నేతగా కిమిడిని గౌరవించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ హామీ ఇచ్చారని చెబుతున్నారు. అంతే కాదు కిమిడికి 2024లో గెలిచిన తరువాత మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఇపుడు ఈ రూపంలో ఆయనకు రాజకీయంగా న్యాయం చేసినట్లు అవుతుందని కూడా లెక్క ఉందని అంటున్నారు.
చిన్న శ్రీను కూతురు సంగతి :
అదే సమయంలో విజయనగరం జెడ్పీ పీఠం మీద ఆశతో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన చిన్న శ్రీను కూతురు సంగతి ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. అయితే ఆమె బీసీ కాదని జైన్ మతానికి చెందిన ఆమెను చిన్న శ్రీను దత్తత తీసుకున్నారని అంటున్నారు. దీని మీద వైసీపీ ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేసింది. ఆ మీదట హైకోర్టులో కేసు కూడా వేసింది. హైకోర్టు ఈ విషయంలో పరిశీలించాలని రిటర్నింగ్ అధికారికి సూచించినట్లుగా తెలుస్తోంది. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం తెర్లాం నుంచి జెడ్పీటీసీగా చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర పోటీ చేశారు. ఇది బీసీ సీటు అని ఇక్కడ ఎలా పోటీ చేస్తారు అని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇపుడు ఈ కేసు వల్ల పరిణామాలు ఏమైనా జరగవచ్చు అన్నది కూడా ఉంది. దాంతో ఈ వివాదంతో కిమిడి కోడలికి అవకాశాలు పెరిగాయని అంటున్నారు.
బొత్స కుటుంబం నుంచి :
మరో వైపు చూస్తే బొత్స సత్యనారాయణ కోడలు కూడా జెడ్పీటీసీగా గరివిడి నుంచి పోటీ చేస్తున్నారు. అలా కిమిడి కోడలు బొత్స కోడలు మధ్యలో టఫ్ ఫైట్ నడిచింది. దాంతో జెడ్పీటీసీ పీఠం విషయంలో కూడా చీపురుపల్లి రాజకీయమే కీలక పాత్ర పోషిస్తోంది అని అంటున్నారు. అంతకు ముందు 2024 లో కూడా బొత్స చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేస్తే టీడీపీ నుంచి కళా వెంకట్రావు పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఇద్దరూ రెండు పార్టీల నుంచి సీనియర్లు. అలాగే దిగ్గజ నేతలు, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారు. ఇపుడు ఇద్దరి రాజకీయ జెడ్పీ దగ్గర నిలిచింది అని అంటున్నారు. కూటమి తరఫున కిమిడి ఫ్యామిలీకి పీఠం దక్కితే మాత్రం విజయనగరం రాజకీయాల్లో కళా వెంకట్రావు పాగా వేసినట్లే అని అంటున్నారు.